బీఆర్ఎస్ ఖాళీ.. జనసేనలోకి తోట చంద్రశేఖర్ రీ-ఎంట్రీ?
గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్న మాజీ ఐఏఎస్ అధికారి, బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ త్వరలోనే తన పాత గూటికి చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Political Desk | 15 April 2026 8:00 PM ISTఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్న మాజీ ఐఏఎస్ అధికారి, బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ త్వరలోనే తన పాత గూటికి చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను మంగళగిరిలో తోట చంద్రశేఖర్ తాజాగా కలిశారు. దీంతో ఆయన జనసేనలోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఓ మీడియా చానల్ ను నిర్వహిస్తున్న తోట చంద్రశేఖర్ ఆకస్మికంగా జనసేనాని పవన్ ను కలవడంపై పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ నడుస్తోంది.
మళ్లీ చిగురిస్తున్న బంధం!
కాపు సామాజికవర్గానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్. 2014లో పార్టీ ఆవిర్బావం సమయంలోనే జనసేనలో చేరిన ఆయన 2023 వరకు పార్టీలో కీలకంగా పనిచేశారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై రాజకీయాల్లోకి వచ్చిన తోట చంద్రశేఖర్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. మేధావి వర్గం కింద ఆయనను పరిగణనలోకి తీసుకున్న పవన్ 2019 సాధారణ ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగించారు. ఆ ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ, పార్టీ బలోపేతానికి తోట చంద్రశేఖర్ తన వంతు కృషి చేశారని అంటున్నారు.
జనసేన వైపు ఎందుకు?
2019 ఎన్నికల తర్వాత కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న తోట చంద్రశేఖర్ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు జనసేనకు రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ ను తెలంగాణ విస్తరించాలనే లక్ష్యంతో కేసీఆర్ ఏపీ రాష్ట్ర శాఖను ఏర్పాటు చేసి, అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమించారు. విజయవాడలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేసి కొన్నాళ్లు నడిపిన తోట చంద్రశేఖర్ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో ఆ పార్టీకి దూరంగా జరిగారని అంటున్నారు.
తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏపీలో దాదాపు నిష్క్రియాత్మకంగా మారిపోయిందని అంటున్నారు. ఏపీ అధ్యక్షుడిగా ఉన్న తోట చంద్రశేఖర్ కూడా గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు ఏపీలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా కీలక పాత్ర పోషిస్తుండటంతో.. మారుతున్న సమీకరణాల దృష్ట్యా తోట చంద్రశేఖర్ తిరిగి జనసేనలోకి రావడమే ఉత్తమమని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
