లడ్డూ కల్తీ గొడవ.. మలుపు తిప్పిన మాజీ సీఎస్ ఎల్వీ!! ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడదా?
తిరుమల లడ్డూ కల్తీ ఎపిసోడ్ లో ఇంతవరకు రాజకీయ నాయకుల మధ్యే మాటల యుద్ధం కొనసాగుతోంది. తప్పు మీదంటే మీదంటూ అధికార, విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.
By: Tupaki Political Desk | 7 Feb 2026 10:59 PM ISTతిరుమల లడ్డూ కల్తీ ఎపిసోడ్ లో ఇంతవరకు రాజకీయ నాయకుల మధ్యే మాటల యుద్ధం కొనసాగుతోంది. తప్పు మీదంటే మీదంటూ అధికార, విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ అంశంపై సీబీఐ సిట్ దర్యాప్తు ముగిసినా రాజకీయ రచ్చ మాత్రం ఆగలేదు. ఒక విధంగా చెప్పాలంటే సిట్ దర్యాప్తు ముగిసిన తర్వాత కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. దీని తర్వాతే వివాదం మరింత ఎక్కువైందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత అగ్గి రాజేస్తున్నాయి. విపక్షం వైసీపీని టార్గెట్ చేస్తూ ఆయన నేరుగా చేసిన విమర్శలపై విస్తృత చర్చ జరుగుతోంది.
తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిపారంటూ గత ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఏడాది చేసిన విమర్శలతో అగ్గి రాజుకుంది. దీనిపై విపక్షానికి చెందిన టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సుప్రీం పర్యవేక్షణలో సీబీఐ, ఏపీ సీఐడీ సంయుక్తంగా దర్యాప్తు చేశాయి. లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేశారని, చుక్క పాలు లేకుండా రసాయనాలతో నెయ్యిని తయారు చేసి టీటీడీకి సరఫరా చేశారని సిట్ తేల్చింది. అయితే ఇదే సమయంలో జంతు కొవ్వుపై సిట్ ఎక్కడా స్పష్టంగా ఆరోపణలు చేయకపోవడం, అందుకు ఆధారాలు చూపకపోవడంపై విపక్షం వైసీపీ ఊపిరి పీల్చుకుంది.
సిట్ చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎదురుదాడి మొదలుపెట్టింది. ఈ విషయంలో వైసీపీ తీవ్రస్థాయిలో రాజకీయ దాడి చేయడంతో ఒకానొక సమయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు ఉక్కిరిబిక్కిరి అయ్యారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే జంతువుల కొవ్వు కలిసిందని ప్రభుత్వం తన పాత వాదనను గట్టిగా వినిపిస్తున్నా, తమకు చార్జిషీటులో క్లీన్ చిట్ ఇచ్చిందని, తమ నేతల తప్పులేదని సీబీఐ సిట్ తేల్చిందని వైసీపీ చేస్తున్న ప్రచారమే ప్రజల్లోకి ఎక్కువగా వెళ్లిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ సిట్ పై ప్రభుత్వ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా, రసాయనాలతో కూడిన నెయ్యి సరఫరా చేయడాన్ని సీరియస్గా తీసుకుంటున్నామని, దీనిపై విచారణ కమిషన్ వేస్తున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
ఇక ఈ వివాదం అధికార కూటమి, విపక్ష వైసీపీ మధ్య తీవ్రస్థాయిలో సాగుతుండగా, రిటైర్డ్ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూతో మొత్తం ఎపిసోడ్ ను మలుపు తిప్పారని అంటున్నారు. వైసీపీ నేతలపై సీబీఐ సిట్ ఎలాంటి ఆరోపణలు చేయకపోయినా, టీటీడీ మాజీ ఈవోగా ఎల్వీ స్పందిస్తూ ఈ విషయంలో మాజీ సీఎం జగన్మోహనరెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి నైతిక బాధ్యత వహించాలంటూ చేసిన కామెంట్లు అగ్గి రాజేసేవిగా ఉన్నాయని అంటున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో తిరుమల ప్రసాదంలో మహాపచారం జరిగిందని, ఈ కుట్రపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని హిందూ సమాజం అంతా ఏకమై ప్రభుత్వాన్ని కోరాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎల్వీ సుబ్రహ్మణ్యం తరహాలోనే టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సైతం ఇటీవల ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తిరుమల శ్రీవారి ప్రసాదంలో రసాయినాలతో తయారు చేసిన నెయ్యిని వాడి మహాపచారం చేశామంటూ వ్యాఖ్యానించారు. అదేవిధంగా తాజాగా టీటీడీ మాజీ సభ్యుడు ఏవీ రమణ సైతం ఎన్.డీ.బీ.బీ నివేదికలో కల్తీపై ఆధారాలు ఉన్నాయని ఎత్తిచూపారు. ఈ వరుస పరిణామాలతో విపక్షం వైసీపీని ప్రభుత్వం టార్గెట్ చేస్తుందా? అన్న అనుమానాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. తిరుమల కల్తీ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు వదిలేసినా అధికార కూటమి మాత్రం వైసీపీని రాజకీయంగా దెబ్బతీసేలా అడుగులు వేస్తోందని అంటున్నారు. తటస్థ వర్గానికి చెందిన ఎల్వీ సుబ్రహ్మణ్యం, రమణ దీక్షితులు వంటి వారితో ప్రభుత్వ అనుకూల మీడియాతో మాట్లాడించడం, అదే సమయంలో ఈ వ్యవహారంపై హిందూ మతానికి చెందిన పీఠాధిపతులను కలుస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం చూస్తే ఇప్పట్లో ఈ వివాదానికి ముగింపు పలికే సూచనలు కనిపించడం లేదని అంటున్నారు.
