అమెరికా లో ఒరాకిల్ చేతికి టిక్ టాక్.. భారత్ లోకీ వస్తుందా?
ఐదేళ్ల కిందటి వరకు షార్ట్ వీడియో టిక్ టాక్ యాప్ భారత్ లో ఎంతటి పాపులరో అందరికీ తెలిసిందే.
By: Tupaki Desk | 23 Sept 2025 2:34 PM ISTఐదేళ్ల కిందటి వరకు షార్ట్ వీడియో టిక్ టాక్ యాప్ భారత్ లో ఎంతటి పాపులరో అందరికీ తెలిసిందే. కానీ, గాల్వాన్ లో చైనా దురాగతం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అప్పటినుంచి మళ్లీ మన దేశంలోకి టిక్ టాక్ రాలేదు. మధ్యలో అది తిరిగి వస్తున్నట్లు కథనాలు వచ్చినా అవేవీ నిజం కాలేదు. సరిగ్గా భారత్ లో నిషేధం ఎదుర్కొన్న సమయంలోనే అమెరికాలోనూ టిక్ టాక్ పై రగడ జరిగింది. 2020లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్... టిక్ టాక్ మదర్ కంపెనీ బైట్ డ్యాన్స్ చైనా కంపెనీ కావడంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అప్పట్లో అదో పెద్ద రచ్చగా మారింది. పూర్తిగా నిషేధించలేదు కానీ... చైనా సంస్థతో ఉన్న అనుబంధం నేపథ్యంలో డేటా భద్రత రీత్యా చర్యలు తీసుకున్నారు.
అమెరికా కంపెనీ అమ్మాలంటే...
బైట్ డ్యాన్స్ చైనా ప్రభుత్వంతో సంబంధాలు కలిగి ఉన్నందున తమ పౌరుల డేటాపై నిఘా పెడుతుందనే ఆందోళనలు అమెరికా ప్రభుత్వం నుంచి వ్యక్తమయ్యాయి. యాప్ స్టోర్ల నుంచి తొలగింపుతో పాటు టిక్ టాక్ ను అమెరికన్ కంపెనీకి అమ్మాలంటూ చట్టాలు రూపొందించారు. గత అధ్యక్షుడు బైడెన్ సైతం.. టిక్ టాన్ ఎలాగైనా అమెరికన్ సంస్థకు అమ్మాలని లేదంటే నిషేధిస్తామని హెచ్చరించారు. ట్రంప్ వచ్చాక ఈ నిషేధం గడువును పలుసార్లు పొడిగించారు.
ఎట్టకేలకు...
దాదాపు ఐదేళ్ల అనంతరం అమెరికాలో టిక్ టాక్ వివాదం సమసింది. ఆ సంస్థను అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన లాంచనాలు త్వరలో పూర్తి కానున్నాయి. ట్రంప్.. ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగానే ఒప్పందం కుదిరిందని ఓ అధికారి తెలిపారు. అమెరికన్ వినియోగదారుల కోసం అల్గారిథమ్ త్వరంలో టిక్ టాక్ ఒరాకిల్ కు అందజేయనుంది.
డేటా భద్రత ఆందోళనలకు చెక్...
బైట్ డ్యాన్స్ చైనా కంపెనీ కావడంతో.. ఆ దేశం తీరుపై అనుమానాలతో.. ఇప్పటివరకు సమాచార (డేటా) భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి. ఇక ఒరాకిల్ కొనుగోలు చేసిన నేపథ్యంలో ఇకపై అవన్నీ తీరిపోనున్నాయి. కాగా, టిక్ టాక్-ఒరాకిల్ ఒప్పందంలో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ ఒక భాగస్వామిగా ఉంటుంది. డీల్ పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.
-అతిపెద్ద మార్కెట్ అయిన భారత్ లో టిక్ టాక్ రీ ఎంట్రీ అంత తేలికేం కాదు అని తెలుస్తోంది. ఇటీవల అమెరికా టారిఫ్ ల నేపథ్యంలో చైనా-భారత్ దగ్గరయ్యే పరిస్థితులు కనిపించాయి. ఇదే సమయంలో టిక్ టాక్ రీ ఎంట్రీ అంటూ ఊహాగానాలు వచ్చాయి. కానీ, అవేవీ సాధ్యం కాలేదు.
