టీటీడీ కల్తీ నెయ్యి కేసు.. టీడీపీ మంత్రి, ఎమ్మెల్యే విచారణ?!
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో టీడీపీ మంత్రి, ఎమ్మెల్యేను సీబీఐ సిట్ ప్రశ్నించే అవకాశం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
By: Tupaki Desk | 23 Dec 2025 4:05 PM ISTతిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో టీడీపీ మంత్రి, ఎమ్మెల్యేను సీబీఐ సిట్ ప్రశ్నించే అవకాశం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో టీటీడీ బోర్డు సభ్యులుగా పనిచేసిన ప్రస్తుత ప్రభుత్వంలోని మంత్రి, ఎమ్మెల్యేను సీబీఐ సిట్ ప్రశ్నించనుందని ప్రచారం జరుగుతోంది. టీటీడీ బోర్డులో పనిచేయడమే కాకుండా అప్పట్లో నెయ్యి సరఫరాకు సిఫారుసులు చేసిన కమిటీలో మంత్రి, ఎమ్మెల్యే ఉండటంతో ఆ ఇద్దరిని ప్రశ్నించే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే కమిటీలో సభ్యుడైన టీటీడీ మాజీ సభ్యుడు, ఏపీ లిక్కర్ స్కాం నిందితుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డిని సీబీఐ సిట్ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వానికి చెందిన ఇద్దరు ముఖ్యనేతలను ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు.
గత ప్రభుత్వంలో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటన చేయడం పెను సంచలనమైంది. దేశవ్యాప్తంగా శ్రీవారి భక్తుల మనోభావాలకు చెందిన ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ తో ప్రత్యేక దర్యాప్తునకు సీబీఐని సుప్రీం ఆదేశించింది. సుప్రీం ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ సిట్ అధికారులు టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారని ఉత్తరాఖండ్ కు చెందిన భోలెబాబా డెయిరీతోపాటు ఆ సంస్థతో వ్యాపార లావాదేవీలను నిర్వహించిన పలువురిని అరెస్టు చేసింది. ఇక ఇదే కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వద్ద గతంలో పనిచేసిన చిన్నఅప్పన్న అనే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు.
ఈ నేపథ్యంలోనే టీటీడీ మాజీ సభ్యుడైన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సోమవారం విజయవాడ జిల్లా జైలులో సీబీఐ ప్రశ్నించింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిబంధనలను పక్కనపెట్టి తమకు అనుకూలంగా ఉన్నవారికి టెండర్ దక్కించుకోడానికి ఒక టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేసిందని చెబుతున్నారు. ఇందులో టీటీడీ బోర్డు సభ్యులుగా అప్పట్లో పనిచేసిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డితోపాటు ప్రస్తుత సమాచార శాఖ మంత్రి పార్థసారథి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురుతోపాటు మరికొందరు అధికారులు సిఫార్సుల కమిటీలో చోటు దక్కించుకున్నట్లు చెబుతున్నారు. ఈ కమిటీ సూచనలతోనే ప్రతిరోజూ నెయ్యి సేకరణకు కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేశారని అంటున్నారు.
ఈ కారణంగా సిఫార్సుల కమిటీలో సభ్యుడైన చెవిరెడ్డిని సీబీఐ ప్రశ్నించిందని చెబుతున్నారు. సుమారు నాలుగు గంటల పాటు చెవిరెడ్డిని విచారించిన సీబీఐ సిట్ అధికారులు, ఆయన చెప్పిన సమాచారాన్ని నమోదు చేసుకున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పార్థసారధి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని కూడా ప్రశ్నిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఇన్నాళ్లు టీటీడీ కల్తీ నెయ్యి కేసులో అధికార పార్టీకి సెగ తగిలే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటివరకు ఈ వ్యవహారంలో ప్రతిపక్ష వైసీపీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిందని అంటున్నారు. ప్రస్తుతం అధికార పార్టీ మంత్రి, ఎమ్మెల్యేను ప్రశ్నించే పరిస్థితి వస్తే.. వారు చెప్పే సమాచారం ఆధారంగా తాము కూడా బయటపడే అవకాశాలు లభిస్తాయని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు.
