బిగ్ బ్రేకింగ్ : కల్తీ నెయ్యిపై విచారణ కమిషన్.. కేబినెట్ కీలక నిర్ణయం!
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ అంశంపై సీబీఐ సిట్ దర్యాప్తు పూర్తయింది.
By: Tupaki Desk | 3 Feb 2026 3:45 PM ISTతిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ అంశంపై సీబీఐ సిట్ దర్యాప్తు పూర్తయింది. ఈ దర్యాప్తులో సూత్రధారులను వదిలేశారని, కేవలం నామమాత్రంగా పాత్రధారులను అరెస్టు చేశారని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా సిట్ విచారణ నివేదిక, చార్జిషీటుల్లో తేడాలు ఉన్నాయని ప్రభుత్వ పెద్దలు అనుమానిస్తున్నారు. దీంతో నిజానిజాలు పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు విచారణ కమిషన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులు ఏకగ్రీవంగా తీర్మానించారు. దీంతో తిరుమల లడ్డూ కల్తీపై మరోమారు విచారణ జరిగే అవకాశం ఉంది.
తిరుమల లడ్డూ కల్తీపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో సుమారు 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఇందులో ప్రధానంగా కల్తీ నెయ్యి సరఫరాపైనే చర్చ జరిగిందని అంటున్నారు. కల్తీ నెయ్యిపై దర్యాప్తు చేసిన సీబీఐ సిట్ తర నివేదికలో పాత్రధారులపై చర్యలకు మాత్రమే సిఫార్సు చేసిందని మంత్రివర్గం అభిప్రాయపడింది. కెమికల్ తో తయారు చేసిన నెయ్యిని టీటీడీకి సరఫరా చేసేందుకు కారణమైన అసలు సూత్రధారులను సిట్ వదిలేసిందని మంత్రులు అభిప్రాయపడ్డారని చెబుతున్నారు. ఈ విషయంలో అసలు నిగ్గు తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
సిట్ విచారణ, ఛార్జిషీట్, ప్రభుత్వానికి సమర్పించిన అంశాల్లో తేడాలు ఉన్నట్లు మంత్రివర్గం భావించింది. విచారణలో వెలుగుచూసిన వాస్తవాలు ఛార్జిషీట్‍లో ఎందుకు ప్రస్తావించలేదన్న అంశంపై చర్చించారు. మూడు అంశాల్లో తేడాలపై అధ్యయనం చేసి వాస్తవాలను వెలికి తీసేందుకు కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ ద్వారా విచారణ బృందం ఏర్పాటు చేయాలని, ఈ కమిషన్ నుంచి నిర్ణీత కాలపరిమితిలో నివేదిక తెప్పించుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
వైసీపీ హయాంలో టెండర్ నిబంధనలను సడలించడంతోనే నెయ్యి కల్తీకి బీజం పడిందని కేబినెట్ మంత్రులు ఎత్తిచూపారు. సడలించిన నిబంధనలను తిరస్కరించే అధికారం ఉన్నా, అప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సరైన నిర్ణయం తీసుకోలేదని మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో 2022లో చేయించిన సీఆర్టీఐ నివేదికలోనే కల్తీ నిర్ధరణ అయిందని, అయినా చర్యలు తీసుకోలేదని ప్రస్తావించారు. ఇక కల్తీ నెయ్యిపై విచారణ కమిషన్ నియమించాలనే ప్రభుత్వ నిర్ణయం చర్చనీయాంశం అవుతోంది.
ప్రభుత్వ తాజా నిర్ణయం ఏపీలో మళ్లీ రాజకీయ మంటలను పుట్టించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా, టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్ నిబంధనలు మార్చారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనివల్ల అర్హత లేని భోలేబాబా డెయిరీ నెయ్యి కాంట్రాక్టు దక్కించుకుందని, ఇది ముందస్తు ఒప్పందం వల్లే జరిగిందని ప్రభుత్వం విమర్శిస్తోంది. టీటీడీకి పూర్వం నుంచి సహకార డెయిరీల నుంచి నెయ్యి సరఫరా అవుతుండేదని చెబుతున్నారు. వైసీపీ హయాంలో టెండర్ నిబంధనలు మార్చడం వల్ల ఉత్తరాఖండ్ కు చెందిన భోలేబాబా డెయిరీ కాంట్రాక్టును దక్కించుకుంది. అయితే ఈ కాంట్రాక్టును తాము ఇవ్వలేదని, 2019కు ముందు చంద్రబాబు సీఎంగా ఉండగానే భోలెబాబా డెయిరీకి కాంట్రాక్టు కట్టబెట్టారని వైసీపీ వర్గాలు ఎదురుదాడి చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో టీటీడీ కల్తీ నెయ్యి కేసు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలలకు ముఖ్యమంత్రి చంద్రబాబు లడ్డూ ప్రసాదంలో కల్తీపై ప్రకటనలు చేశారు. ఆ తర్వాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయంలో ఆత్మరక్షణలో పడిపోయిన వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీం సూచనలతో ఇప్పటికే సీబీఐ సిట్ దర్యాప్తు జరిపింది. భోలేబాబా డెయిరీ చుక్క పాలు సేకరించకుండానే 68 లక్షల కిలోల నెయ్యిని రసాయానాలతో తయారు చేసి టీటీడీకి సరఫరా చేసిందని గుర్తించింది. ఇందుకు సంబంధించి మొత్తం 35 మందిని అరెస్టు చేసింది. అయితే ఈ వ్యవహారంలో పాత్రధారులను అరెస్టు చేసి సూత్రధారులను వదిలేశారని ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది. ఈ విషయమై అధికార, ప్రతిపక్షాల మధ్య కొన్నిరోజులుగా వాగ్యుద్ధం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణం మరింత హీటెక్కించేలా విచారణ కమిషన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది.
