Begin typing your search above and press return to search.

శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. 9నెలల్లో అత్యాధునిక ల్యాబ్

తొమ్మిది నెలల రికార్డు సమయంలో సిద్ధం చేసిన ఈ ల్యాబ్ లో అత్యాధునిక సాంకేతికతతో సిద్దం చేశారు.

By:  Garuda Media   |   19 March 2026 9:40 AM IST
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. 9నెలల్లో అత్యాధునిక ల్యాబ్
X

తప్పులు జరగటం ఒక ఎత్తు. వాటికి చెక్ పెట్టటం మరో ఎత్తు. తప్పులకు అవకాశం ఇచ్చే దారుల్ని శాశ్వితంగా మూసే తెలివిని ప్రదర్శించటం మరో ఎత్తు. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారటమే కాదు.. కోట్లాది మంది శ్రీవారి భక్తులకు షాకిచ్చిన లడ్డూ ప్రసాదం కల్తీకి సంబంధించి.. కీలక అడుగు పడింది. కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో అత్యాధునిక ల్యాబ్ ను సిద్ధం చేయటమే కాదు.. ఈ నెల 21న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు జరగనున్నాయి.

దేశంలోని మరే దేవాలయానికి లేని విధంగా.. కల్తీ అత్యంత సూక్ష్మంగా జరిగినా ఇట్టే పట్టేసే అత్యాధునిక యంత్రాలు.. సాంకేతికతతో ల్యాబ్ ను సిద్ధం చేశారు. ఈ ల్యాబ్ విషయానికి వస్తే 12వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. అంతేకాదు.. రూ.20 కోట్లతో భవనాన్ని, అందులో అవసరమైన ల్యాబ్ సామాగ్రి.. యంత్రాలు.. జనరేటర్లు ఇలా మొత్తం సిద్ధం చేసేందుకు ఖర్చు చేశారు.

ఇప్పటివరకు కల్తీని పీపీఎం స్థాయిలో గుర్తించే వారు. అందుకు భిన్నంగా ఈ అత్యాధునిక ల్యాబ్ మరో ప్రత్యేకత ఏమంటే.. ఇకపై కల్తీని అత్యంత సూక్ష్మ స్థాయిలోనే పసిగట్టేలా సిద్ధం చేశారు. పీపీఎంకు బదులుగా పీపీటీ (పార్ట్స్ పర్ ట్రిలియన్) స్థాయిలోనూ గుర్తించే వెసులుబాటు ఈ ల్యాబ్ సొంతం. ప్రసాదాల ముడి పదార్థాల రసాయనాల విశ్లేషణ.. ముడిసరుకుల ఫిజికల్.. కెమికల్ ఎనాలిసిస్ తో పాటు.. పురుగులు ఉన్నాయా? డ్యామేజ్ ఉందా? నెయ్యి.. నూనెల్లో ఎసిడిటీ.. ఐవీ వాల్యూ వంటివి పరీక్షిస్తారు. తాగునీటిలో క్లోరైడ్.. సల్ఫేట్.. మెగ్నీషియం శాతాన్ని లెక్కించే సామర్థ్యం ఈ అత్యాధునిక ల్యాబ్ సొంతం.

తొమ్మిది నెలల రికార్డు సమయంలో సిద్ధం చేసిన ఈ ల్యాబ్ లో అత్యాధునిక సాంకేతికతతో సిద్దం చేశారు. ఇప్పటివరకు ప్రసాదాల నమూనాలను పరీక్షల కోసం బయట ల్యాబ్ లకు పంపాల్సిన అవసరం లేదు. ముడిసరుకుల్లోని ఎరువులు.. రసాయనాల అవశేషాల్ని ఈ ల్యాబ్ లోనే పసిగట్టేలా వ్యవస్థను సిద్ధం చేశారు. ఈ ల్యాబ్ కు త్వరలో ‘‘ ఈ-నోస్, ఈ - టంగ్’’ అనే సరికొత్త పరికరాలు రానున్నాయి. ఇందుకోసం రూ.3 కోట్ల నిధులను కేంద్రం మంజూరుచేసింది. దీని ప్రత్యేకత ఏమంటే శాంపిల్ ఫీడ్ చేస్తే వాసన.. రుచి ఆధారంగా అది స్వచ్ఛమైన నెయ్యా? కాదా? అన్నది తేల్చేయటంతో పాటు కల్తీ.. చెడువాసన వస్తుందా? లేదా? అన్న వివరాల్ని సైతం యంత్రమే ఇచ్చే ప్రత్యేకత వీటి సొంతం.

ఈ ల్యాబ్ లో మరో విశేషం ఉంది. ల్యాబ్ లోపల గాలి మొత్తం ఎప్పటికప్పుడు స్టెరిలైజ్ అయ్యేలా ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ ను సిద్ధం చేశారు.దీంతో రోజంతా టెంపరేచర్.. ప్రెషర్..హ్యుమిడిటీ ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతాయి. ముడిసరుకుల్లోని క్యాల్షియం.. సోడియం.. మెగ్నీషియం.. జింక్ లాంటివి ఎంత పరిమాణంలో ఉన్నాయన్న విషయాన్ని స్పష్టంగా నిర్దారించేలా దీన్ని ఏర్పాటు చేశారు.

అంతేకాదు.. ఆయా ముడి పదార్థాల విలువల కచ్ఛితత్వం కోసం మైనస్ 40 డిగ్రీల వరకు శీతలీకరించేందుకు అవసరమైన డీప్ ఫ్రీజర్ వ్యవస్థ ఇందులో ఉంది. భక్తులకు అందే ప్రసాదం.. లడ్డూల్లో క్యాలరీలు ఎంత ఉన్నాయన్నది బాంబ్ కెలోరీమీటర్ ద్వారా నిర్దారిస్తారు. ఫ్యాట్ ఎనలైజర్ ద్వారా లడ్డూల్లో వాడిన నెయ్యి శాతాన్ని లెక్కించే వీలుంది. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రసాదాల్లో వాడే ముడిపదార్థాల నాణ్యతతో పాటు.. కల్తీని ఇట్టే పసిగట్టే సామర్థ్యం దీని సొంతం. ఈ వ్యవస్థ ఏర్పాటుతో కల్తీ రోగానికి సరైన మందుగా ఈ ల్యాబ్ మారే వీలుంది.