తిరుమలలో విషాదం.. ఏం జరిగిందంటే!
అఖిలాండ కోటి బ్రంహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి సన్నిధిలో నిత్య గోవింద నామ స్మరణలు జరుగుతాయి.
By: Tupaki Desk | 22 April 2025 3:26 PMఅఖిలాండ కోటి బ్రంహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి సన్నిధిలో నిత్య గోవింద నామ స్మరణలు జరుగుతాయి. అయితే.. గత కొంత కాలంగా ఏం జరిగిందో ఏమో.. కొన్ని తప్పులు జరుగుతున్నాయి. కొన్నళ్ల కిందట తిరుమల పవిత్ర లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యిని వినియోగించారని పెద్ద దుమారం రేగింది. తర్వాత.. తిరుపతిలో తొక్కిసలాట... ఇటీవల గోశాలలో ఆవుల మృతి వ్యవహారాలు భక్తులను కలవరపాటుకు గురిచేశాయి.
తాజాగా తిరుమలలో యువకుడు ఉరివేసుకొని మృతి చెందిన ఘటన మరింత కలవరాన్ని కలిగించింది. మంగళవారం సాయంత్రం వెలుగు చూసిన ఈ ఘటన అధికారులను తీవ్రంగా కలవరానికి గురి చేసింది. అది కూడా.. పవిత్రంగా భావించే నారాయణ గిరి ఉద్యానవనంలో చోటు చేసుకోవడంతో అందరూ ఉలిక్కి పడ్డారు. తొలుత ఈ ఘటనను చూసిన స్వీపర్లు అధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న అధికారులు వేలాడుతున్న శవాన్ని దింపి.. విచారణ చేశారు.
మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని యువకుడిగా గుర్తించారు. ఆ వెంటనే ఈ సమాచారాన్ని టిటిడి విజిలెన్స్ అధికారులు తిరుమల టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో తిరుమల టూ టౌన్ పోలీసులు మృతదేహాన్ని తిరుపతి రూయా మార్చురికి తరలించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతామని.. ఉద్దేశ పూర్వకంగా.. ఎవరూ చేయరని భావిస్తున్నట్టు అధికారులు వివరించారు.
దర్శనాలు ఆపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీనిపై పండితుల నుంచి వివరణ తీసుకున్నాక ననిర్ణయం తీసుకుంటామన్నారు. ఆలయాన్ని, నారాయణగిరి ఉద్యానవనాన్ని సంప్రోక్షణ చేయాల్సిన అవసరం ఉందని ఆలయ అర్చకులు చెబుతున్నారు. అయితే.. తిరుమల ప్రధానాలయానికి దూరంగానే ఈ ఘటన జరిగిన నేపథ్యంలో సీనియర్ అర్చకులు,, పండితులు, మఠాధిపతుల నిర్ణయం మేరకు నడుచుకుంటామని అధికారులు తెలిపారు.