దేవుడితో హోటల్ ఏంట్రా.. పోతారర్రేయ్..
కిరణ్ రాయల్ ఈ వివాదంపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. "ఇది చిన్న విషయం కాదు. విదేశాల్లో ఉన్న వేంకటేశ్వర భక్తుల నుండి కూడా ఫిర్యాదులు వచ్చాయి.
By: Tupaki Desk | 1 July 2025 12:00 PM ISTరాజమండ్రి జాతీయ రహదారిపై "రాయుడు మిలిటరీ హోటల్" పేరుతో ఓ నాన్ వెజ్ రెస్టారెంట్ తిరుమల శ్రీవారి ఆలయ నమూనాతో ఏర్పాటు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. హోటల్ బయట శ్రీవారి గర్భగుడి, బంగారు వాకిలి, జయ-విజయులు, కులశేఖర పది వంటి ఆలయ నిర్మాణ శైలిని పోలిన నమూనాను ఏర్పాటు చేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార ప్రయోజనాల కోసం దేవస్థానం ప్రతిష్ఠను అపహాస్యం చేయడంగా దీన్ని భావిస్తూ జనసేన పార్టీ నేతలు, హిందుత్వవాదులు తీవ్రంగా మండిపడుతున్నారు.
జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. "ఇది చాలా తీవ్రమైన విషయం. తిరుమల దేవస్థానంలో లక్షలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రసాదం స్వీకరిస్తుంటారు. అలాంటి పవిత్ర ఆలయ నమూనాతో నాన్ వెజ్ రెస్టారెంట్ పెట్టడం అవమానకరం. ఇది స్వామివారి పరమ పవిత్రతను దెబ్బతీసే చర్య. ఇది ఏ హిందువూ సహించలేడు" అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ అంశంపై జనసేన నాయకులు టీటీడీ ఈవో శ్యామలరావుతో పాటు చైర్మన్ బీఆర్ నాయుడికి ఫిర్యాదు చేశారు. హైవే అథారిటీల నుంచి హోటల్‌కు అనుమతులు ఎలా వచ్చాయో కూడా అధికారులు విచారిస్తున్నారు. 48 గంటల్లోపు తిరుమల ఆలయ నమూనాను హోటల్ నుంచి తొలగించాలంటూ స్పష్టం చేశారు.
-కిరణ్ రాయల్ తీవ్ర హెచ్చరికలు
కిరణ్ రాయల్ ఈ వివాదంపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. "ఇది చిన్న విషయం కాదు. విదేశాల్లో ఉన్న వేంకటేశ్వర భక్తుల నుండి కూడా ఫిర్యాదులు వచ్చాయి. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ నుండి ఫోన్ కాల్స్ వచ్చాయి. మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారు. వెంటనే శ్రీవారి నమూనా తొలగించకపోతే ఆందోళనలు తీవ్రమవుతాయి. అవసరమైతే స్వామి భక్తులే హోటల్ పై దాడులు చేస్తారు. వ్యాపారం కోసం దేవుడిని వాడుకోవద్దు. ఇది హిందూ ధర్మాన్ని అపహాస్యం చేసినట్లే అవుతుంది" అని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పలు హిందూ సంఘాలు, స్థానిక భక్తులు కూడా స్పందిస్తూ హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ వివాదంపై అధికార యంత్రాంగం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది వేచి చూడాలి.
