Begin typing your search above and press return to search.

మూడు కుటుంబాలు-ముగ్గురు మ‌హిళ‌లు: రాజ‌కీయాల్లో స‌త్తా ఎంత‌?

రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది మ‌హిళా నాయ‌కులు ఉన్నారు. మంత్రులుగా ఉన్న‌వారు.. గ‌తంలో మంత్రులుగా చేసిన వారు కూడా ఉన్నారు.

By:  Garuda Media   |   16 Nov 2025 11:55 PM IST
మూడు కుటుంబాలు-ముగ్గురు మ‌హిళ‌లు: రాజ‌కీయాల్లో స‌త్తా ఎంత‌?
X

రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది మ‌హిళా నాయ‌కులు ఉన్నారు. మంత్రులుగా ఉన్న‌వారు.. గ‌తంలో మంత్రులుగా చేసిన వారు కూడా ఉన్నారు. అయితే.. అతి కీల‌క కుటుంబాల నుంచి వ‌చ్చిన వారిలో ముగ్గురు మ‌హిళ‌లు ఇప్పుడు రాజ‌కీయాల్లో త‌మ‌దైన శైలిని చాటుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. వీరిలో అంద‌రికీ తెలిసిన వైఎస్ ష‌ర్మిల‌, క‌ల్వకుంట్ల‌ క‌విత‌తో పాటు ఇప్పుడు రాజ‌కీయ అరంగేట్రం చేస్తాన‌ని ప్ర‌క‌టించిన వంగ‌వీటి ఆశా కిర‌ణ్‌లు.. రాజ‌కీయంగా చ‌ర్చ‌కు నిలిచారు.

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వార‌సురాలిగా అరంగేట్రం చేసిన వైఎస్ ష‌ర్మిల‌.. కాంగ్రెస్ పార్టీకి ఏపీ అధ్య‌క్షురాలిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 2024లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ కూడా చేశారు. కానీ, ప‌రాజ‌యం పాల‌య్యా రు. ఆ త‌ర్వాత పార్టీని న‌డిపించ‌డంలోనూ.. ఆమె త‌డ‌బ‌డుతున్నార‌న్న వాద‌న కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్యే వినిపిస్తోంది. అనేక మంది సీనియ‌ర్ల‌ను మెప్పించ‌డంలోను.. ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డంలోనూ ష‌ర్మిల వెనుక బ‌డ్డార‌నే అంటున్నారు. అయితే.. ఒక్క ఎన్నిక‌తోనే నాయ‌కుల సత్తాను నిర్ణ‌యించ‌లేం కాబ‌ట్టి ఫ్యూచ‌ర్‌లో ఆమె తీరు ఎలా ఉంటుంద‌నేది చూడాలి.

ఇక‌, తెలంగాణ‌కు చెందిన బీఆర్ ఎస్ పార్టీతో తెగ‌తెంపులు చేసుకుని బ‌య‌ట‌కు వ‌చ్చిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ క‌విత ప్ర‌స్తుతానికి సొంత పార్టీ పెట్ట‌క‌పోయినా.. సొంత వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసుకుంటు న్నారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను ఏకం చేసిన తెలంగాణ జాగృతిని ఆమె ముందుకు తీసుకువెళ్తున్నారు. తెలంగాణ స‌మాజంతో ఆమెకు ఉన్న అనుబంధం త‌క్కువ చేసి చూడ‌లేం. కానీ, వ్య‌క్తిగ‌తంగా ఆమె ఏమేరకు రాజ‌కీయాల్లో నెగ్గుకు వ‌స్తార‌న్న‌ది మాత్రం భ‌విష్య‌త్తు తేల్చాల్సి ఉంటుంది.

ఈ రెండు కుటుంబాల‌కు తోడు.. తెలుగు నేల‌పై త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్న వంగ‌వీటి రంగా కుటుంబం నుంచి ఆయ‌న గారాల‌ప‌ట్టి ఆశా కిర‌ణ్ ముందుకు వ‌చ్చారు. ఆమె కూడా రాజ‌కీయాల్లోకి రానున్న‌ట్టుప్ర‌క‌టించారు. అయితే.. ప్ర‌స్తుతం కొన్నాళ్లు ప్ర‌జ‌ల సేవ‌కు ప‌రిమితం అవుతాన‌ని చెబుతు న్నారు. కానీ.. ఏ పార్టీలో చేరుతార‌న్న‌ది తెలియాల్సి ఉంది. అయితే.. రంగా వార‌స‌త్వంగా వ‌చ్చినా.. ఆయ‌న కుమారుడు ఆ హవాను ద‌క్కించుకోలేక పోయారు.

ఇప్ప‌టికి 20 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్న రాధా ఒకే ఒక్క‌సారి 2004 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆ త‌ర్వాత అన్నీ ప‌ల్టీలే క‌నిపిస్తున్నాయి. ఈ ప‌రిణామాల‌ను దాటుకుని ఆశా కిర‌ణ్ ఎలాంటి అడుగులు వేస్తార‌న్న‌దిచూడాలి. ఏదేమైనా రెండు తెలుగు రాష్ట్రాల్లోని మూడు కీల‌క కుటుంబాల నుంచి మ‌హిళ‌లు రాజ‌కీయాల్లోకి రావ‌డం.. బాగానే ఉన్నా.. వీరిని ప్ర‌జ‌లు ఏమేర‌కు ఆద‌రిస్తారు? అనేది చూడాలి.