మెట్ల మార్గంలో అదరగొట్టిన తిరుపతి కలెక్టర్
ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ ఎంతో భక్తితో కొలిచే తిరుమల శ్రీవారిని దర్శించుకోవటం కోసం నిత్యం వేలాది భక్తులు రావటం తెలిసిందే.
By: Tupaki Desk | 3 Jun 2025 5:32 AMప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ ఎంతో భక్తితో కొలిచే తిరుమల శ్రీవారిని దర్శించుకోవటం కోసం నిత్యం వేలాది భక్తులు రావటం తెలిసిందే. స్వామి మీద ఉన్న నమ్మకంతో కొందరు భక్తులు తమ మొక్కుల్ని చెల్లించటం కోసం తిరుమల కొండను కాలి నడకన ఎక్కి తిరుమలకు చేరుకోవటం తెలిసిందే. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో కాలి నడకన కొండ ఎక్కే భక్తులు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తిరుమలకు కాలి నడకన చేరుకోవటానికి రెండు మార్గాలు ఉన్న సంగతి తెలిసిందే.
ఇందులో మొదటిది అలిపిరి మీదుగా కొండకు నడిచి వెళ్లటం.. మరొకటి శ్రీవారి మెట్టు మార్గం నుంచి తిరుమలకు చేరుకోవటం. అలిపిరితో పోలిస్తే.. శ్రీవారి మెట్టు మార్గం తక్కువ దూరం ఉండటంతో దీని ద్వారా కొండ ఎక్కి తిరుమలకు చేరుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు. పూర్తిగా మెట్లు ఉండే ఈ మార్గంలో కొండ ఎక్కటం కాస్త కష్టమైన పనే. ప్లాట్ గా కాకుండా నాలుగు వేలకు పైగా మెట్లు ఎక్కిన తర్వాత కొండకు చేరుకోవచ్చు.
అలిపిరి.. శ్రీవారి మెట్టుకు సంబంధించి దూరాన్ని పరిగణలోకి తీసుకుంటే.. శ్రీవారి మెట్టు దూరం తక్కువగా ఉన్నా.. ఎక్కువ శ్రమ తీసుకునేలా మెట్ల మార్గం ఉంటుంది. సాధారణంగా భక్తులు 2 నుంచి 3 గంటల మధ్యలో కొండను ఎక్కేస్తారు. కాస్త ఫిట్ గా ఉండే వారు గంటన్నర వ్యవధిలో కొండ ఎక్కేస్తుంటారు. తాజాగా తిరుపతి జిల్లా కలెక్టర్ మాత్రం అందుకు భిన్నంగా గంట కంటే తక్కువ వ్యవధిలోనే కొండను ఎక్కేయటం గమనార్హం.
ఈ మార్గంలో కొండను ఎక్కే వారిలో నలభై ఏళ్లు దాటిన వారికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. అందుకు భిన్నంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ శ్రీవారికి మొక్కులు చెల్లించేందుకు మెట్ల మార్గంలో నడిచారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఉల్లాసంగా కొండను ఎక్కేశారు. ఇందుకోసం కేవలం 50 నిమిషాల సమయం మాత్రమే తీసుకోవటం విశేషం. నడక మార్గంలో ఆహ్లాదరకర వాతావరణం తనకు మనసుకు ఎంతో నచ్చినట్లుగా ఆయన చెప్పారు. మెట్ల మార్గంలో నడిచి శ్రీవారి దర్శనం చేసుకోవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పాలనా పరమైన అంశాల్లో నిత్యం బిజీగా ఉండే కలెక్టర్ లాంటి వారు.. ఫిట్ నెస్ విషయంలో ఇంత పక్కాగా ఉండటం విశేషంగా చెప్పక తప్పదు.