లవర్ ఇచ్చిన గిఫ్టులను టిండర్‌కు ఇచ్చేయండి.. బ్రేకప్ బాధ నుంచి ఇలా బయటపడండి!
ఇందుకోసం ముంబైలో (అలాగే ఢిల్లీ-NCRలో కూడా) టిండర్ 'డిస్పోజల్ ట్రక్' అనే ప్రత్యేక వాహనాన్ని ప్రవేశపెట్టింది.
By: Tupaki Desk | 1 Jun 2025 8:30 AM ISTలవ్ ఫెయిల్ అయినప్పుడు చాలా మంది తమ మాజీ ప్రియుల జ్ఞాపకాల నుంచి బయటపడలేక తీవ్రంగా బాధపడుతుంటారు. ఏదో కోల్పోయినట్లు ఎమోషనల్ అవుతుంటారు. అలాంటి వారికి కాస్త ఉపశమనం అందించేందుకు ప్రముఖ డేటింగ్ యాప్ 'టిండర్' ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రేమికులు ఇచ్చిన బహుమతులు, వారికి సంబంధించిన వస్తువులను దూరంగా పారేసి, ఆ బాధ నుంచి బయటపడేలా సహాయం చేసేందుకు సిద్ధమైంది.
ఇందుకోసం ముంబైలో (అలాగే ఢిల్లీ-NCRలో కూడా) టిండర్ 'డిస్పోజల్ ట్రక్' అనే ప్రత్యేక వాహనాన్ని ప్రవేశపెట్టింది. ఈ ట్రక్ మాజీ ప్రేమికులకు చెందిన వస్తువులను సేకరించి, వారికి కాస్త రిలీఫ్ అందిస్తుంది. 'మూవ్ ఆన్' (Move On) క్యాంపెయిన్‌లో భాగంగా టిండర్ ఈ ఆలోచనను అమలు చేస్తోంది. ప్రేమ లేఖల నుంచి మాజీ ప్రియుల హూడీలు, ఫోటోల వరకు ఎలాంటి జ్ఞాపకాలను అయినా ఈ ట్రక్‌లో పారేయవచ్చు.
ఇది కేవలం వస్తువులను పారేయడం మాత్రమే కాదు, మానసికంగా ఆ బంధం నుంచి బయటపడటానికి ఒక సంకేతాత్మక చర్యగా టిండర్ భావిస్తోంది. "గతంలో ఎదురైన బాధను వదిలేసి, కొత్త ఆరంభాల వైపు అడుగు వేయండి" అనే సందేశాన్ని ఈ 'డిస్పోజల్ ట్రక్' ద్వారా టిండర్ ఇస్తోంది. ఈ వినూత్నమైన ప్రచారం సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతోంది. ఇది బ్రేకప్‌ల తర్వాత మానసిక ఆరోగ్యం, స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలనే యువత ఆలోచనలకు అద్దం పడుతోంది.
