Begin typing your search above and press return to search.

శ్రీశైలం బ్యాక్ వాటర్ లో పెద్దపులి.. జాలారులు ఏం చేశారటే?

శ్రీశైలం అడవులు మరోసారి ప్రకృతి శక్తిని, అడవి జీవన వైవిధ్యాన్ని గుర్తు చేశాయి.

By:  Tupaki Desk   |   24 Dec 2025 4:05 PM IST
శ్రీశైలం బ్యాక్ వాటర్ లో పెద్దపులి.. జాలారులు ఏం చేశారటే?
X

శ్రీశైలం అడవులు మరోసారి ప్రకృతి శక్తిని, అడవి జీవన వైవిధ్యాన్ని గుర్తు చేశాయి. మనుషుల చేతుల్లోకి వచ్చేశాయనుకున్న అడవులు, నదులు, సరిహద్దులు.. ఇవన్నీ పెద్దపులి ముందు ఎంత చిన్నవో చెప్పేలా ఓ అరుదైన దృశ్యం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు, శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను గజ ఈతతో దాటి వెళ్లిన పెద్దపులి వీడియో, కేవలం ఒక విజువల్‌గా మాత్రమే కాకుండా, అడవుల మధ్య ఉన్న అనుసంధానం, జీవ వైవిధ్యానికి ఉన్న సహజ మార్గాల ప్రాముఖ్యతను మన ముందుకు తెచ్చింది.

ఆత్మకూరు అటవిలో కనిపించిన పెద్దపులి..

నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో కనిపించిన ఈ పులిని అధికారులు టీ-65గా గుర్తించారు. సంగమేశ్వరం సమీపం నుంచి బయలుదేరిన ఈ పెద్దపులి, కృష్ణానది బ్యాక్ వాటర్‌లో సుమారు 2 కిలోమీటర్ల మేర అలవోకగా ఈదుకుంటూ, తెలంగాణలోని అమ్రాబాద్ అభయారణ్యం దిశగా ప్రయాణం సాగించింది. సాధారణంగా పులులు నీటికి భయపడవు. అవసరమైతే ఈదుతాయి. కానీ ఇంత పొడవైన దూరం, విశాలమైన బ్యాక్ వాటర్‌లో ప్రశాంతంగా ఈదుకుంటూ వెళ్లడం మాత్రం చాలా అరుదైన దృశ్యం. అందుకే ఈ వీడియో చూసినవాళ్లలో ఆశ్చర్యంతో పాటు ఓ చిన్న భయం కూడా కలిగింది.

మొదటి సారి చూసిన జాలారులు..

నదిలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పులి నీటిలో కనిపించడంతో, తమ భద్రతపై భయం సహజమే. కొందరు వెంటనే ఒడ్డుకు చేరగా, మరికొందరు మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు. అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ‘అడవి నిజంగా ఎక్కడ మొదలవుతుంది?’ అనే ప్రశ్నను మళ్లీ మళ్లీ అడిగేలా చేస్తోంది.

ఈ ఘటనపై అటవీ శాఖ వెంటనే స్పందించింది. ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అపావ్ మాట్లాడుతూ.., పులి కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. నది పరివాహక ప్రాంతాల్లో ఉండే మత్స్యకారులు, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పులి పూర్తిగా అడవిలోకి చేరే వరకు ట్రాకింగ్, పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇది భయపెట్టే ప్రకటన కాదు.. ముందస్తు జాగ్రత్తల పిలుపు.

ఈ ఘటన మనకు మరో కీలక విషయాన్ని గుర్తు చేస్తుంది. అడవులు, నదులు, అభయారణ్యాలు మనం గీసుకున్న మ్యాపుల ప్రకారం నడవవు. అడవి జీవులకు సరిహద్దులు ఉండవు. పులిలాంటి పెద్ద మృగాలు తమ ఆహారం, భద్రత, మేటింగ్ కోసం రాష్ట్రాల మధ్య సంచరిస్తూ ఉంటాయి. ఇది ప్రకృతి సహజమే. శ్రీశైలం–అమ్రాబాద్ అడవుల మధ్య ఉన్న ఈ సహజ కారిడార్, పెద్దపులుల జీవనానికి ఎంత కీలకమో ఈ వీడియో మళ్లీ రుజువు చేసింది. అదే సమయంలో ఇది మనుషులకు ఒక హెచ్చరిక కూడా.. అటవీ సమీపంలో జీవనం సాగించే వారు, నదులపై ఆధారపడే మత్స్యకారులు, పశువుల కాపరులు, అందరూ అడవి జీవులతో సహజీవనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. భయం కాకుండా అవగాహన, ఆందోళన కాకుండా జాగ్రత్త.. ఇవే ఇలాంటి సందర్భాల్లో సరైన మార్గం.

శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పులి గజ ఈత వీడియో కేవలం వైరల్ కంటెంట్ కాదు. ఇది ప్రకృతి తన దారి తాను ఎంచుకుంటుందన్న నిజానికి సాక్ష్యం. అడవులు ఇంకా బతికున్నాయన్న సంకేతం. వాటిని కాపాడుకోవడం మన బాధ్యత. ఎందుకంటే అడవులు సురక్షితంగా ఉంటేనే, మన భవిష్యత్తు కూడా సురక్షితంగా ఉంటుంది.