Begin typing your search above and press return to search.

తిరుమల లడ్డూ కేసులో కీలక పరిణామం.. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఝలక్

ఈ వ్యవహారంపై విచారణ చేపడుతున్న సీబీఐ-సిట్ అధికారులు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఝలక్ ఇచ్చారు. సుబ్బారెడ్డి పీఏ అప్పన్నను విచారించేందుకు నోటీసులు జారీ చేశారు.

By:  Tupaki Desk   |   4 Jun 2025 6:04 PM IST
తిరుమల లడ్డూ కేసులో కీలక పరిణామం.. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఝలక్
X

తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంపై విచారణ చేపడుతున్న సీబీఐ-సిట్ అధికారులు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఝలక్ ఇచ్చారు. సుబ్బారెడ్డి పీఏ అప్పన్నను విచారించేందుకు నోటీసులు జారీ చేశారు. దీంతో వైసీపీలో కలకలం చెలరేగింది. మాజీ సీఎం జగన్ బాబాయ్ అయిన సుబ్బారెడ్డి గత ప్రభుత్వంలో సుమారు నాలుగేళ్లపాటు టీటీడీ చైర్మన్ గా వ్యవహరించారు. దీంతో ఆయన పీఏ అప్పన్నను విచారించేందుకు సిట్ సిద్ధమవడం చర్చనీయాంశమవుతోంది.

తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని లడ్డూ ప్రసాదానికి వాడారని గత ఏడాది డిసెంబరులో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుని ఏపీ పోలీసులు-సీబీఐతో కలిపి సంయుక్త సిట్ ఏర్పాటు చేసింది. గత ఆరు నెలలుగా విచారణ జరుపుతున్న సిట్ ఈ వ్యవహారంలో దాదాపు 15 మందిని అరెస్టు చేసింది. ఆలయానికి నెయ్యి సరఫరా చేసిన డెయిరీ యజమానులు, ఉద్యోగులతోపాటు టీటీడీ సిబ్బందిలో కొందరిని నిందితులుగా గుర్తించారు.

వీరిని విచారిస్తున్న సిట్ అధికారులు తాజాగా మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడిని కూడా విచారించేందుకు నోటీసులు ఇవ్వడం సంచలంగా మారింది. గత రెండు రోజులుగా ఆరుగురు టీటీడీ సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. వారితో కలిపి అప్పన్నను విచారించేందుకు తాజాగా నోటీసులిచ్చారని సమాచారం. వాస్తవానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు విచారణను గత నెల 15వ తేదీ నాటికి ముగించాల్సివుంది. అయితే దర్యాప్తు పూర్తికాలేదని సిట్ నివేదించడంతో మరో రెండు నెలలు గడువు పెంచింది సుప్రీంకోర్టు. ఇలాంటి సమయంలో మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి పీఏని విచారణకు పిలవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కల్తీ వ్యవహారం వెలుగు చూసిన నుంచి అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తిరుమల పవిత్రతను దెబ్బతీశారని రెండు పక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే కల్తీ వ్యవహారంలో అసలు పాత్రధారులు, సూత్రధారులు ఎవరన్నది ఇంకా పూర్తిస్థాయిలో వెల్లడి కావాల్సివుంది. ప్రస్తుతానికి పాత్రధారులు కొంతమందిని అరెస్టు చేసినా, సూత్రధారుల్లో బడా నేతలు ఉండొచ్చనే అనుమానంతో సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. దీంతో విపక్షంలో ఎవరిని టార్గెట్ చేశారనే సస్పెన్స్ రాజకీయంగా వేడిపుట్టిస్తోంది.