‘టైమ్ 100’ ప్రభావంతమైన జాబితాలో భారత్ కు దక్కని చోటు
ఈ ఏడాది టాప్ 100 జాబితాలో భారతీయులు ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవటం విశేషం.
By: Tupaki Desk | 17 April 2025 1:30 PMప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేసే ప్రభావశీలుర జాబితాను ప్రఖ్యాత మ్యాగ్ జైన్ ‘టైమ్’ టాప్ 100 మంది జాబితాను ప్రకటించింది. రంగం ఏదైనా కానీ ప్రపంచాన్ని ప్రభావితం చేయటమే కొలబద్ధగా ప్రభావంతమైన వారిని ఎంపిక చేశారు. ఆశ్చర్యానికి గురి చేసే అంశం ఏమంటే.. ఈ ఏడాది టాప్ 100 జాబితాలో భారతీయులు ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవటం విశేషం.
అదే సమయంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ ప్రభావంతమైన వ్యక్తుల్లో ఒకరిగా పేర్కొంటూ జాబితాలో చోటు ఇవ్వటం గమనార్హం. 2025 ఏడాదికి అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో రాజకీయ నాయకులు.. ఐకాన్స్.. ఆర్టిస్ట్స్.. ఇన్నోవేటర్స్.. ఇలా పలు విభాగాలుగా విభజించి లిస్టును తయారు చేశారు.
నేతల విభాగంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. యూకే పరధాని కీర్ స్టార్మర్.. డోజ్ అధినేత ఎలాన మస్క్.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ లు ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఏ విభాగంలోనూ భారతీయులకు చోటు దక్కకపోవటం ఈసారి జాబితా ప్రత్యేకతగా చెప్పాలి. భారత దేశానికి చెందిన ఎవరికి ఈ జాబితాలో చోటు దక్కలేదు కానీ.. భారత సంతతికి చెందిన రేష్మ కెవల్ రామణి టైమ్ జాబితాలో ఉన్నారు. ఆమె.. వర్టెక్స్ ఫార్మా సీఈవోగా వ్యవహరిస్తున్నారు. అమెరికాలోని అతి పెద్ద బయోటెక్నాలజీకి తొలి మహిళా సీఈవోగా ఎంపికై అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
నిజానికి ప్రతి ఏటా టైమ్ ప్రకటించే ప్రభావశీలుర జాబితాలో భారతీయులకు స్థానం దక్కుతుండేది. గత ఏడాది విషయానికి వస్తే.. బాలీవుడ్ నటి అలియాభట్.. రెజ్లర్ కం ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ కు చోటు దక్కింది. అంతకు ముందు 2023లో ప్రముఖ తెలుగు దర్శకుడు రాజమౌళి.. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కు చోటు లభించింది. అందుకు భిన్నంగా ఈసారి మాత్రం ఏ ఒక్కరికి చోటు దక్కకపోవటం షాక్ కు గురి చేసేలా మారింది.