Begin typing your search above and press return to search.

తిరుమ‌ల‌కు మ‌రో క‌ష్టం.. ఒడ్డెక్కేనా?!

ఇటీవ‌ల కాలంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వ్య‌వ‌హారాలు హాట్ హాట్‌గా కొన‌సాగుతున్నాయి.

By:  Garuda Media   |   11 March 2026 11:22 PM IST
తిరుమ‌ల‌కు మ‌రో క‌ష్టం.. ఒడ్డెక్కేనా?!
X

ఇటీవ‌ల కాలంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వ్య‌వ‌హారాలు హాట్ హాట్‌గా కొన‌సాగుతున్నాయి. కేక్ క‌టింగులు, అన్య‌మ‌త ఉద్యోగులు, తిరుమ‌ల ప్ర‌ధాన ద్వారం మందు రీల్స్‌.. ఇలా అనేక విష‌యాల్లో వివాదాలు వ‌స్తున్నాయి. అయితే.. ఇప్పుడు మ‌రో క‌ష్టం తిరుమ‌ల‌ను వెంటాడుతోంది. అదే.. వంట గ్యాస్‌. ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో చ‌మురు, గ్యాస్ స‌ర‌ఫరాకు తీవ్ర ఇబ్బందులు నెల‌కొన్నాయి. దీంతో వంట గ్యాస్‌.. స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. దేశ‌వ్యాప్తంగా ఇంటికిస‌ర‌ఫ‌రా చేసే గ్యాస్ విష‌యంలో ఇప్పటికిప్పుడు ఇబ్బందులు లేక‌పోయినా.. వాణిజ్య స‌ర‌ఫ‌రాకు మాత్రం దాదాపు బ్రేక్ ప‌డింది.

దేశ‌వ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ స‌ర‌ఫ‌రా ఇర‌కాటంలో ప‌డ‌డంతో హోట‌ళ్లు, రెస్టారెంట్ల కార్య‌కలాపాలు నిలిచిపోయాయి. క‌ట్టెల పొయ్యిలు ఏర్పాటు చేసుకుని కొంద‌రు ఈ వ్యాపారాలు కొన‌సాగిస్తున్నా.. మెజారిటీ సంఖ్య‌లో రెస్టారెంట్లు మూత బ‌డ్డాయి. ఇక‌, ఈ ప్ర‌భావం ఆల‌యాల‌పైనా ప‌డింది. దేశ‌వ్యాప్తంగాప‌లు ఆల‌యాల‌లో నిత్యాన్న‌దానం చేస్తున్నారు. అయోధ్య నుంచి కంచి కామాక్షి ఆల‌యం వ‌ర‌కు.. అన్న‌వ‌రం నుంచి తిరుమ‌ల వ‌ర‌కు నిత్యం భోజ‌న ఏర్పాట్లు ఉన్నాయి. వీటిలో తిరుమ‌ల‌కు అత్యంత ప్రాధాన్యం ఉంది. నిత్యం ల‌క్ష మందికి పైగానే భ‌క్తులు ఇక్క‌డ నిర్విరామంగా శ్రీవారి అన్న‌ప్ర‌సాదం తీసుకుంటున్నారు.

ఇక‌, ప్ర‌స్తుతం నెల‌కొన్న గ్యాస్ సంక్షోభం నేప‌థ్యంలో అయోధ్య‌లో నిత్యాన్న‌దానాన్ని నిలుపుద‌ల చేశారు. ఒడిశాలోని ప్ర‌ఖ్యాత జ‌గ‌న్నాధ మందిరంలోనూ.. బుధ‌వార‌మే అన్న‌దానం నిలుపుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ల‌క్ష‌ల మందికి నిత్యం భోజ‌న ప్ర‌సాదాలు అందించే తిరుమ‌ల మాటేంట‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఈ వ్య‌వ‌హారంపై తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారులు ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. వాస్త‌వానికి ప‌ది రోజులకు స‌రిపోయేలా గ్యాస్ నిల్వ‌లు ఉంటాయి. ఇప్ప‌టికి మూడు రోజులుగా గ్యాస్ స‌ర‌ఫ‌రా కాలేద‌ని తిరుమ‌ల సిబ్బంది చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికేఉన్న నిల్వ‌లు.. మ‌రో ఐదు రోజుల వ‌ర‌కు స‌రిపోయే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. కానీ, ఆ త‌ర్వాత మాటేంట‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారంపై ప్ర‌భుత్వం కానీ.. అటు తిరుమ‌ల అధికారులు కానీ పెద్ద‌గా దృష్టి పెట్ట‌లేదు. ఒక‌వేళ గ్యాస్ స‌ర‌ఫ‌రా విష‌యంలో ఏదైనా లోపాలు ఏర్ప‌డితే.. ప్ర‌త్యామ్నాయ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేస్తారా? లేక తాత్కాలికంగా భోజ‌న ప్ర‌సాదాల‌ను నిలుపుద‌ల చేస్తారా? అనేది చూడాలి. భోజ‌న ప్ర‌సాదాలు నిలుపుద‌ల చేయ‌బోర‌ని కొంద‌రు అంటున్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిని చక్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేస్తే స‌రిపోతుంద‌ని అంటున్నారు. మ‌రి గండం నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ‌తారో చూడాలి.