Begin typing your search above and press return to search.

స్పెర్మ్ డొనేషన్‌ తో జననం... 36వ ఏట తెలిసిన ఒక చేదు నిజం!

అవును... అట్లాంటాకు చెందిన టిఫనీ గార్డనర్ జీవితంలో ఎన్నో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి

By:  Tupaki Desk   |   24 Jan 2024 2:30 PM GMT
స్పెర్మ్ డొనేషన్‌ తో జననం... 36వ ఏట తెలిసిన ఒక చేదు నిజం!
X

విధి ఆడే వింత నాటకాలు అనుకుంటే... ఆ నాటకల్లోని కొన్ని పాత్రలు, వారి జీవితంలో జరిగే ఊహించని సంఘటనలు, ఫలితంగా ఎదురయ్యే పరిణామాలు చిత్ర విచిత్రంగా ఉంటుంటాయి. ఇవి కొన్ని సార్లు అనుభవించేవారితో పాటు వాటి గురించి తెలుసుకున్న వారిని కూడా కదిలిస్తుంటాయి. అలా కదిలించే సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.. ఆ విధి ఆడిన వింతనాటకంలోని పాత్రపేరు టిఫనీ గార్డనర్!

అవును... అట్లాంటాకు చెందిన టిఫనీ గార్డనర్ జీవితంలో ఎన్నో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. అందులో భాగంగా తన నాలుగేళ్ల వయసులోనే ఆమె తన తండ్రిని కోల్పోయింది. ఈమెకు తన తల్లి... తన తండ్రి క్యాన్సర్ తో చనిపోయారు అని తరచూ చెబుతుండేది. ఈ కాలక్రమంలో టిఫనీకి 36ఏళ్ల వయసు వచ్చింది.. ఈ సమయంలో ఆమె తల్లి తనకు ఒక చేదు నిజాన్ని చెప్పింది.

వివరాళ్లోకి వెళ్తే... జార్జియాలోని అట్లాంటాలో ఉంటున్న టిఫనీ గార్డనర్ కు నాలుగేళ్లు ఉన్నప్పుడు తండ్రి క్యాన్సర్‌ తో మరణించాడని ఆమె తల్లి చెప్పింది. అప్పటి నుంచి సింగిల్ పేరెంట్ కిడ్ గానే టిఫనీ పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆమె తల్లి మరో పెళ్లి చేసుకుంది. ఈ సమయంలో... టిఫనీ తన సవతి తండ్రికి కూడా బాగానే దగ్గరయ్యింది. అయితే అసలు తండ్రిని మిస్సయ్యాననే బాధ మాత్రం నిత్యం ఆమెను వెంటాడుతూనే ఉండేది!

ఈ క్రమంలో టిఫనీ 36వ పుట్టినరోజున ఆమెకు తన తల్లి ఒక చేదు నిజాన్ని చెప్పింది. అదేమిటంటే... తన నాలుగో ఏట చనిపోయిన వ్యక్తి.. ఇంతకాలం ఆమె తండ్రిగా భావిస్తున్న వ్యక్తి.. ఆమెకు జన్మనిచ్చిన తండ్రి కాదని! అవును... తన తల్లి మొదటి భర్త తనకు జన్మనిచ్చిన తండ్రి కాదని తెలిసింది. దీంతో ఆమెకు ఒక్కసారిగా భూమి తలకిందులైనంత పని అయ్యింది.. ఒక్కసారిగా శూన్యంలో ఉన్నట్లుగా భావిందింది!

సుమారు తనను నాలుగేళ్లపాటు అల్లారుముద్దుగా పెంచిన వ్యక్తి తనకు జన్మనిచ్చిన తండ్రి కాదని... ఇంతకాలం ఆమె ఎవరినైతే తండ్రిగా భావిస్తుందో అతను ఆమె జన్మకు కారణం కాదని తెలుసుకుని కుమిలిపోయింది! ఫలితంగా... తాను స్పెర్మ్ డొనేషన్ ద్వారా జన్మించినట్లు తెలుసుకుంది. ఈ విషయం తెలిసి కూడా తనను అల్లారుముద్దుగా పెంచిన తన తల్లి మొదటి భర్తను తలచుకుని కన్నీటిపర్యంతమైంది.

అనంతరం ఆ చేదు నిజాన్ని దిగమింగుకుని... ఇటీవల డీ.ఎన్.ఏ. పరీక్ష చేయించుకుంది. ఈ పరీక్షలో తనకు జన్మనిచ్చిన తండ్రి ఎవరో వెల్లడయ్యింది. పైగా.. అతను సజీవంగానే ఉన్నాడనే విషయం కూడా తెలిసింది. దీంతో... తన పుట్టుకకు కారణం అయిన వ్యక్తిని కలుస్కోవాలని ప్రయత్నించడం మొదలుపెట్టింది. అయితే... ఆమె ఇంటిలోనివారి ఒత్తిడి మేరకు అతనిని కలుసుకోలేకపోయింది.

ఇదే సమయంలో... ఆమెకు జన్మనిచ్చిన తండ్రి కుటుంబ సభ్యులు కూడా టిఫనీని కలుసుకోవద్దని కోరారు. దీంతో తన పుట్టుకకు కారణమైన వ్యక్తిని కలుసుకునే ప్రయత్నాలు విరమించుకుంది. ఈ సమయంలో తనకు ఎదురైన ఇబ్బంది మరొకరికి ఎదురవ్వకూడదని భావించిందో ఏమో కానీ... స్పెర్మ్ డోనర్ గుర్తింపును ఇకపై దాచకూడదంటూ అమెరికా ప్రభుత్వాన్ని ఆమె అభ్యర్థిస్తోంది.

కాగా... 1982లో జన్మించిన టిఫనీ... 2018లో తన 36వ ఏట తాను స్పెర్మ్ డొనేషన్ వల్ల జన్మించినట్లు తెలుసుకుంది. ప్రస్తుతం 41 ఏళ్ల వయసులో ఉన్న ఈమెకు 17 ఏళ్ల క్రితమే వివాహం జరగగా.. ఈమెకు ముగ్గురు కుమారులు!!