Begin typing your search above and press return to search.

గ్లోబల్ వెడ్డింగ్ డెస్టినేషన్ గా తిరుపతి..! రూట్ మ్యాప్ రెడీ చేస్తోన్న ప్రభుత్వం

తిరుపతిని గ్లోబల్ వెడ్డింగ్ డెస్టినేషన్, మైస్ టూరిజం ప్రాంత౦గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

By:  Tupaki Desk   |   13 Sept 2025 8:00 PM IST
గ్లోబల్ వెడ్డింగ్ డెస్టినేషన్ గా తిరుపతి..! రూట్ మ్యాప్ రెడీ చేస్తోన్న ప్రభుత్వం
X

తిరుపతిని గ్లోబల్ వెడ్డింగ్ డెస్టినేషన్, మైస్ టూరిజం ప్రాంత౦గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల గమ్యస్థానంగా తిరుపతిని తీర్చిదిద్దాలని ప్రణాళిక రచిస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఒక్క రోజులోనే వెనుదిరిగి వెళ్లిపోకుండా.. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడం ద్వారా సంపద పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం, ప్రైవేట్ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా తిరుపతిలో రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక రంగ అభివృద్ధి, పెట్టుబడులపై చర్చించారు.

పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించిన ప్రభుత్వం తిరుపతిని యాంకర్ హబ్ గా మార్చుకోవాలని ప్లాన్ చేస్తోందని అంటున్నారు. తిరుపతిలో టెంపుల్ టూరిజంతోపాటు స్థానికంగా ఉన్న ప్రకృతి సోయగాలు, వాటర్ ఫాల్స్, టైగర్ రిజర్వ్, పురాతన కట్టడాలు, చారిత్రాత్మక కోటలను మరింత అభివృద్ధి చేయాలని భావిస్తోంది. పీపీపీ విధానంలో చేపట్టే ఈ ప్రాజెక్టులో అందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిస్తోంది. ఇక తిరుపతి దర్శనానికి వచ్చే భక్తుడు రెండు మూడు రోజులు ఇక్కడే ఉండి ఇతర పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా అభివృద్ధి చేయడంతోపాటు అందులో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తోంది ప్రభుత్వం.

చంద్రగిరి పోర్ట్, శ్రీ వెంకటేశ్వర జువాలాజికల్ పార్క్, తలకోన జలపాతం, సూళ్లూరుపేట, నేలపట్టులో పక్షుల విహార కేంద్రాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయనుంది. అదేవిధంగా తిరుమలలో వివాహాలకు చాలా మంది ఆసక్తి చూపుతున్నందున టిటిడితో సమన్వయం చేసుకుని గ్లోబల్ వెడ్డింగ్ డెస్టినేషన్ గా మార్చాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలను ఇప్పటివరకు టెంపుల్ టూరిజం కిందే ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో వెడ్డింగ్ డెస్టినేషన్ కు ప్రాధాన్యం పెరగడంతో ఈ రంగంలో అవకాశాలను వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు సంపద పెరగనుందని అంచనా వేస్తోంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి సంపదపై ఎక్కువ ఫోకస్ చేస్తోంది. ప్రధానంగా పారిశ్రామిక రంగంతోపాటు స్థానికంగా ఎక్కువ ఉపాధి కల్పించే పర్యాటక రంగాన్ని ఎంకరేజ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి నుంచి చెబుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ఎంపిక చేసి పర్యాటకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. విజయవాడ, శ్రీశైలం, అరకు, గండికోట వంటి పది ప్రాంతాల్లో సీప్లేన్ సేవలను అందుబాటులోకి తేవాలని భావించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పర్యాటక రంగంలో ఉంటుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.