తిరుమలకు సొంత వాహనంలో జర్నీ? జిల్లా ఎస్పీ సూచన చదివారా?
ఏడాది పొడువునా తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్లేందుకు భక్తులు ఆసక్తి చూపుతుంటారు.
By: Tupaki Desk | 22 April 2025 2:00 PM ISTఏడాది పొడువునా తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్లేందుకు భక్తులు ఆసక్తి చూపుతుంటారు. మిగిలిన రోజులతో పోలిస్తే వేసవిలో ఈ జోరు మరింత ఎక్కువగా ఉంటుంది. కారణం.. పిల్లలకు స్కూళ్లు..కాలేజీలు సెలవులు ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది తిరుమల ట్రిప్ కు ప్లాన్ చేస్తుంటారు. తిరుమల జర్నీ వేళలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ కీలక సూచనలు చేశారు. తమ సొంత వాహనాల్లో వచ్చే వారు ఆయన చెప్పిన అంశాల్ని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల కాలంలో రెండు కార్లు తిరుమలకు వచ్చే క్రమంలో తగలబడిపోయాయి. ఈ సందర్భంగా నిపుణుల నివేదికను అందుకున్న జిల్లా ఎస్పీ.. భక్తుల్ని అలెర్టు చేస్తున్నారు. 500 కి.మీ. ప్రయాణించిన తర్వాత కార్లు అధికంగా వేడెక్కి ఉంటాయని.. ఘాట్ రోడ్డులో అలానే నడిపితే మంటలు వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు.ఇలాంటి ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు తిరుమల ప్రయాణానికి ముందే యాత్రికులు తమ వాహనాలకు సర్వీసు చేయించుకోవటం ఉత్తమమని స్పష్టం చేశారు.
ఇంజిన్.. కూలెంట్.. బ్రేకులు.. ఏసీ.. ఆయిల్ లాంటి అంశాల్ని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే ప్రయాణాన్ని మొదలు పెట్టాలని చెబుతున్నారు. రేడియేటర్ లీకేజీల్ని గుర్తించటం.. ఫ్యాన్ బెల్ట్ చూసుకోవటం.. బ్యాటరీ డిస్టిల్ వాటర్ తనిఖీ చేసుకోవటం.. వైర్ల చుట్టూ చేరిన తుప్పును తొలగించటం లాంటివి చేయించుకోవాలని సూచనలు చేశారు.
అన్నింటికి మించిన సదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తమ సొంత వాహనాల్ని తిరుమల ఘాట్ ఎక్కటానికి కనీసం30 నిమిషాల పాటు వాహనం ఆపి ఉంచాలని.. కొండ పైకి ఎక్కే వేళలో ఏసీ ఆపి ఉంచితే మరింత మంచిదని చెప్పారు. మొదటి ఘాట్ నుంచి కిందకు దిగే వేళలో బ్రేకులు ఎక్కువ వాడకుండా.. ఇంజిన్ బ్రేకింగ్ వినియోగించాలే తప్పించి న్యూట్రల్ చేయొద్దని చెప్పారు. తిరుమల జర్నీ సొంత వాహనాల్లో చేసే వారంతా ఈ సూచనల్ని తప్పక పాటించటం మంచిది.
