టిక్‌టాక్ మోజు ప్రాణాల మీదకు తెచ్చింది.. యూకే వ్యక్తికి రూ.1.13 కోట్ల ఆస్పత్రి బిల్లు
థాయ్‌లాండ్‌కు విహారయాత్రకు వెళ్లిన యూకేకు చెందిన లియామ్, లూసీ అనే జంటకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది.
By: Tupaki Desk | 10 May 2025 10:00 PM ISTరీల్స్ పిచ్చి ఎంతటి ప్రమాదాలకు దారితీస్తుందో మరోసారి ఈ ఘటన నిరూపించింది. సరదాగా వీడియోలు తీసుకుందామని వెళ్లిన ఒక యూకే జంటకు థాయ్‌లాండ్‌లో ఊహించని కష్టం ఎదురైంది. జలపాతం దగ్గర వీడియోలు చిత్రీకరిస్తుండగా జరిగిన ప్రమాదం వారిని అప్పుల పాలు చేసింది. ప్రస్తుతం ప్రాణాలతో బయటపడ్డా ఊహించని విధంగా వచ్చిన ఆసుపత్రి బిల్లు వారిని కుంగదీసింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ జంటకు అంత పెద్ద బిల్లు ఎందుకు వచ్చింది? వివరంగా తెలసుకుందాం.
థాయ్‌లాండ్‌కు విహారయాత్రకు వెళ్లిన యూకేకు చెందిన లియామ్, లూసీ అనే జంటకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. టిక్‌టాక్‌లో వీడియోలు చేయాలనే ఉత్సాహంతో వారు ఒక జలపాతం వద్దకు వెళ్లారు. అక్కడ వీడియోలు చిత్రీకరిస్తుండగా లియామ్ ప్రమాదవశాత్తు 30 అడుగుల లోతులో పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని తలకు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే అతని భాగస్వామి లూసీ లియామ్‌ను స్థానిక ఆసుపత్రిలో చేర్పించింది. అయితే అక్కడ వారికి ఊహించని షాక్ తగిలింది. లియామ్‌కు జరిగిన చికిత్సకు గాను దాదాపు లక్ష పౌండ్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.1.13 కోట్లు) బిల్లు వచ్చింది. అంత పెద్ద మొత్తం బిల్లు చూసి ఆ జంట ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అంత డబ్బు చెల్లిస్తేనే వారిని సొంత దేశానికి వెళ్లడానికి అనుమతిస్తామని ఆసుపత్రి సిబ్బంది తేల్చి చెప్పారు.
దీనికి తోడు వారి ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా సరిగ్గా లేదు. దీంతో అంత పెద్ద మొత్తంలో డబ్బును ఎలా చెల్లించాలో వారికి అర్థం కావడం లేదు. వేరే దారి లేక ఆ జంట క్రౌడ్ ఫండింగ్‌కు సిద్ధమైంది. తమ పరిస్థితిని వివరిస్తూ వారు సహాయం కోసం ప్రజలను అభ్యర్థిస్తున్నారు. సరదాగా గడిపేందుకు వెళ్లిన విహారయాత్ర ఇలా విషాదంగా ముగియడంతో ఆ జంట తీవ్ర మనోవేదనకు గురైతోంది.
టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వీడియోలు చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్షణికావేశంలో చేసే పనులు కొన్నిసార్లు తీవ్రమైన పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రమాదకరమైన ప్రదేశాల్లో వీడియోలు చిత్రీకరించేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. ఈ ఘటన టిక్‌టాక్ మోజులో పడితే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో తెలియజేస్తోంది.