Begin typing your search above and press return to search.

కల్తీ నెయ్యి మీద బాబు పవన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీలో కల్తీ నెయ్యి వ్యవహారం పెద్ద ఎత్తున రాజకీయ రచ్చకు దారి తీసిన సంగతి విధితమే. దీని మీద ఎన్నో డిబేట్స్ జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి.

By:  Satya P   |   24 Feb 2026 3:13 PM IST
కల్తీ నెయ్యి మీద బాబు పవన్ సంచలన వ్యాఖ్యలు
X

ఏపీలో కల్తీ నెయ్యి వ్యవహారం పెద్ద ఎత్తున రాజకీయ రచ్చకు దారి తీసిన సంగతి విధితమే. దీని మీద ఎన్నో డిబేట్స్ జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇపుడు నిండు అసెంబ్లీలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారు అన్న దాని మీద మంగళవారం సుదీర్ఘమైన చర్చ సాగింది. ఈ చర్చ కోసం జీరో అవర్ ని కూడా రద్దు చేశారు. కూటమి నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడారు, ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు కల్తీ నెయ్యి అంశం మీద అసెంబ్లీలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కుట్ర జరిగిందంటూ :

శ్రీవారి పవిత్ర ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ఒక ప్లాన్ ప్రకారం కుట్ర జరిగిందని సిట్ తేల్చింది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కడా గత త ప్రభుత్వాధినేత తప్పు చేశారని చెప్పలేదని అన్నారు. అయితే మొత్తం వ్యవహారంలో టీటీడీ బోర్డుదే తప్పని చెప్పానని పవన్ అన్నారు. ఇలా విషయం ఉంటే టీటీడీ బోర్డులోని వారిని ఎందుకు వెనుకేసుకొస్తున్నారని ఆయన వైసీపీ నేతలను ప్రశ్నించారు. నిజానికి కల్తీ జరిగిందని ఒప్పుకుంటే ఇంత చర్చ అవసరం లేదు కదా అని ఆయన అన్నారు.

దేవుడికే తెలియాలి :

ఇదిలా ఉంటే ఎన్‌డీడీబీ నివేదికలో జంతు కొవ్వు ఉందని చెప్పారు. సిట్ విచారణలో రసాయనాలు కలిశాయని ఉందని పవన్ వివరించారు. మరి ఆ రసాయనాలలో అసలు ఏముందో దేవుడికే తెలియాలి అని అన్నారు. దీని నుంచి ఎవరు లబ్ధి పొందేది ఉండదని అన్నారు. అయితే ఇది హిందూ మతంలో కాకుండా వేరే ఎవరికి జరిగినా ప్రపంచమంతా గగ్గోలు పెట్టేవారని పవన్ చెప్పుకొచ్చారు.

దేవాలయాల్లో అరాచకాలు :

వైసీపీ హయాంలో 2019-24 మధ్య దేవాలయాల్లో అరాచకాలు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. అయితే తాను సీఎం కాగానే రెండో సంతకం టీటీడీ ఈవోను నామినేట్ చేస్తూ చేశాను అని ఆయన గుర్తు చేశారు. తమకు కులదైవంగా వెంకటేశ్వర స్వామి ఉన్నారని అన్నారు. ఆ విధంగా తనను కాపాడింది ఆ దేవదేవుడే అని చెప్పారు. ఇక తాను సిద్ధాంతపరంగానే ఎవరితో అయినా పోరాడాను అని బాబు గుర్తు చేశారు. ఆ విధంగా ఉమ్మడి ఏపీలో మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి రమ్మంటే వారు తనపైన దాడి చేశారని బాబు గతాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే ఇప్పుడు మావోయిస్టు అగ్ర నేతలు అంతా ఒక్కొక్కరుగా లొంగిపోతున్నారని బాబు చెప్పారు.

నిబంధనలు అన్నీ మార్చేసి :

మరో వైపు చూస్తే వైసీపీ అధికారం చేపట్టాక 2020 ఫిబ్రవరిలో టెండర్ నిబంధనలు టీటీడీలో పూర్తిగా మార్చారని చెప్పారు. అదే విధంగా 2022 మేలో భోలే బాబా సంస్థపై ఫిర్యాదు వచ్చిందని విచారణకు ఆదేశిస్తే

2022 ఆగస్టులో నివేదిక వచ్చిందని ఆయన సభకు చెప్పారు. ఆ తరువాత 2024 జులైలో ఎన్‌డీడీబీ నివేదిక వచ్చిందని అన్నారు. అసలు పాలు ఏమాత్రం తయారు చేయలేని కంపెనీలకు టీటీడీ నెయ్యి సరఫరా చేసేందుకు కాంట్రాక్ట్ ఇచ్చారని బాబు ఫైర్ అయ్యారు.

ఆధారాలతోనే మాట్లాడాను :

తాను నిరాధారమైన ఆరోపణలు ఎక్కడా చేయలేదని బాబు అన్నారు. ఎన్‌డీడీబీ రిపోర్ట్ 2024 జులై 23న వచ్చిందని ఆయన చెబుతూ ఎస్ వాల్యూ-5 ప్రకారం జంతు కొవ్వు ఉందన్న రిపోర్టు ఆధారంగానే తాను మాట్లాడానని ఆయన చెప్పారు. అలాగే గత పాలకులు 10 లక్షల కేజీల ఆవు నెయ్యి కోసం టెండర్లు ఇచ్చారని అన్నారు. ఆ విధంగా కల్తీ నెయ్యి కోసం వచ్చిన రిపోర్టును తొక్కి పెట్టారని చెప్పారు. అదే సమయంలో రోజుకు 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలన్న నిబంధనను సైతం అడ్డగోలుగా తొలగించారని బాబు చెప్పారు.

ప్రమాదకరమైన రసాయనాలు :

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిని ప్రమాదకర రసాయనాలతో తయారు చేశారని బాబు సంచలన ప్రకటన చేశారు. ప్రపచంలో ప్రఖ్యాతి అయిన ఆ తిరుమల దేవుడి కోసం తక్కువ ధరకే ఇస్తున్నారంటే ఆలోచించుకోవాలి కదా అని ఆయన అన్నారు. ఈ విధంగా చేయడం వెనక అవినీతి గానీ, కుట్ర పూరిత ఆలోచన కచ్చితంగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. రసాయనాలతో తయారు చేసిన నెయ్యితో లడ్డూరు తయారీ చేసి కూడా ఈ రోజుకీ ఇంకా బుకాయిస్తున్నారని బాబు మండిపడ్డారు. టీటీడీకి చెందిన ఇద్దరు మాజీ చైర్మన్లు కల్తీ జరిగిందని ఒప్పుకున్నారని చంద్రబాబు సభ దృష్టిలో పెట్టారు.