Begin typing your search above and press return to search.

'సినీ హీరోల నుంచి దేశభక్తి ఆశించకండి'.. పవన్ కీలక వ్యాఖ్యలు!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 May 2025 10:46 AM IST
Tiranga Yatra in Vijayawada Pawan Kalyan Fiery Speech
X

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఆ ఆపరేషన్ తో అటు పాక్ సైన్యాన్ని, ఇటు ఉగ్రవాదులను భారత్ వణికించేసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా... 'తిరంగా యాత్ర'కు పిలుపునిచ్చింది బీజేపీ. ఈ నేపథ్యంలో విజయవాడలో కూటమి పార్టీల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అవును... దేశవ్యాప్తంగా బీజేపీ పిలుపునిచ్చిన 'తిరంగా యాత్ర'ను తాజాగా విజయవాడలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజానికం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పందించిన పవన్... పాక్ పై ఘాటు విమర్శలతో పాటు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... భారత్ అభివృద్ధిని చూసి ఓర్వలేక పాక్.. ఉగ్రవాదులను పెంచి పోషించి, మనపై దాడులకు పాల్పడుతోందని.. ముంబై, కోయంబత్తుర్, హైదరాబాద్ వరుస బాంబు పేలుళ్లన్నింటి వెనుక ఆ దేశ హస్తం ఉందని.. అయితే, ఇకపై పాక్ ఆటలు సాగవని.. 'మీరు మాదేశంలోకి వచ్చి కొడితే, మేము మీ ఇళ్లలోకి వచ్చి మరీ కొడతామని' పవన్ హెచ్చరించారు.

ఇదే సమయంలో... ఇప్పటివరకూ సహనంతో మా చేతులు కట్టేశారని.. ఇకపై శాంతివచనాలు వారికి పనిచేయవని.. ఇకపై వారి ఆటలు సాగనివ్వబోమనే విషయం ఆపరేషన్ సిందూర్ తో చేసి చూపించామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ సమయంలో దేశానికి మనం చేయగలిగింది ఒక్కటే అని.. అదే.. సైన్యానికి అండగా మేమున్నామనే ధైర్యం చెప్పడమే అని స్పష్టం చేశారు.

అదేవిధంగా.. దేశం లోపల చాలా మంది సూడో సెక్యులరిస్టులు ఉన్నారని చెప్పిన పవన్ కల్యాణ్.. భారత సైన్యాన్ని బలహీనపరిచేలా, కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని.. అలాంటి వారికి బలంగా సమాధానం చెప్పి వారి నోళ్లు మూయించడం పౌరులందరి కర్తవ్యం అని సూచించారు. ఈ నేపథ్యంలోనే సినీ హీరోల ప్రస్థావన తెచ్చారు.

ఇందులో భాగంగా... ఈ విషయాలపై చాలా మంది సినీ హీరోలు, సెలబ్రెటీలు ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతున్నారని.. అయితే, వారెవరూ దేశాన్ని నడిపేవాళ్లు కాదని.. వాళ్లు వినోదాన్ని పంచేవాళ్లు మాత్రమే అని.. వారినుంచి అంతకుమించి దేశభక్తిని ఆశించవద్దని.. మురళీనాయక్ లా దేశం కోసం ప్రాణాలు అర్పించినవాళ్లే నిజమైన దేశభక్తులని పవన్ తెలిపారు!