బీజేపీ తిరంగా వర్సెస్ కాంగ్రెస్ జై హింద్!
భారతీయుల కళ్ళలో ఆనందం మెరిసింది. ఇదే ఊపుతో పాక్ ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలని అంతా గట్టిగా కోరుకున్నారు.
By: Tupaki Desk | 29 May 2025 11:03 PM ISTదేశం కోసం సైనికులు యుద్ధం చేశారు. వారి దేశ భక్తిని కీర్తించడానికి మాటలు అయితే చాలవు. సరిహద్దులలో నిరంతరం పహరా కాస్తూ కళ్ళలో ఒత్తులేసుకుని శత్రువుని కనిపెడుతూ అవసరం అయిన సందర్భంలో దేశం కోసం తమ ప్రాణాలను తృణ ప్రాయంగా త్యజించే వారి సేవలు ఎనలేనివి.
పహిల్గాం దాడితో భారతదేశం మొత్తం మండిపోయింది. కులం మతం, ప్రాంతం వర్గం, వర్ణం అన్న తేడా లేకుండా అంతా ఒక్కటిగా నిలిచి పాకిస్థాన్ భరతం పట్టాలని గట్టిగా కోరుకున్నారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం చేసిన వైమానిక దాడులతో పాక్ విలవిలలాడింది. ఉగ్ర శిబిరాలు ఒక్క దెబ్బకు నేల కూలాయి.
భారతీయుల కళ్ళలో ఆనందం మెరిసింది. ఇదే ఊపుతో పాక్ ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలని అంతా గట్టిగా కోరుకున్నారు. ఇక ఉగ్ర వాదం అన్న పదం వినిపించకూడదని కూడా భావించారు. కానీ నాలుగు రోజుల పాటు జరిగిన దాడుల తరువాత యుద్ధం ఆగిపోయింది కాల్పుల విరమణను అటూ ఇటూ పాటించారు.
ఇది దేశంలోని పౌరులందరి ఆశల మీద ఆవేశం మీద నీళ్ళు చల్లినట్లు అయింది దాంతో అంతా ఒక్కసారిగా చప్పబడ్డారు. ఇదే సమయంలో భారత జవాన్ల పౌరుషాన్ని వారి విజయాన్ని జాతి జనులకు చెబుతామని బీజేపీ ఈ నెల 13 నుంచి 24 వరకూ భారీ ఎత్తున దేశవ్యాప్తంగా తిరంగా యాత్రను చేపట్టింది. ఈ యాత్రలో ఎటు చూసినా బీజేపీ జెండాలతో పాటు రాజకీయ పరంగా సాగడంతో కాంగ్రెస్ సహా విపక్షాలు దాని మీద విమర్శలు ఎక్కుపెట్టారు.
సైనికుల త్యాగాలను రాజకీయం చేస్తున్నారు అని కూడా మండిపడ్డాయి. ఇక బీజేపీ మాత్రం జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర జిల్లా గ్రామ స్థాయి దాకా తిరంగా యాత్రను చేపట్టింది. అలా కాషాయ దళం దేశ భక్తిని తమ సొత్తు అని చెప్పుకుందని విమర్శలు వినిపించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ కూడా జైహింద్ పేరుతో రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ జైహింద్ పేరిట ర్యాలీలు నిర్వహిస్తోంది.
ఈ ర్యాలీలలో దేశం కోసం త్యాగాలు చేసిన సైనికులను కొనియాడుతూనే వారి విజయాలను రాజకీయం చేస్తున్న బీజేపీని గట్టిగానే విమర్శిస్తోంది. అసలు యుద్ధం ఎందుకు ఆపారని బీజేపీ పెద్దలను కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. ట్రంప్ చెబితే యుద్ధం ఆపేస్తారా అన్నారు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి. పాక్ ని ప్రపంచ పటంలో కనిపించకుండా చేయాలని దేశ ప్రజలు కోరుకుంటే యుద్ధం లేకుండా కాల్పుల విరమణను ఎవరు పాటించమన్నారు అని ఆయన నిలదీశారు.
పాకిస్థాన్ మీద యుద్ధం చేయకుండా నిలుపుదల చేయడం వెనక అమెరికా పాత్ర ఎందుకు అని ఆయన అంటున్నారు. గతంలో ఇందిరాగాంధీ యుద్ధం చేసి మరీ పాక్ ని నడ్డి విరగ్గొట్టి రెండుగా చేశారు అని ఆయన గుర్తు చేశారు. ఆనాడు అమెరికా మాటను ఇందిరా గాంధీ వినలేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి మోడీ మీద రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలే చేశారు. ఆయనే కాదు కాంగ్రెస్ నాయకులు దేశమంత జైహింద్ అంటూనే బీజేపీ మీద విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
మొత్తానికి చూస్తే సరిహద్దులలో యుద్ధం అయితే ఆగింది. కానీ దేశంలో రాజకీయ యుద్ధం స్టార్ట్ అయింది. దేశం కోసం పోరాటం దేశ రక్షణ అన్ని చాలా భావోద్వేగాన్ని కలిగించేవి. వాటిని రాజకీయంగా బీజేపీ వాడుకుంటోంది అని కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కూడా జైహింద్ పేరుతో అదే చేస్తోంది అన్నది బీజేపీ నేతల ప్రతి విమర్శ. మొత్తానికి పాక్ భారత్ మధ్య కాల్పుల విరమణ జరిగింది. దేశంలో ర్యాలీలు పోటాపోటీగా జరుగుతున్నాయి. మరి జనాలు ఏమనుకుంటున్నారు అన్నదే ఇపుడు చాలా ముఖ్యం.
