Begin typing your search above and press return to search.

శ్రీవారికి శఠగోపం! ఇదేం భక్తి గోవిందా?

శ్రీవారికి భక్తితో సమర్పించాల్సిన దక్షిణను భారంగా భావిస్తున్నారా? అనే సందేహం వ్యక్తమవుతోంది.

By:  Tupaki Political Desk   |   10 April 2026 7:00 PM IST
శ్రీవారికి శఠగోపం! ఇదేం భక్తి గోవిందా?
X

అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు, కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే చాలు జన్మ ధన్యమౌతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆపద మొక్కులవాడిని నమ్ముకుని కోట్లాది మంది భక్తులు తమ కోర్కెలు తీరాలని ముడుపులు కడతారు, నిలువుదోపిడీలు ఇస్తారు. కొండంత దేవుడికి తలనీలాల దగ్గర నుండి నిలువు దోపిడీ వరకు భక్తులు సమర్పించుకునే ప్రతీదీ పవిత్రమైనదే. కానీ, ఇటీవల శ్రీవారి హుండీలో భక్తులు స్వామి వారికి సమర్పించే కానుకలు తీవ్ర చర్చకు కారణమవుతున్నాయి. శ్రీవారికి భక్తితో సమర్పించాల్సిన దక్షిణను భారంగా భావిస్తున్నారా? అనే సందేహం వ్యక్తమవుతోంది.

హుండీలో చెల్లని నోట్లు

ఇటీవల కాలంలో శ్రీవారి సన్నిధిలో చెల్లని నోట్లు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. 2016 నుంచి శ్రీవారి హుండీ ద్వారా దాదాపు రూ.400 కోట్ల మేర రద్దైన కరెన్సీ పోగుపడింది. వీటిని భద్రపరిచేందుకు టీటీడీ ప్రతి నెలా రూ.2 లక్షల వరకు ఖర్చు చేయాల్సివస్తోందని చెబుతున్నారు. స్వామి వారికి భక్తితో కానుకలను సమర్పించుకోవాల్సివుండగా, భక్తులు తమ వద్ద ఉన్న చెల్లని నోట్లను వదిలించుకోవాలనే ఆలోచనతో హుండీని నింపేస్తుండటం విస్మయానికి గురిచేస్తోందని అంటున్నారు.

మొక్కులు చెల్లించినట్లేనా?

2016లో జరిగిన పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా పాత రూ.500, రూ.1000 నోట్లు చలామణిలో లేకుండా పోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రూ.2000 నోట్లను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అయితే, చాలా మంది భక్తులు రద్దైన నోట్లను బ్యాంకుల్లో మార్చుకోలేకపోయారు. ఈ డబ్బు బయట చెలామణి చేయడానికి వీలు కాకపోవడంతో శ్రీవారి హుండీల్లో వేస్తు, మొక్కులు చెల్లించుకున్నట్లు భావిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికీ తిరుమల హుండీలో ఈ రద్దైన నోట్లు కుప్పలు కుప్పలుగా వచ్చి చేరుతున్నాయని చెబుతున్నారు.

సందిగ్ధంలో టీటీడీ

గత కొన్నేళ్లలో ఇలా భక్తులు హుండీలో వేసిన పాత నోట్ల విలువ దాదాపు రూ. 400 కోట్లు దాటిందని అంచనా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ నోట్లను మార్చుకోవడానికి నిరాకరించడంతో, ఇవన్నీ ప్రస్తుతం కేవలం చెత్త కాగితాలుగా మిగిలిపోయాయి. ఇక భక్తులు సమర్పించిన కానుకలు కాబట్టి, వాటిని పారబోయలేక, అటు వినియోగించుకోలేక తిరుమల తిరుపతి దేవస్థానం సందిగ్ధంలో పడింది. ఈ చెల్లని నోట్లను భద్రపరచడానికి నెలకు సుమారు రూ. 2 లక్షలు అదనంగా ఖర్చు చేస్తోందని చెబుతున్నారు. భక్తుల భక్తితో ఇచ్చిన కానుకలు ఇలా సంస్థకు ఆర్థిక భారంగా మారడం శోచనీయంగా వ్యాఖ్యానిస్తున్నారు.

అపచారం కాదా?

భక్తులు ఏదైనా మొక్కుకున్నప్పుడు ఆ మొక్కు తీర్చుకునే సమయం, సందర్భాన్ని ఎంతో పవిత్రంగా భావించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ పనికిరాని, బయట చెల్లని కాగితాలను హుండీలో వేయడం అంటే ఆ శ్రీనివాసుడిని వంచించడమే అవుతుందని పండితులు హెచ్చరిస్తున్నారు. సమస్యలు తీర్చమని వేడుకుని, తీరా మొక్కు చెల్లించుకునే సమయంలో విలువలేని కాగితాలు వేయడం స్వామికి చేసే అపచారమే అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. భక్తి ముసుగులో చెల్లని నోట్లను హుండీలో వేయడం ధర్మం అనిపించుకోదని చెబుతున్నారు.