ఇక, డిజిటల్ తిరుమల.. సంచలన నిర్ణయం!
ఇలాంటి కీలక సమయంలో అసెంబ్లీ అంచనాల కమిటీ.. తిరుమలలో పర్యటించింది. అసలు ఏం జరు గుతోంది? అని ఆరా తీసింది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ బాగానే ఉందని సంతృప్తి వ్యక్తం చేసింది.
By: Tupaki Desk | 18 April 2025 10:10 AM ISTతిరుమల వ్యవహారం.. రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఏదో ఒక వివాదం.. ఏదో ఒక సమస్య.. తెరమీదికి వస్తూనే ఉంది. లడ్దూలో నెయ్యి కల్తీ నుంచి తిరుమలలో అన్నమత ప్రచారం.. అన్యమస్తుల రాక, డ్రోన్ల వ్యవహారం.. మద్యం, బిర్యానీ పంపిణీ.. ఇలా.. అనేక అంశాలు తెరమీదికి వస్తూనే ఉన్నాయి. వివాదాలకు కేంద్రంగా మారుతూనే ఉన్నాయి. ఇక తాజాగా గోశాలల్లో ఆవులు మృతి చెందుతున్నాయన్న రగడ.. వైసీపీ నాయకుల అరెస్టుల వరకు చేరింది.
ఇలాంటి కీలక సమయంలో అసెంబ్లీ అంచనాల కమిటీ.. తిరుమలలో పర్యటించింది. అసలు ఏం జరు గుతోంది? అని ఆరా తీసింది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ బాగానే ఉందని సంతృప్తి వ్యక్తం చేసింది. అదే విదంగా స్వామివారికి అందుతున్న విరాళాలను భద్రంగానే ఉంచుతున్నారని.. భక్తులకు కల్పించే సౌకర్యాలను కూడా మెరుగ్గానే తీర్చిదిద్దుతున్నారని పేర్కొంది. అయితే.. విమర్శలకు, వివాదాలకు చెక్ పెట్టేలా.. డిజిటల్ రూపంలో తిరుమలను భక్తులకు చేరువ చేయనున్నట్టు తెలిపింది.
ఈ మేరకు డిజిటల్ మాధ్యమాలను సృష్టించేందుకు తిరుమల అధికారులు రెడీకావాలని అంచనాల కమిటీ సూచించింది. తద్వారా భక్తుల సెల్ ఫోన్లలో నిరంతరం తిరుమలకు సంబంధించి సమాచారాన్ని నేరుగా అందించడంతోపాటు.. వివాదాలు, విమర్శలపై విశ్లేషణలు కూడా అందించే ఏర్పాటు చేయాలని.. తద్వారా తిరుమలపై అపోహలు పెరగకుండా ఉండడంతోపాటు భక్తులకు కూడా.. ఇబ్బంది లేకుండా ఉంటుందని పేర్కొంది. అవసరమైతే.. రెండు నుంచి నాలుగు తిరుమల డిజిటల్ పేరుతో చానెళ్లను ప్రారంభించాలని సూచించింది.
ఇది వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఈవోను ఆదేశించింది. తద్వారా మరింతసమాచారం ఎప్పకటిప్పుడు.. భక్తులకు చేరుతుందని పేర్కొంది. కాగా.. ఇప్పటికే తిరుమలకు శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ ఉంది. అయితే.. ఇది కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకు, శ్రీవారిసేవల లైవ్‌లకు మాత్రమే పరిమితమైంది. అలా కాకుండా.. ఇక నుంచి సమాచారంతో కూడిన నిరంతర చానెళ్లు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి.
