Begin typing your search above and press return to search.

నేటి నుంచి టీడీపీ 'తొలి అడుగు'.. దూరంగా జనసేన?

గత ఏడాది జూన్ 12న నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు.. తన 4.O సర్కారులో రెండో ఏడాదిలోకి అడుగుపెట్టారు.

By:  Tupaki Desk   |   2 July 2025 11:10 AM IST
నేటి నుంచి టీడీపీ తొలి అడుగు.. దూరంగా జనసేన?
X

రాష్ట్రంలో కూటమి పాలన ప్రారంభమై ఏడాది పూర్తయింది. గత ఏడాది జూన్ 12న నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు.. తన 4.O సర్కారులో రెండో ఏడాదిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఏడాది పాటు చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. గత ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో నెల రోజుల పాటు నేతలు అంతా ప్రజల్లోనే ఉండాలని పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ‘తొలి అడుగు’ అనే పేరు పెట్టారు. బుధవారం నుంచి ఈ నెలాఖరు వరకు సుమారు 30 రోజుల పాటు ఎమ్మెల్యేలు అంతా ప్రజల్లోనే ఉండాలని సూచించారు చంద్రబాబు. అంతేకాకుండా తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటనతో ‘తొలి అడుగు’ను ప్రారంభిస్తున్నారు. రెండు రోజులుపాటు కుప్పంలోనే ఉండనున్న సీఎం పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు శ్రీకారం చుట్టనున్నారు.

ప్రతిపక్షం వైసీపీకి 11 సీట్లతో బుద్ధి చెప్పినా ఏడాది తిరక్కముందే కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెగబడుతోందని, దీన్ని సమర్థంగా ఎదుర్కోవాలంటే పార్టీ శ్రేణులన్నీ ప్రజల్లోకి వెళ్లి వాస్తవాల ప్రచారం చేయడం ఒక్కటే మార్గమని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అధినేత నుంచి కార్యకర్త వరకు నెల రోజుల పాటు ప్రజల్లోనే ఉండాలని, ప్రతి తలుపూ తట్టాలని చేసిన మంచిని వివరించాలని ఆదేశాలిచ్చారు. వైసీపీ పాలనలో ఐదేళ్ల పాటు విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని ఒవైపు గాడిలో పెడుతూనే మరోవైపు ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని టీడీపీ భావిస్తోంది.

పింఛన్ల పెంపు, తల్లికి వందనం, దీపం-2 ఇలా ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తూనే ఇవ్వని హామీలు చేస్తున్నామనే అంశాన్ని ప్రజలకు వివరించాలని చంద్రబాబు ఆదేశించారు. ఏడాదిలో 9.50 లక్షల కోట్ల పెట్టుబడులతో లక్షల ఉద్యోగాలు సృష్టించిన విషయాన్ని తెలియజేయాలని సూచించారు. దీంతో అధినేత చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ ఎమ్మెల్యేలు అంతా జనం బాట పట్టారు. రాష్ట్రంలో టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న 135 నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

అయితే ‘తొలి అడుగు’ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తోపాటు జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం ‘తొలి అడుగు’ టీడీపీ కార్యక్రమం కావడమే అంటున్నారు. కూటమి సంయుక్త కార్యక్రమం కాకపోవడం, టీడీపీ పార్టీ శ్రేణులకు మాత్రమే పిలుపునివ్వడంతో మిగిలిన రెండు పార్టీల ఎమ్మెల్యేలు, కార్యకర్తలు హాజరు అయ్యే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. వాస్తవానికి ఏడాదిగా ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమం నిర్వహించినా మూడు పార్టీలు సంయుక్తంగానే పాల్గొనేవి. కానీ, రెండో ఏడాది తొలి నెలలో మాత్రం టీడీపీ సొంత కార్యక్రమం నిర్వహించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.