Begin typing your search above and press return to search.

తండ్రి ఓడించారు...కొడుకు అదే జెండా పట్టుకున్నారు

రాజకీయాలు అంటే ఇవేనేమో అనిపిస్తుంది జరుగుతున్న వాటిని చూస్తే. ఒక రాజకీయం ఇంట్లోకే వచ్చేసినట్లుగా ఉంది.

By:  Tupaki Desk   |   13 April 2025 5:38 PM IST
తండ్రి ఓడించారు...కొడుకు అదే జెండా పట్టుకున్నారు
X

రాజకీయాలు అంటే ఇవేనేమో అనిపిస్తుంది జరుగుతున్న వాటిని చూస్తే. ఒక రాజకీయం ఇంట్లోకే వచ్చేసినట్లుగా ఉంది. ఇదిలా ఉండగా విశాఖ జిల్లా గాజువాకలో వైసీపీకి చెందిన కీలక నేత కుటుంబం నుంచి కార్పోరేటర్ తిప్పల వంశీరెడ్డి జనసేనలో చేరుతున్నారు. తిప్పల నాగిరెడ్డి వైసీపీలో ఉన్నారు. ఆయన 2019లో గాజువాక నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి జనసేన నుంచి పోటీ పడిన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని ఓడించారు.

దాంతో జెయింట్ కిల్లర్ గా పేరు గడించారు. ఇక తిప్పల కుటుంబానికి రాజకీయంగా గాజువాకలో ఎంతో పేరు ఉంది. మొదట కాంగ్రెస్ లో ఉన్న తిప్పల కుటుంబం ఆ తరువాత వైసీపీలో చేరింది. ఇక తిప్పలకు ఎమ్మెల్యే కావాలన్నది కోరిక. 2009 నుంచి ఆయన పోటీ చేస్తే 2019లో ఆయన కోరిక తీరింది. ఆయన మూడు సార్లు ఎమెల్యేగా పోటీ చేస్తే ఒకసారి విజయం సాధించారు.

అయితే వైసీపీ ఆయనకు రెండు సార్లు అవకాశం ఇచ్చింది. ఇక గాజువాక వైసీపీ ఇంచార్జి గా తిప్పల దేవన్ రెడ్డిని వైసీపీ నియమించింది. తిప్పల నాగిరెడ్డి రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడిని తీసుకుని వచ్చారు. దానికి వైసీపీ అధినాయకత్వం ఆమోదముద్ర వేసింది.

అయితే అదే తిప్పల కుటుంబంలో మరో కుమారుడు అయిన తిప్పల వంశీరెడ్డి జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దాంతో వైసీపీలో కలకలం చెలరేగుతోంది. విశాఖలో వైసీపీ మేయర్ ని గద్దె దించడానికి కూటమి గట్టిగా ప్రయత్నం చేస్తోంది.

అయితే కూటమికి సరిపడా కార్పోరేటర్లు ఇంకా కావాల్సి ఉంది. దాంతో ఆయా పార్టీలు వైసీపీ మీద గురి పెడుతున్నారు. ఈ క్రమంలో తిప్పల నాగిరెడ్డి కుమారుడితో మాజీ మంత్రి జనసేనకు చెందిన సీనియర్ నేత అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామక్రిష్ణ చర్చలు జరిపారు. అవి ఫలవంతం కావడంతో రేపో మాపో జనసేన అధినేత పవన్ సమక్షంలో తిప్పల వంశీరెడ్డి ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే అన్న తండ్రి ఉన్న వైసీపీలో ఉండకుండా వంశీరెడ్డి ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే అక్కడే రాజకీయం ఉందనే వారు ఉన్నారు. ఈ రోజుల్లో తండ్రి ఒక పార్టీ కొడుకు మరో పార్టీగా ఉండడం అన్నది సర్వసాధారణమే అని అంటున్నారు.

పైగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అధికారం ఇంట్లో ఉండేలా నాయకులు తమదైన శైలిలో ప్లాన్స్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ అవిశ్వాసాన్ని తీసుకుంది. మేయర్ సీటుని తాము కాపాడుకుంటామని వైసీపీ నేతలు అంతా ముక్తకంఠంతో చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న వారి కుటుంబ సభ్యులే పార్టీ గీత దాటి వెళ్తూంటే వైసీపీని కాపాడేది ఎవరు అన్న చర్చ వస్తోంది. వైసీపీని దించేస్తామని కూటమి నేతలు కచ్చితంగా చెబుతుంటే తమ పార్టీ వారిని కాపాడుకోలేని స్థితిలో వైసీపీ ఉందా అన్న చర్చ సాగుతోంది.

ఇక వైసీపీ మేయర్ ని దించేసేందుకు అనువైన వ్యూహాల కోసం టీడీపీ కూటమి పెద్దలు తాజగా విశాఖలో ఒక హొటల్ లో సమావేశం అయి అన్ని విషయాలను చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవిశ్వాసాన్ని గెలిచి తీరుతామని కూటమి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.