Begin typing your search above and press return to search.

కుక్కలను బెదిరించిన ప్రముఖ నటుడు.. లీగల్ నోటీసులు

ప్రముఖ నటుడు టిన్ను ఆనంద్‌కు ఆయన హౌసింగ్ సొసైటీ ప్రాంగణంలో కుక్కలపై బెదిరింపులకు సంబంధించి ఓ న్యాయవాది లీగల్ నోటీసు జారీ చేశారు.

By:  Tupaki Desk   |   19 May 2025 10:54 AM IST
కుక్కలను బెదిరించిన ప్రముఖ నటుడు.. లీగల్ నోటీసులు
X

ప్రముఖ నటుడు టిన్ను ఆనంద్‌కు ఆయన హౌసింగ్ సొసైటీ ప్రాంగణంలో కుక్కలపై బెదిరింపులకు సంబంధించి ఓ న్యాయవాది లీగల్ నోటీసు జారీ చేశారు. ఈ నోటీసు టిన్ను ఆనంద్‌తో పాటు హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీకి కూడా జారీ చేశారు. సొసైటీ ఆవరణలో కుక్కలు మొరవడాన్ని తప్పుబడుతూ టిన్ను ఆనంద్ వాటిని హాకీ స్టిక్‌తో కొడతానని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఆయన సోషల్ మీడియాలో "కుక్కల్ని ఇంటికి తీసుకెళ్లండి లేదా పరిణామాలు ఎదుర్కొనండి" అని పోస్టు చేశారు. ఈ వ్యాఖ్యలు జంతు ప్రేమికుల నుండి, సినీ పరిశ్రమలోని పలువురి నుండి తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ చర్య జంతువులపై క్రూరత్వంతో పాటు క్రిమినల్ ఇన్టిమిడేషన్ కిందికి వస్తుందని న్యాయవాది తన నోటీసులో పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలపై సమాజం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆమె ఉద్ఘాటించారు.

- న్యాయవాది నోటీసులో ఏముందంటే?

నటుడు టిన్ను ఆనంద్‌కు అధికారిక హెచ్చరిక జారీ చేశారు. వీధి జంతువుల పట్ల చట్టపరమైన బాధ్యతలకు సంబంధించి హౌసింగ్ సొసైటీ అంతర్గత మార్గదర్శకాలను విడుదల చేయాలి. జంతువులు -వాటిని సంరక్షించే వారిపై ఎలాంటి అవాంఛనీయ చర్యలు, బెదిరింపులు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ డిమాండ్లను నెరవేర్చడంలో సొసైటీ విఫలమైతే, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని న్యాయవాది తన నోటీసులో స్పష్టం చేశారు.

ఈ వివాదంపై స్పందించిన టిన్ను ఆనంద్, తన కుమార్తెతో సహా మరికొందరిపై గతంలో వీధి కుక్కలు దాడి చేశాయని తెలిపారు. ఆ సంఘటనల నేపథ్యంలో తనకు స్వరక్షణ హక్కు ఉందని, అందువల్లే తాను అలా స్పందించానని ఆయన వివరణ ఇచ్చారు.

ఈ లీగల్ నోటీసు, హౌసింగ్ సొసైటీలలో నివాసితుల భద్రత, వీధి జంతువుల సంరక్షణ, సమాజంలో శాంతి భద్రతల నిర్వహణ వంటి కీలకమైన అంశాలపై మరోసారి చర్చను రేకెత్తించింది. జంతు సంరక్షణ చట్టాలు , నివాసితుల హక్కుల మధ్య సమతుల్యం ఎలా సాధించాలనే దానిపై ఇది దృష్టి సారించింది.