గోదావరి జిల్లాల్లో పెద్ద పులి వర్రీ.. ఫొటోలు వైరల్
కొద్దిరోజులుగా ఉమ్మడి గోదావరి జిల్లాల వాసులను టెన్షన్ పెడుతున్న పెద్దపులి ఆచూకీ తెలిసింది.
By: Tupaki Desk | 9 Oct 2026 1:26 PM ISTకొద్దిరోజులుగా ఉమ్మడి గోదావరి జిల్లాల వాసులను టెన్షన్ పెడుతున్న పెద్దపులి ఆచూకీ తెలిసింది. ఉండ్రాజవరం మండలంలోని పసలపూడి - చిలకపాడు గ్రామాల మధ్యలో పొలాల్లో నిద్రిస్తున్న పులిని అటవీ అధికారులు గుర్తించారు. రెండు రోజుల క్రితం పట్టిసీమ పరిసర ప్రాంతాల్లో తిరిగిన పులి ఉండ్రాజవరం వైపుగా వచ్చినట్లు అటవీ అధికారులు గుర్తించారు. పులి మెడకు గతంలో అమర్చిన రేడియో ట్రాకర్ ద్వారా అందుతున్న సిగ్నల్స్ ఆధారంగా దాని జాడ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. దీంతో ప్రజలను అప్రమత్తం చేస్తూ పులికి ఎలాంటి అపాయం లేకుండా, పులితో ప్రజలకు ఎలాంటి హాని తలెత్తకుండా అటవీ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ పులి సంచారంతో గోదావరి పరిసర ప్రాంతాల రైతులు, రైతు కూలీలు ఆందోళన చెందుతున్నారు.
పొలం పనులు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో పులి సంచారం రైతులను భయపెడుతోంది. గతంలో పశువులపై దాడి చేసిన పులితో ఎక్కడ హాని కలుగుతుందోనని టెన్షన్ కు గురవుతున్నారని చెబుతున్నారు. గత ఫిబ్రవరిలో పులిని బంధించి అటవీ ప్రాంతానికి తరలించారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే రెండు రోజుల క్రితం పులి మళ్లీ కనిపించడంతో స్థానికులు హడలిపోతున్నారు. మహారాష్ట్రలోని తడోబా జాతీయ పార్కు నుంచి తప్పిపోయిన పులి కొయ్యలగూడెం అటవీ ప్రాంతం మీదుగా గోదావరి జిల్లాల్లోకి ప్రవేశించింది. దీనిని ఫిబ్రవరిలో పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించారు.
అటవీ ప్రాంతానికి తరలించిన పులి మళ్లీ ప్రత్యక్షం కావడంతో ప్రజలు టెన్షన్ పడుతున్నారు. మూడు రోజుల క్రితం గోదావరిని దాటి మైదాన ప్రాంతానికి తరలివచ్చిందని చెబుతున్నారు. తాళ్లపూడి మండలం గజ్జరం, తుపాకుల గూడెం, గోపాలపురం గోపవరం గ్రామాల్లో సంచరించింది. రేడియో ట్రాకింగ్ ద్వారా పులి కదలికలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. మైదాన ప్రాంతంలోకి రావడంతో అధికారులు కూడా భయపడుతున్నారు. పులి కదలికలపై రాత్రి పగలూ నిఘా వేశారు. ఈ క్రమంలోనే పట్టిసీమ మీదుగా ఉండ్రాజవరం వైపు పులి వచ్చినట్లు గుర్తించారు.
రేడియో ట్రాకింగ్ ద్వారా పొలాల్లో ఉన్న పులిని గుర్తించిన అటవీ అధికారులు డ్రోన్ కెమెరాతో పులి ఫొటోలను తీశారు. రాత్రంతా వేటాడి అలసిపోయిన పులి వరి పొలంలో హాయిగా నిద్రపోతున్నట్లు కనుగొన్నారు. దీంతో పులిని బంధించిందేకు గౌరీపట్నం రేంజ్ అటవీ అధికారులు రంగంలోకి దిగారు. ఉండ్రాజవరం, తణుకు, నిడదవోలు పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. రెస్యూ టీమ్ ను రప్పించి పులిని బంధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
