Begin typing your search above and press return to search.

మళ్లీ తెలుగు వాడే అధిపతి.. మావోయిస్టు పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శి తిరుపతి?

మావోయిస్టు పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శిగా తెలుగువాడైన తప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ఎంపికయ్యారని కథనాలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   10 Sept 2025 10:31 AM IST
మళ్లీ తెలుగు వాడే అధిపతి.. మావోయిస్టు పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శి తిరుపతి?
X

మావోయిస్టు పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శిగా తెలుగువాడైన తప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ఎంపికయ్యారని కథనాలు వస్తున్నాయి. ఈ విషయమై మావోయిస్టు పార్టీ నుంచి అధికారికంగా ప్రకటించకపోయినా, ఆయన నియామకాన్ని పోలీసు వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నంబాళ్ల కేశవరావు పోలీసు కాల్పుల్లో మరణించారు. దీంతో పార్టీలో నెంబర్ టు హోదాలో ఉన్న తిరుపతికి ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్, పొలిట్ బ్యూరో సభ్యుడిగా తిరుపతి వ్యవహరిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

తెలుగు నేలపై మావోయిస్టు ఉద్యమం బలహీన పడినా, ఆ పార్టీపై తెలుగువారి ఆధిపత్యం కొనసాగుతోందని తిరుపతి నియామకంతో బయటపడిందని అంటున్నారు. మే నెలలో జరిగిన ఎన్ కౌంటరులో పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు మరణించారు. పార్టీ చరిత్రలోనే పోలీసు కాల్పుల్లో ప్రధాన కార్యదర్శిని కోల్పోవడం అదే తొలసారి. దీంతో ఉద్యమంపై చాలా ప్రభావం చూపిందని అంటున్నారు. ఆ కారణంగానే కొత్త సారథిని ఎంపిక చేసుకోడానికి మావోయిస్టులు ఐదు నెలల సమయం తీసుకోవాల్సివచ్చిందని అంటున్నారు.

ఒకప్పుడు దండకారుణ్యంలో బలమైన ప్రభావం చూపిన మావోయిస్టులు కేంద్ర బలగాల ఆపరేషన్ తో అక్కడ ఉనికి కోసం పాట్లు పడుతున్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీని రక్షించుకోవడంపై ద్రుష్టి పెట్టిన మావోయిస్టులు కీలక నియామకాలు చేపట్టినట్లు పోలీసు వర్గాలకు సమాచారం అందిందని అంటున్నారు. కొత్త ప్రధాన కార్యదర్శిగా తిరుపతిని నియమించడంతోపాటు దండకారుణ్యంలో విప్లవాన్ని విస్తరించిన మావోయిస్టు నేత హిడ్మా అలియాస్ సంతోష్ కు దండకారణ్య స్పెషల్ జోన్ కార్యదర్శిగా నియమించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఈ జోన్ లేదని, కొత్తగా స్రుష్టించారని అంటున్నారు.

కాగా, మావోయిస్టు నూతన కార్యదర్శిగా నియమితులైన తిరుపతిపై ఎన్ఐఏ రూ.కోటి రివార్డు ప్రకటించింది. కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన ఆయన 1983లో విప్లవ రాజకీయాలపై ఆకర్షితుడై అజ్ఞాతంలోకి వెళ్లారని అంటున్నారు. 1978లో తొలిసారిగా జగిత్యాల జైత్రయాత్రకు వెళ్లిన తిరుపతి అనంతరం నక్సల్ ఉద్యమంపై ఆసక్తి పెంచుకున్నట్లు చెబుతున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా అజ్ఞాతంలోనే ఉన్న తిరుపతి ఆయుధాలు తయారు చేయడంలో ప్రావీణ్యం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అదేవిధంగా అలిపిరిలో చంద్రబాబుపై దాడిలో నిందితుడుగా ఉన్నట్లు తెలుస్తోంది.