నల్లత్రాచును నోటితో కొరికేసి.. పక్కలో వేసుకుని.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చియ్యవరం గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
By: Tupaki Desk | 19 Sept 2025 3:00 PM ISTపామును చూస్తే ఎవరైనా జాగ్రత్త పడతారు.. ఎక్కడ కాటేస్తుందోనని భయపడి పరుగులు తీస్తారు.. ఇక అత్యంత ప్రమాదకరమైన నల్లత్రాచు వంటి డేంజర్ స్నేక్ ఎదురైతే.. అంతే సంగతులు.. కానీ, తిరుపతి జిల్లాలో ఓ వ్యక్తి తనను కాటేసిందని నల్లత్రాచు పాముపైనే తిరబడ్డాడు. కాటేసిన క్షణాల వ్యవధిలోనే ఆ పామును పట్టుకుని నోటితో దాని పీక కొరికేశాడు. ఆ తర్వాత ఆ పామును పట్టుకుని ఇంటికి వెళ్లాడు. అంతేనా పక్కలో వేసుకుని పడుకుని తీరిగ్గా తెల్లారి లేద్దామనుకున్నాడు. కానీ, తెల్లారేసరికి ఆస్పత్రి పాలయ్యాడు.
తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చియ్యవరం గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. జాతర జోరులో పూటుగా మద్యం సేవించిన వెంకటేశ్ గత బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఇంటి దారి పట్టాడు. దారి మధ్యలో అతడిని ఓ నల్లత్రాచు పాము కాటేసింది. అయితే మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్.. నన్నే కాటేస్తావా? అన్న కోపంతో పాము ఎంతవేగంగా కాటేసిందో.. అంతేవేగంగా దాని తోక పట్టుకుని నోటితో పాము తలను కొరికేశాడు. ఆ తర్వాత తలలేని పామును తీసుకువచ్చి ఇంటి ముందు మంచంపై పడుకున్నాడు.
వేకువజామున కుటుంబ సభ్యులు వెంకటేశ్ పక్కలో నల్లత్రాచును చూసి బెదిరిపోయారు. అతడిని నిద్రలేపాలని చూడగా, అప్పటికే పాము కాటేయడం వల్ల అతడు అపస్మారకస్థితికి చేరుకున్నాడని గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ముందుగా శ్రీకాళహస్తి ఆస్పత్రికి అక్కడి నుంచి తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉండటంతో వెంకటేశ్ ను రక్షించేందుకు డాక్టర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఈ భూమిపై అత్యంత ప్రమాదకరమైన విష సర్పాలలో నల్లత్రాచు ఒకటి. అది కాటేస్తే 15 నుంచి 20 నిమిషాల్లోనే ఎవరైనా మరణించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. నల్లత్రాచు విషం చాలా శక్తివంతమైనది, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. నల్లత్రాచు కాటేస్తే 75 శాతం వరకు రక్షించడం కష్టం. వెంటనే చికిత్స చేస్తే ప్రాణాలను కాపాడవచ్చు అని చెబుతున్నారు. కానీ, వెంకటేశ్ ని పాము కాటేసిన తర్వాత దాదాపు నాలుగైదు గంటల వరకు చికిత్స అందలేదు. అంతేకాకుండా పామును నోటితో కొరికి చంపిన అతడు తీరిగ్గా ఇంటికి వెళ్లి దాన్ని పక్కలో వేసుకుని పడుకున్నాడు. రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగితే ఉదయం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రికి తీసుకువెళ్లడంలో తీవ్ర జాప్యం జరిగినా అప్పటివరకు ప్రాణాలతో ఉండటంపై డాక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
