Begin typing your search above and press return to search.

పరాకమణి దొంగను కాపాడిన పెద్దలు ఎవరు? చెమటలు పట్టిస్తున్న సిట్

కేసులో ప్రధాన నిందితుడు రవికుమార్, ఆయన భార్య రమ్య, కుమార్తె ప్రనూషను పద్మావతి అతిథి గృహాంలో పోలీసులు విడివిడిగా ప్రశ్నించారు.

By:  Tupaki Desk   |   8 Nov 2025 1:03 PM IST
పరాకమణి దొంగను కాపాడిన పెద్దలు ఎవరు? చెమటలు పట్టిస్తున్న సిట్
X

తిరుమల పరకామణి చోరీపై సీఐడీ సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. కేసులో ప్రధాన నిందితుడు రవికుమార్ తోపాటు ఆయన కుటుంబ సభ్యులను సిట్ అధిపతి, సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు శుక్రవారం విచారించాయి. మొత్తం 20 మంది సీఐడీ పోలీసులు ఐదు టీములుగా ఏర్పడి తిరుపతి, తిరుమలలో విచారణ జరుపుతున్నారు. దేవుడి సొమ్ము అపహరించాలని ఎందుకు అనుకున్నావు? ఇంత పెద్ద నేరాన్ని లోక్ అదాలత్ లో రాజీ చేసిన పెద్దలు ఎవరు? అన్న విషయంపై సిట్ ఆరా తీస్తోంది.

కేసులో ప్రధాన నిందితుడు రవికుమార్, ఆయన భార్య రమ్య, కుమార్తె ప్రనూషను పద్మావతి అతిథి గృహాంలో పోలీసులు విడివిడిగా ప్రశ్నించారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ విచారణ సాగింది. శనివారం కూడా విచారణ కొనసాగనుంది. సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్పీ గంగాధరరావు, లీగల్ టీమ్ హెడ్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిందితులు, అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తొలుత నిందితుడు రవికుమార్ భార్య రమ్య, కుమార్తె ప్రనూషను ప్రశ్నించారు. ఆ తర్వాత రవికుమార్ ను లోపలికి పిలిపించారు. ఈ ముగ్గురిని వేర్వేరుగా ప్రశ్నించి, వారి సమాధానాలను సరిపోల్చిచూస్తున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు వ్యక్తిగత వివరాలు, కుటుంబం, బంధువులు, మిత్రుల గురించి వివరాలు తెలుసుకున్నారు. పెద్దజీయర్ మఠంలో ఉద్యోగంలో ఎప్పుడు చేరావు? అక్కడ నుంచి పరకామణిలో చేరడానికి సహకరించిన వారెవరు? ఎప్పటి నుంచి టీటీడీ అధికారులు పరకామణిలో విధులు కేటాయించారు? చోరీ ఘటనలో ఇంకెవరైనా ఉన్నారా? మీకు మీ కుటుంబ సభ్యులకు సంబంధించి స్థిర, చరాస్తులు ఎక్కడెక్కడ ఎవరి పేర్లపై ఉన్నాయని అధికారులు ఆరా తీశారు. ఈ చోరీ కేసు, అనంతరం రాజీ చేయడంలో ఎవరెవరి సహకారం తీసుకున్నారనే విషయాలపైనా సీఐడీ సమాచారం సేకరించినట్లు చెబుతున్నారు.

ఇక రాజీ సందర్భంగా తన ఆస్తులన్నీ రాయించుకున్నారని నిందితుడు రవికుమార్ సిట్ కు తెలియజేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు సిట్ విచారణ తిరుమల ఆలయ అధికారులు, సిబ్బందిలో గుబులు రేపుతోంది. కేసుతో సంబంధం ఉన్నవారు, ఇతరులను కూడా సిట్ విచారణకు నోటీసులు జారీ అయ్యాయి. శనివారం నిందితుడు రవికుమార్ తోపాటు అప్పటి అధికారులను విచారించేందుకు నోటీసులిచ్చారు. నిందితుడు రవికుమార్ ను భారీ భద్రత మధ్య రహస్యంగా ఉంచినట్లు సమాచారం.

దొంగను దాతను చేస్తారా? - భానుప్రకాష్ ధ్వజం

తిరుమలలో శ్రీవారికి భక్తులు సమర్పించిన డాలర్లను చోరీ చేసిన దోషులు జైలుకు వెళ్లక తప్పదని టీటీడీ బోర్డు సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. పరామకణి చోరీపై సిట్ విచారణను భానుప్రకాష్ రెడ్డి స్వాగతించారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పరకామణిలో డాలర్లను కాజేసిన దొంగను దాతగా చేశారు. దొంగతనాన్ని కానుకగా మార్చారు. టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకరరెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. ఆయనకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి. ఆ రోజు తీర్మానాలు చేసి సంతకాలు చేసింది భూమన కాదా? అంటూ ప్రశ్నించారు.