తిరుపతిలో కీలక పరిణామం - భూమన సమక్షంలో మతమార్పిడి
ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వంపై, ముఖ్యంగా అప్పట్లో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి వంటి నేతలపై హిందూ వ్యతిరేక ముద్ర వేసేందుకు ప్రత్యర్థి పార్టీలు ప్రయత్నించాయని అంటున్నారు.
By: Tupaki Political Desk | 2 April 2026 1:57 PM ISTఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక ముస్లిం కుటుంబం హిందూ ధర్మాన్ని స్వీకరించింది. తిరుపతికి చెందిన అబ్దుల్లా, అమ్మిన్నా దంపతులు తమ ఇష్టపూర్వకంగా సనాతన ధర్మంలోకి మారుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నేత భూమన నేతృత్వం వహించడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.
తిరుపతిలో భూమన పర్యవేక్షణలో అబ్దుల్లా దంపతులు హిందూమత పునఃస్వీకరణ మహోత్సవాన్ని నిర్వహించారు. అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా వారికి హిందూ మత దీక్షను అందించారు. ఈ సందర్భంగా అబ్దుల్లా దంపతులు హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ, సనాతన ధర్మం పట్ల తమకున్న మక్కువతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మతమార్పిడుల అంశంపై తీవ్ర స్థాయిలో రాజకీయ చర్చ జరుగుతోంది. ప్రధానంగా వైసీపీ అన్యతమతస్తులకు అనుకూలంగా పనిచేస్తోందని ప్రత్యర్థుల ఆరోపణలు ఎదుర్కొందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ సీనియర్ నేత ఆధ్వర్యంలో హిందూ మతంలోకి ఓ కుటుంబం మారడం రాజకీయంగా ప్రాధన్యాంశంగా మారిందని అంటున్నారు.
తిరుపతి లడ్డూ కల్తీ అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వంపై, ముఖ్యంగా అప్పట్లో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి వంటి నేతలపై హిందూ వ్యతిరేక ముద్ర వేసేందుకు ప్రత్యర్థి పార్టీలు ప్రయత్నించాయని అంటున్నారు. ఈ సంఘటన ద్వారా తమపై అన్యమత ప్రచారం, మతమార్పిడులను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలను తిప్పికొట్టడానికి వైసీపీ ఇప్పుడు దూకుడు చూపుతోందని అంటున్నారు. తాము అన్ని మతాలను గౌరవిస్తామని, ముఖ్యంగా హిందూ ధర్మ పరిరక్షణలో వెనుకడుగు వేయబోమని చాటిచెప్పడానికి ఇలాంటి కార్యక్రమాలను ఒక వేదికగా చేసుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
తిరుమల పవిత్రతపై వచ్చిన ఆరోపణల వల్ల దెబ్బతిన్న పార్టీ ప్రతిష్టను తిరిగి పుంజుకునేలా చేయడం కోసం భూమన కరుణాకర్ రెడ్డి ఈ తరహా "ఘర్ వాపసీ" కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. మతమార్పిడి అంశం రాజకీయాల్లో ఎప్పుడూ సెన్సిటివ్ టాపిక్ గా ఉంటుంది. ఒకవైపు మత స్వేచ్ఛ గురించి వాదనలు వినిపిస్తున్నా, మరోవైపు రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకుంటున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే, తిరుపతి వంటి పవిత్ర క్షేత్రంలో టీటీడీ మాజీ చైర్మన్ సమక్షంలోనే ఈ మార్పు జరగడం ద్వారా తాము హిందూ ధర్మానికి వ్యతిరేకం కాదనే బలమైన సంకేతాన్ని ప్రజల్లోకి పంపాలని వైసీపీ భావిస్తోంది.
