జగన్ రాజ గురువుకు భారీ షాక్
వైసీపీ అధికారంలో ఉన్నపుడు ఆయన హవా ఒక్క రేంజిలో ఉండేది. ఆయన ఏకంగా నాటి సీఎం వైఎస్ జగన్ కి ఆధ్యాత్మిక గురువుగా వాసికెక్కారు. ఆయనే విశాఖ శ్రీ శారదా పీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర మహా స్వామి.
By: Tupaki Desk | 21 April 2025 5:15 PM ISTవైసీపీ అధికారంలో ఉన్నపుడు ఆయన హవా ఒక్క రేంజిలో ఉండేది. ఆయన ఏకంగా నాటి సీఎం వైఎస్ జగన్ కి ఆధ్యాత్మిక గురువుగా వాసికెక్కారు. ఆయనే విశాఖ శ్రీ శారదా పీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర మహా స్వామి. ఆయన అంటే జగన్ కి ఎంతో గురి. అంతే కాదు ఏకంగా వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలంతా ఆయనకు భక్తులుగా ఉండేవారు.
ఇక స్వామి ఏమి చెబితే అదే వేదవాక్కుగా వైసీపీ రాజ్యంలో నడచింది. విశాఖను రాజధానిగా చేసుకోమని తూర్పు నుంచి పాలిస్తే మంచి ఫలితాలు వస్తాయని జగన్ కి చెప్పింది కూడా స్వామీజీయే అని అప్పట్లో ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగింది. ఆ మాట మేరకే మూడు రాజధానులు అన్న నినాదాన్ని జగన్ అందుకున్నారని కూడా అంటారు.
ఇవన్నీ పక్కన పెడితే స్వామీజీ వైసీపీ హయాంలో పీఠాలను అభివృద్ధి చేసే క్రమంలో భీమిలీలో ప్రభుత్వం విలువైన భూములను కట్టబెట్టింది. అలాగే తిరుమలలో కూడా పీఠం తరఫున భవన నిర్మాణానికి కూడా అనుమతులు మంజూరు అయిపోయాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక భీమిలీ భూములకు అనుమతులు రద్దు చేసింది.
తిరుమలలో పీఠం తరఫున నిర్మించిన భవనం అక్రమ నిర్మాణం అని తిరుమల తిరుపతి దేవస్థానం అంటోంది. దీంతో పాటుగా ప్రపంచ ఆరాధ్యనీయ మైన ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శరవేగంగా చర్యలు తీసుకుంటోంది.
ఈ క్రమంలో తాజాగా తిరుమలలోని విశాఖ శారదా పీఠం మఠానికి టీటీడీ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులలోని సారాంశం ప్రకారం చూస్తే కనుక పదిహేను రోజులలో తిరుమలలోని శారదాపీఠం మఠం ఖాళీ చేసి భవనాన్ని టీటీడీకి అప్పగించాలని అధికారులు స్పష్టం చేశారు.
ఇక చూస్తే కనుక గోగర్భం డ్యామ్ వద్ద శారదాపీఠం మఠం నిర్మాణంలో అవకతవకలు చోటుచేసుకున్నట్టు టీటీడీ అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా శారదాపీఠం మఠం నిర్మించినట్టు నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఆ సదరు నివేదిక ఆధారంగా చేసుకుని శారదాపీఠం భవనం లీజు రద్దు చేయాలని టీటీడీ నిర్ణయించింది.
ఇదిలా ఉంటే ఇంతకు ముందే ఈ పీఠం భవనం విషయంలో టీటీడీ ఒకసారి పీఠానికి షోకాజ్ నోటీసులను జారీ చేసింది. అయితే ఈ నోటీసుల మీద శారదాపీఠం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే కోర్టు టీటీడీ బోర్డు నిర్ణయాన్ని సమర్థిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో ఇపుడు మరోసారి నోటీసులు పీఠానికి వెళ్ళాయి. మరి పీఠం నిర్వాహకులు ఏమి చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.
