Begin typing your search above and press return to search.

మరోసారి శ్రీవారి ఆలయం మీదుగా విమానం.. ఏమి జరుగుతుంది?

తిరుమలలో మరోసారి ఆగమశాస్త్ర నిబంధనల ఉల్లంఘన జరిగింది.. శ్రీవారి ఆలయ గోపురం మీదుగా మరోసారి విమానం ప్రయాణించింది

By:  Tupaki Desk   |   7 Sept 2023 10:27 AM
మరోసారి శ్రీవారి ఆలయం మీదుగా విమానం.. ఏమి జరుగుతుంది?
X

తిరుమలలో మరోసారి ఆగమశాస్త్ర నిబంధనల ఉల్లంఘన జరిగింది.. శ్రీవారి ఆలయ గోపురం మీదుగా మరోసారి విమానం ప్రయాణించింది. ఈ సమయంలో కొందరు భక్తులు విమానం వెళుతున్న వీడియోను తీశారు. ఇలా వరుసగా జరుగుతుండటంపై శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అవును... తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. ఈమధ్య కాలంలో శ్రీవారి ఆలయం మీదుగా తరుచూ విమానాలు ఎగురుతూనే ఉండగా.. తాజాగా ఇవాళ మరోసారి ఆలయ గోపురం మీదుగా విమానం ప్రయాణించింది. దీంతో ఇలా ప్రయాణించడం ఆగమ నిబంధనలకు వ్యతిరేకమని టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా.. విమానయాన శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని తెలుస్తుంది.

తాజాగా ఆలయం మీదుగా వెళ్లిన విమానం రేణిగుంట విమానాశ్రయం నుంచి వచ్చిందా.. లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిందా అనేది వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఆలయం మీదుగా విమానాలు ఎగరకుండా చూడాలంటూ రేణిగుంట విమానాశ్రయం అధికారులకు టీటీడీ అధికారులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

ఇదే సమయంలో తిరుమల నో ప్లై జోన్‌ కాదంటూ ఎయిర్‌ ట్రాఫికింగ్‌ అధికారులు చెబుతున్నారని తెలుస్తుంది. పైగా... ఎయిర్‌ ట్రాఫిక్‌ పెరిగినప్పుడు తిరుమల మీదుగా విమాన ప్రయాణం తప్పదు అన్నట్లుగా ఏటీసీ అధికారులు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. దీంతో స్వామివారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రం పరిధిలో ఉండటంతో గతంలోనే టీటీడీ ఈ "నో ఫ్లై జోన్" అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్లింది. ఇదే సమయంలో కేంద్ర హోంశాఖ అధికారులు తిరుమల వచ్చిన సమయంలో కూడా టీటీడీ ఈ విషయాన్ని వారివద్ద ప్రస్తావిస్తూ వస్తోంది! కానీ... ఈ విషయంపై ఇప్పటివరకూ కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది.