Begin typing your search above and press return to search.

ఉత్తరం తిరిగి దండం పెట్టాల్సిందేనా రాజా వారూ...!

దాంతో రాజుకు టికెట్ ఇవ్వవద్దు అని వైసీపీలో నేతలు అంటున్నారుట. ఇటీవల తూర్పులో వైసీపీ ఇంచార్జిని మార్చిన వేళ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ఒక బాంబు పేల్చారు.

By:  Tupaki Desk   |   23 Sep 2023 1:30 AM GMT
ఉత్తరం తిరిగి దండం పెట్టాల్సిందేనా రాజా వారూ...!
X

విశాఖ ఉత్తరం సీటు చాలా కీలకంగా ఉంది. 2009లో అసెంబ్లీ సీట్ల పునర్ విభజనలో ఈ సీటు ఏర్పడింది. గమ్మత్తు ఏంటి అంటే ఇప్పటికి మూడు ఎన్నికలు జరిగితే ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచారు. అలాగే మూడు పార్టీల అభ్యర్ధులు ఎమ్మెల్యేలు అయ్యారు. 2009లో కాంగ్రెస్ నుంచి తైనాల విజయ కుమార్ గెలిస్తే 2014 నాటికి బీజేపీకి చెందిన విష్ణు కుమార్ రాజు గెలిచారు. 2019లో టీడీపీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గెలిచారు.

ఇక్కడ మరో చిత్రం ఏంటి అంటే మూడు సార్లూ మూడు సామాజికవర్గాల వారు గెలవడం. ఉత్తరం విశాఖ నడిబొడ్డున ఉంది. ఇక్కడ అన్ని సామాజికవర్గాలు ఉన్నాయి. రాజులు, కాపులు, వెలమలు, బీసీలు ఇక్కడ ఆధిపత్యం చూపిస్తారు. ఇక 2024 ఎన్నికల్లో విశాఖ ఉత్తరం సీటు ఎవరికి దక్కుతుంది అంటే ప్రధాన పార్టీలలో ఇంకా చర్చల దశ దాటలేదు.

సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 2024 ఎన్నికల్లో పోటీకి ఉత్తరం నుంచి సుముఖంగా లేరు అని టాక్ నడుస్తోంది. మరో వైపు జనసేన ఈ సీటు కోరవచ్చు అంటున్నారు. బీజేపీ పొత్తుకు వస్తే విష్ణు కుమార్ రాజు కి ఇవ్వవలసి ఉంటుంది అంటున్నారు. ఇంకో వైపు చూస్తే వైసీపీ 2019 నుంచే కేకే రాజుని ప్రకటించేసింది. ఆయనకే ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు.

అంతే కాదు ఆయనకు స్టేట్ లెవెల్ కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. గంటా నాలుగేళ్ళుగా నియోజకవర్గంలోకి పోకపోవడం కలసి వచ్చింది. ఆయనే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో దాదాపుగా ఆయనకే టికెట్ అంటున్నారు. అయితే గతంలో ఉనన్ జోరు హుషార్ అయితే ఆయన అభ్యర్ధిత్వం పట్ల క్యాడర్ లో కనిపించడంలేదు అన్నది తాజా కబురుగా ఉంది.

కేకే రాజుకు కార్పోరేటర్లకుఇ పడడంలేదు అని అంటున్నారు. వైసీపీ నుంచి ఇక్కడ గెలిచిన కార్పోరేటర్ల వార్డులలో సైతం ఆయనే పెత్తనం చేస్తూ వార్డులలో అభివృద్ధి పనులలో వేలూ కాలూ పెడుతున్నారని మెజారిటీ కార్పోరేటర్లు మండిపడుతున్నారు. అంతే కాకుండా ఎవరిని కో ఆర్డినేట్ చేసుకోకుండా ఏకపక్షంగా రాజు గారు వెళ్తున్నారు అంటున్నారు.

గతంలో విజయసాయిరెడ్డిని ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డిని ప్రసన్నం చేసుకుంటూ వారితో ఉంటే తనకు టికెట్ ఖాయమని భావిస్తూ ఒంటెద్దు పోకడలతో రాజు గారు ఉంటున్నారు అని అంటున్నారు ఈ విధంగా ఆయన నానాటికీ క్యాడర్ కి దూరం కావడంతో ఈసారి ఉత్తరంలో వినాయక మండపాల వద్ద కేకే రాజు సందడి తగ్గిందని అంటున్నారు. ఆయన్ని క్యాడర్ దూరం పెడుతోంది అనడానికి ఇదే నిదర్శనం అంటున్నారు.

ఇక వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తులో భాగంగా కాపులకే టికెట్ ఇస్తారని అంటున్నారు. దాంతో వైసీపీ కూడా సామాజిక కోణం నుంచి ఆలోచించి కాపులకు అయినా లేక వెలమలకు అయినా టికెట్ ఇచ్చే చాన్స్ ఉంది అంటున్నారు. కేకే రాజు కో ఆర్డినేట్ చేసుకుని వెళ్తే ఆయనకు కూడా చాన్స్ ఉండొచ్చు కానీ పార్టీకి గట్టిగా పనిచేయాల్సిన కార్పోరేటర్లతోనే ఎడం పెరిగింది అని అంటున్నారు.

దాంతో రాజుకు టికెట్ ఇవ్వవద్దు అని వైసీపీలో నేతలు అంటున్నారుట. ఇటీవల తూర్పులో వైసీపీ ఇంచార్జిని మార్చిన వేళ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ఒక బాంబు పేల్చారు. పనితీరు సరిగ్గా లేని చోట ఇంచార్జిలను మారుస్తామని ఎవరూ శాశ్వతం కాదని అన్నారు అది ఉత్తరం తోనే మొదలవుతుంది అని అంటున్నారు వైసీపీ నేతలు.

వచ్చే ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నుంచి కేకే రాజు పోటీ చేస్తారా ఆయనకే టికెట్ దక్కుతుందా అంటే డౌటే అని సొంత పార్టీలో అంటున్నారుట. మరి పేరులో రాజు ఉంది. వైసీపీ టికెట్ సాధించి ఎమ్మెల్యేగా గెలిచి నిజమైన రాజు అనిపించుకోవాలంటే ఆయన చాలా చేయాలి అంటున్నారు.