అతడి రక్తం నుంచి పాము విషానికి విరుగుడు.. అదెలా?
వినేందుకే ఒళ్లు జలదరించే ఉదంతాలు.. వాస్తవాలన్న విషయాన్ని నమ్మేందుకు కాస్త కష్టమవుతుంటుంది.
By: Tupaki Desk | 4 May 2025 6:00 PM ISTవినేందుకే ఒళ్లు జలదరించే ఉదంతాలు.. వాస్తవాలన్న విషయాన్ని నమ్మేందుకు కాస్త కష్టమవుతుంటుంది. ఇప్పుడు చెప్పే వ్యక్తికి సంబంధించిన వివరాలు కూడా ఆ కోవకే వస్తాయి. వందల సంఖ్యలో పాముకాట్లతోనూ.. పాము విషాన్ని క్రమపద్దతిలో ఎక్కించుకున్న ఒక వ్యక్తి రక్తం నుంచి అమెరికా వైద్యులు విషానికి విరుగుడును డెవలప్ చేశారు. విన్నంతనే నమ్మశక్యంగా అనిపించని రీతిలో ఉండే ఈ వ్యక్తి పేరు తిమోతీ ఫ్రీడ్. ఇతడు అమెరికాలోని విస్కాన్సిన్ లో ఉంటారు.
ఇతడికి విష సర్పాలు అంటే ఆసక్తి ఎక్కువ. తన ఇంట్లో పదుల సంఖ్యలో పాముల్ని పెంచుకుంటూ ఉంటాడు. ఒకవేళ.. పొరపాటున పాములు కాటు వేస్తే.. ఆ విషంతో తనకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీలుగా.. తక్కువ మోతాదులో పాము విషాన్ని శరీరంలోకి ఎక్కించుకునేవాడు. నెమ్మది నెమ్మదిగా డోసు పెంచాడు. ఆ తర్వాతి కాలంలో పాముల చేత కాటు వేయించుకునేవాడు.
అతనికి ఏమీ అయ్యేది కాదు. మొదట్లో ఇలా చేయటం షురూ చేసినప్పుడు కాస్తంత టెన్షన్ పడిన వాస్తవమేనంటూ అంగీకరిస్తారు తిమోతి. తర్వాతి దశల్లో పాము చేత కాటు వేయించుకోవటం.. విషాన్ని ఒంట్లోకి ఎక్కించుకోవటం పెద్ద విషయంగా అతనికి ఉండేది కాదు. ఈ తరహా పనుల్ని పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలో చేసుకోవటం మరింత షాకింగ్ అంశం.
18 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 856 సార్లు పాముకాటు వేయించుకోవటమో.. పాము విషాన్ని ఒంట్లోకి ఎక్కించుకోవటమో చేశాడు. ఇందులో పదహారు రకాల డేంజర్ జాతులకు చెందిన పాముల విషాలు ఉన్నాయి. ఇతనికి ఉన్న ప్రత్యేక అలవాటు కారణంగా ఇతడి శరీరంలో పాము విషాన్ని సమర్థంగా ఎదుర్కొనే యాంటీబాడీలు తయారయ్యాయి. దీంతో.. ఇతగాడి గురించి తెలిసిన పరిశోధకులు.. ఇతడి రక్తాన్ని సేకరించి.. పరిశోధనలు చేశారు.
వీరి పరిశోధనల్లో తేలిందేమంటే.. అనేక రకాల పాముల విషాన్ని ఇతడి బాడీ సమర్థంగా ఎదుర్కొంటుందన్న విషయాన్ని గుర్తించారు. ఇతడు దానం ఇచ్చిన రక్తంతో సెంటీవ్యాక్స్ అనే టీకా తయారీ సంస్థ.. పాము విషానికి విరుగుడైన యాంటీ వెనమ్ ను తయారు చేసింది. దీన్ని పరీక్షించేందుకు శాస్త్రవేత్తలు ఎలుకలపై పరీక్షలు జరిపారు.
మాంబాలు.. కోబ్రాలు.. కట్ల పాములతో సహా ప్రపంచంలోని దాదాపు సగం పాము జాతులకు విషాలకు సంబంధించినవి ఎలుకలకు ఎక్కించి.. అనంతరం తిమోతీ రక్తంతో తయారు చేసిన యాంటీ బాడీలను ఎలుకలకు ఇచ్చారు. ఈ క్రమంలో పాము విషాన్ని.. తిమోతీ యాంటీ బాడీలు నిర్వీర్యం చేయటాన్ని గుర్తించారు. ఇలా అన్ని రకాల విషాలను నిర్వీర్యం చేసే యాంటీబాడీల మిశ్రమాన్నిశాస్త్రవేత్తలు డెవలప్ చేశారు. అయితే.. దీన్ని మనుసులపై ప్రయోగించటానికి కొన్నేళ్లు పడుతుందని చెబుతున్నారు. ఎలుకలపై జరిపిన ఈ పరీక్షలు తర్వాతి కాలంలో కుక్కలపై పరీక్షిస్తారు.
ఇప్పటివరకు పాము విషానికి విరుగుడు యాంటీ బాడీలను గుర్రాలు.. గొర్రెల నుంచి తయారు చేసేవారు. పాము విషాన్ని వీటిల్లోకి ఎక్కించి.. వాటి బాడీలో తయారయ్యే యాంటీ బాడీలను సేకరించి మందులు తయారు చేసేవారు. ఇప్పటివరకు ఇదే పాము విషానికి విరుగుడుగా భావించేవారు. అయితే.. ఈ తరహా యాంటీ వెనమ్ బాధితులకు కొన్నిసార్లు దుష్ఫలితాలు ఇచ్చే ప్రమాదం ఉంది. తిమోతీ రక్తంతో తయారు చేసిన యాంటీ బాడీలు ఈ సమస్యకు పరిష్కారంగా భావిస్తున్నారు. అయితే.. ఈ పరిశోధనలు తుదిరూపునకు చేరుకోవటానికి కొన్నేళ్లు పడుతుందని చెబుతున్నారు.
