టెక్ జాబ్ వదిలి రూ. 600 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన టెక్నో విజయగాథ
టెక్నోస్పోర్ట్ తన వ్యూహాన్ని మార్చుకుని కేవలం `స్పోర్ట్స్ వేర్`గానే కాకుండా.. సామాన్యులు నిత్యం ధరించే `యాక్టివ్ వేర్`గా తనను తాను రీ-బ్రాండింగ్ చేసుకుంది.
By: Sivaji Kontham | 22 April 2026 4:00 PM ISTసాధారణంగా ఐటీ రంగంలో మంచి ఉద్యోగం ఉంటే ఎవరైనా దానిని వదులుకోవడానికి ఇష్టపడరు. కానీ సునీల్ ఝున్‌జున్ వాలా 2007లో ఐటీ రంగం ఊపుమీదున్న సమయంలోనే మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలో తన స్థిరమైన ఉద్యోగాన్ని వదిలేశారు. కేవలం 20 లక్షల రూపాయల కుటుంబ పొదుపు మొత్తంతో తిరుప్పూర్ వేదికగా `టెక్నోస్పోర్ట్` అనే బ్రాండ్‌ను ప్రారంభించి టెక్స్‌టైల్ రంగంలోకి అడుగుపెట్టారు. నాడు చిన్న అడుగుతో మొదలైన ఈ ప్రయాణం నేడు 600 కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన యాక్టివ్‌వేర్ బిజినెస్‌గా ఎదిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1000 కోట్ల రూపాయల రెవెన్యూ లక్ష్యంగా ఈ సంస్థ దూసుకుపోతోంది.
ప్రారంభంలో టెక్నోస్పోర్ట్ ఒక తయారీ సంస్థగా కాకుండా కేవలం ట్రేడింగ్ యూనిట్‌గా మాత్రమే ఉండేది. లుధియానా, సిల్వాసా వంటి ప్రాంతాల నుంచి సింథటిక్ వస్త్రాలను సేకరించి.. తిరుప్పూర్‌లో దుస్తులను కుట్టించి తమ సొంత లేబుల్‌తో విక్రయించేవారు. నైక్, అడిడాస్, రీబాక్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లు భారతదేశంలో ప్రాచుర్యం పొందుతున్నా అవేవీ సామాన్య ప్రజలకు అందుబాటులో లేవనే విషయాన్ని సునీల్ గమనించారు. ఆ ఖరీదైన బ్రాండ్లకు ధీటుగా నాణ్యత, సౌకర్యం కలిగిన దుస్తులను సామాన్యులకు సైతం అందుబాటు ధరల్లో అందించాలనే బలమైన సంకల్పంతో ఆయన ఈ సంస్థను స్థాపించారు.
అయితే అంతర్జాతీయ బ్రాండ్లతో పోటీ పడటం అంత సులభం కాలేదు. తొలినాళ్లలో గ్లోబల్ ప్రోడక్ట్స్ లాంటి `లుక్` తీసుకురాగలిగారు కానీ ఆ స్థాయి పర్ఫార్మెన్స్ అందించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో 2010లో చైనా, తైవాన్‌లలో జరిగిన టెక్స్‌టైల్ ఎక్స్‌పోలను సందర్శించడం సునీల్ కెరీర్‌లో ఒక మలుపుగా మారింది. అక్కడ హై-పర్ఫార్మెన్స్ ఫ్యాబ్రిక్స్ వెనుక ఉన్న విజ్ఞానాన్ని.. ముఖ్యంగా తేమను పీల్చుకునే సాంకేతికతను ఆయన అధ్యయనం చేశారు. తిరిగి వచ్చాక కేవలం వస్త్రాలను సేకరించడమే కాకుండా.. భారతీయ వాతావరణానికి తగ్గట్టుగా సింథటిక్ ఫైబర్లను స్వయంగా డిజైన్ చేయడంపై దృష్టి పెట్టారు.
టెక్నోస్పోర్ట్ తన వ్యూహాన్ని మార్చుకుని కేవలం `స్పోర్ట్స్ వేర్`గానే కాకుండా.. సామాన్యులు నిత్యం ధరించే `యాక్టివ్ వేర్`గా తనను తాను రీ-బ్రాండింగ్ చేసుకుంది. అథ్లెట్లకే కాకుండా ఆఫీసులకు వెళ్లేవారు డెలివరీ బాయ్స్.. చివరకు రైతులు సైతం సౌకర్యవంతంగా ధరించేలా ఈ దుస్తులను రూపొందించడం ద్వారా మార్కెట్‌ను భారీగా విస్తరించుకుంది. ప్రస్తుతం తిరుప్పూర్ పరిసరాల్లో రోజుకు 30 టన్నుల వస్త్రాన్ని ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఈ సంస్థకు ఉంది. దీని ద్వారా ప్రతిరోజూ సుమారు 1.2 లక్షల దుస్తులు తయారవుతున్నాయి. ఫ్యాబ్రిక్ ఉత్పత్తిపై పూర్తి నియంత్రణ ఉండటం వల్లే నాణ్యతను కాపాడుతూ తక్కువ ధరకే దుస్తులను అందించడం సాధ్యమవుతోంది.
వ్యాపార వృద్ధితో పాటు పర్యావరణ స్పృహను కూడా టెక్నోస్పోర్ట్ ప్రాధాన్యతగా ఎంచుకుంది. ఈ సంస్థ తయారీ ప్లాంట్లు పునరుత్పాదక ఇంధనంతో నడుస్తుండటమే కాకుండా .. `జీరో లిక్విడ్ డిశ్చార్జ్` నిబంధనలను పాటిస్తూ కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను తగ్గించేందుకు కృషి చేస్తున్నాయి. సుస్థిరమైన అభివృద్ధి.. సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలు, నాణ్యమైన సాంకేతికత.. ఈ మూడు సూత్రాలే టెక్నోస్పోర్ట్‌ను నేడు భారతీయ వస్త్ర ప్రపంచంలో ఒక అజేయమైన శక్తిగా నిలబెట్టాయి.
