Begin typing your search above and press return to search.

బీయారెస్ లోకి ఫిరాయించిన వారంతా ఓడారుగా..

ఇపుడు తెలంగాణాలో చూస్తే కాంగ్రెస్ టీడీపీ నుంచి బీయారెస్ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఆ పార్టీ మీద తాజాగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోయారు.

By:  Tupaki Desk   |   3 Dec 2023 6:21 PM GMT
బీయారెస్ లోకి ఫిరాయించిన వారంతా ఓడారుగా..
X

అధికారంలో ఉన్న పార్టీ అంటే మమకారం. అందుకే అందులో ఎవరైనా చేరిపోతారు. అయితే లక్షలాది మంది ప్రజలు తమకు ఓటేసి గెలిపించారు. ఆ పార్టీకి కట్టుబడి ఉంటామని అనుకోవడంలేదు. ఎన్నికల తరువాత బోడి మల్లన్న అంటూ ఓటర్లను చులకనగా చూస్తున్నారు. దానికి ఫలితం ఏంటి అంటే మళ్లీ ఎన్నికలు వచ్చినపుడు వారిని చిత్తుగా జనాలు ఓడించేయడమే.

ఏపీలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన అభ్యర్ధుల విషయంలో అదే జరిగింది. ఇపుడు తెలంగాణాలో చూస్తే కాంగ్రెస్ టీడీపీ నుంచి బీయారెస్ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఆ పార్టీ మీద తాజాగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోయారు. ఇంటి బాట పట్టారు.

అలా ఒక్కసారి జాబితాను చూస్తే 2018 ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వనమా వెంకటేశ్వరరావు (కాంగ్రెస్), సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్య (టీడీపీ), పినపాకలో రేగా కాంతారావు (కాంగ్రెస్), ఇల్లెందులో హరిప్రియా నాయక్ (కాంగ్రెస్), నకిరేకల్ లో చిరుమర్తి లింగయ్య (కాంగ్రెస్), భూపాలపల్లెలో గండ్ర వెంకట రమణారెడ్డి (కాంగ్రెస్), అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు (టీడీపీ), పాలేరులో ఉపేందర్ రెడ్డి (కాంగ్రెస్), ఎల్లారెడ్డిలో సురేందర్ (కాంగ్రెస్), కొల్లాపూర్ లో హర్షవర్ధన్ రెడ్డి (కాంగ్రెస్), తాండూరులో పైలెట్ రోహిత్ రెడ్డి (కాంగ్రెస్) ఉన్నారు.

వీరంతా తాము ఉన్న పార్టీని గెలిపించిన ఓటర్లను కూడా పక్కన పెట్టి అధికార బీయారెస్ లో చేరిపోయి అయిదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించారు. అయితే ఎన్నికల వేళ వారికే బీయారెస్ అధినాయకత్వం టికెట్లు ఇచ్చింది. కానీ వారిని జనాలు మాత్రం తిరస్కరించారు. ఫిరాయించినందుకు ఇపుడు తగిన విధంగా చర్యలు ప్రజాస్వామ్యయుతంగా తీసుకున్నారు అని అంటున్నారు.

అయితే వీరిలో ఒక్కరు మాత్రమే గెలిచారు. ఆమె మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఆమె ఆమె మహేశ్వరం నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచి బీయారెస్ లో చేరారు. ఆమె ఈసారి కూడా గెలిచారు. మొత్తానికి ఫిరాయిస్తే లేట్ గా అయినా జనాలు శిక్ష వేస్తారు అన్నది రుజువు అయింది. మరి ఈసారి ఎవరైనా ఫిరాయిస్తారా వీటిని చూసి జాగ్రత్త పడతారా అంటే రాజకీయాల్లో ఎప్పుడూ దేనికదే అన్నదే రాజనీతి మరి.