Begin typing your search above and press return to search.

సీఎం జగన్ పై 'తిరుపతి' ఆయుధంతో దాడి షురూ!

తిరుపతికి సంబంధించిన కీలక పదవులన్నీ రెండు కుటుంబాలకు.. ఒక సామాజిక వర్గానికే అన్న ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు తాజాగా విడుదలైన ఒక ఉత్తర్వులను ఆయుధంగా మలుచుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   15 Aug 2023 3:44 AM GMT
సీఎం జగన్ పై తిరుపతి ఆయుధంతో దాడి షురూ!
X

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవట్లేదు విపక్షాలు. ప్రజల్ని ఇట్టే కనెక్టు చేసే అంశాల్ని శోధించి మరీ తెర మీదకు తీసుకొస్తున్నారు. సోషల్ మీడియాలోనూ చర్చకు పెడుతున్నారు. తాజాగా అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. మిగిలిన ప్రాంతాల సంగతి ఎలా ఉన్నా.. తిరుపతి అన్నంతనే పుణ్యక్షేత్రం కావటం.. తిరుపతికి సంబంధించిన అంశాలంటే ప్రాంతాలకు అతీతంగా ఒక లుక్ పడే వేసే వీలు ఉండటంతో ఇప్పుడు తిరుపతికి సంబంధించిన ఒక ఆర్గ్యూమెంట్ ను తెర మీదకు తెచ్చే ప్రయత్నం ఒకటి మొదలైంది.

తిరుపతికి సంబంధించిన కీలక పదవులన్నీ రెండు కుటుంబాలకు.. ఒక సామాజిక వర్గానికే అన్న ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు తాజాగా విడుదలైన ఒక ఉత్తర్వులను ఆయుధంగా మలుచుకుంటున్నారు. తమ వాదనతో తిరుపతి మీద తీసుకొచ్చే ఒత్తిడి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాలన్నది వ్యూహంగా చెబుతున్నారు. తాజాగా తిరుపతి నగరాభివ్రద్ధి సంస్థ (తుడా)కు ఛైర్మన్ గా మోహిత్ రెడ్డిని ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఇంతకూ ఈ మోహిత్ రెడ్డి ఎవరంటారా? తిరుపతి గ్రామీణ నియోజకవర్గమైన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడే. ఇప్పటికే తిరుపతి గ్రామీణ మండల పరిషత్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు.. చంద్రగిరికి మోహిత్ రెడ్డిని నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జిగా ప్రకటించారు. దీంతో.. వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి వైసీపీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగనున్నట్లు చెబుతున్నారు. తాజాగా విడుదలైన ఉత్తర్వు ప్రకారం రానున్న మూడేళ్ల పాటు తుడా ఛైర్మన్ గా మోహిత్ రెడ్డి వ్యవహరించనున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఇప్పటివరకు తుడా ఛైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడికి ఆ పదవిని కట్టబెట్టారు.

మరోవైపు టీటీడీ బోర్డు ఛైర్మన్ గా తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డిని ఎంపిక చేయటం తెలిసిందే. ఆయన కుమారుడు అభినయ్ రెడ్డిని తిరుపతి కార్పొరేషన్ రెండో డిప్యూటీ మేయర్ గా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీకి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారన్న ప్రచారం సాగుతోంది. ఇలా తిరుపతి.. తిరుపతి గ్రామీణ నియోజకవర్గం రెండింటిలోనూ.. తిరుపతికి సంబంధించిన పలు పదవుల్లోనూ రెండు ఫ్యామిలీలకు మాత్రమే ముఖ్యమంత్రి జగన్ పెద్దపీట వేస్తున్నట్లుగా ప్రచారం మొదలైంది.

అంతేకాదు.. తిరుపతి అన్నంతనే గుర్తుకు వచ్చే టీటీడీలోనూ జేఈవోగా.. ఈవోగా.. తిరుపతి జిల్లా కలెక్టర్ గా.. తిరుపతి.. చిత్తూరు జిల్లాల ఎస్పీలుగా.. తిరుపతి ఆర్డీవోగా.. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం వీసీగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారని.. మరే సామాజిక వర్గానికి 'తిరుపతి'లోఛాన్స్ ఇవ్వరా? అన్న ప్రశ్నను సంధిస్తూ వాట్సాప్ లోనూ.. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ అవుతున్నాయి.