Begin typing your search above and press return to search.

గాల్వాన్ లోయలో ఘర్షణ వేళ.. చైనా అణు కుట్రపై సంచలన నివేదిక!

అవును... జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి నిరాయుధీకరణ సమావేశంలో అమెరికా అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ థామస్ డినాన్నో ఓ సంచలన విషయం వెల్లడించారు.

By:  Raja Ch   |   8 Feb 2026 10:28 AM IST
గాల్వాన్  లోయలో ఘర్షణ వేళ.. చైనా అణు కుట్రపై సంచలన నివేదిక!
X

గాల్వాన్ లోయలో భారత్ తో ఘోరమైన ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. అది జరిగిన కొన్ని రోజుల తర్వాత జూన్ 22 - 2020న చైనా రహస్య అణు పరీక్షలు నిర్వహించిందని.. ప్రపంచం మొత్తం కోవిడ్-19తో పోరాడుతున్న సమయంలో ఈ పని చేసిందంటూ అమెరికా ఓ సంచలన విషయం వెల్లడించింది. జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి నిరాయుధీకరణ సమావేశంలో అమెరికా అధికారి చెప్పిన ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అవును... జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి నిరాయుధీకరణ సమావేశంలో అమెరికా అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ థామస్ డినాన్నో ఓ సంచలన విషయం వెల్లడించారు. ఇందులో భాగంగా... తూర్పు లడఖ్ లోని గాల్వాన్ లో భారత్ - చైనా మధ్య హింసాత్మక ఘర్షణ జరిగిన వారం తర్వాత చైనా అణు పేలుడు పదార్థాల పరీక్షలను నిర్వహించిందని తెలిపారు. ప్రపంచ ఏజెన్సీల గుర్తింపులు తప్పించుకోవడానికి చైనా అణు పరీక్షలు నిర్వహించినట్లు తమకు సమాచారం ఉందని తెలిపారు.

భారతదేశ సరిహద్దులో ఉన్న జిన్ జియాంగ్ ప్రాంతంలోని లాప్ నూర్ సైట్ లో ఈ అణు పరీక్ష జరిగిందని.. ఈ సమయంలో భూకంప సంకేతాలను గుర్తించడం కష్టతరం చేసే 'డీకప్లింగ్' అనే సాంకేతికతను చైనా ఉపయోగించిందని ఆయన తెలిపారు. కాగా డీకప్లింగ్ అంటే... ప్రాథమికంగా భూకంప తరంగాలను అణిచివేయడానికి ఒక పెద్ద భూగర్భ కుహరంలో పేలుడు పదార్థాన్ని పేల్చే టెక్నిక్.

ఈ సందర్భంగా... చైనా అణు పరీక్షలు నిర్వహించిందని.. వందల టన్నుల పదార్థంతో పరీక్షలకు సిద్ధమవుతుందని అమెరికా ప్రభుత్వానికి తెలుసని.. ప్రపంచ నుంచి తన కార్యకలాపాలను దాచడానికి చైనా ఈ సమయంలో డీకప్లింగ్ ను ఉపయోగించిందని.. జూన్ 22 - 2020న చైనా అలాంటి ఒక అణు పరీక్షను నిర్వహించిందని అమెరికా అధికారి థామస్ డినాన్నో ‘ఎక్స్’ వేదికగా వరుస పోస్టులలో వెల్లడించారు.

అయితే... ఇలా 2020లో రహస్య అణుపరీక్షలు నిర్వహించారన్న డినాన్నో అభియోగాన్ని అణు నిరాయుధీకరణపై చైనా రాయబారి జియాన్ తిరస్కరించకపోవడం గమనార్హం. కాకపోతే.. అణు సమస్యలపై బీజింగ్ ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరించిందని మాత్రం చెప్పారు!

కాగా 2020 జూన్ లో భారత్ - చైనా మధ్య అత్యంత ఘోరమైన ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో సుమారు 20 మంది సైనికులను భారత్ కోల్పోగా.. చైనా, భారత్ కంటే ఎక్కువమంది సైనికులను కోల్పోయిందని ప్రపంచ నివేదికలు చెబుతున్నాయి. అయితే తమ సైనికుల మరణాల సంఖ్యను చైనా ఇప్పటికీ వెళ్లడించలేదు. మరోవైపు ఇంటెలిజెన్స్ నివేదికలు మాత్రం చైనా సుమారు 30 కంటే ఎక్కువమంది సైనికులను కోల్పోయిందని సూచిస్తున్నాయి.