Begin typing your search above and press return to search.

ఇజ్రాయెల్ బాంబులు వేయటానికి ముందు ఇలా జరుగుతుందట

సంచలనంగా మారిన ఈ కథనాన్ని చూస్తే.. ఇజ్రాయెల్ ఎంతటి ధర్మయుద్ధాన్ని చేస్తుందో చెప్పే ప్రయత్నంతో పాటు.. తాము టార్గెట్ చేసిన లక్ష్యాన్ని ఎంత పక్కాగా చేధిస్తున్న విషయం అర్థమవుతుంది.

By:  Tupaki Desk   |   10 Nov 2023 4:22 AM GMT
ఇజ్రాయెల్ బాంబులు వేయటానికి ముందు ఇలా జరుగుతుందట
X

గాజా లెక్క తేల్చేయాలని పట్టుదలగా ఉన్న ఇజ్రాయెల్ తాను ఎంచుకున్న టార్గెట్ ను పూర్తి చేసే వేళ.. ఎలా వ్యవహరిస్తుంది? ఆస్తుల్ని నష్టం చేయటమే తప్పించి.. అక్కడి ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకూడదన్నట్లుగా వ్యవహరించే ఉదంతాన్ని కళ్లకు కట్టినట్లుగా బీబీసీ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇందులో.. ఒక వ్యక్తి అనుభవాన్ని పబ్లిష్ చేసింది. సంచలనంగా మారిన ఈ కథనాన్ని చూస్తే.. ఇజ్రాయెల్ ఎంతటి ధర్మయుద్ధాన్ని చేస్తుందో చెప్పే ప్రయత్నంతో పాటు.. తాము టార్గెట్ చేసిన లక్ష్యాన్ని ఎంత పక్కాగా చేధిస్తున్న విషయం అర్థమవుతుంది.

గాజా - ఇజ్రాయెల్ మధ్య రచ్చ మొదలైన తర్వాత కూడా సురక్షిత ప్రదేశంగా భావించే గాజా స్ట్రిప్ లోని ‘‘అల్ జహ్రా’’ పట్టణంలో ఒక మధ్యతరగతి ప్రజలు నివసించే ఒక అపార్టు మెంట్ లోని ఒక ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్ లో నివసించే డెంటల్ డాక్టర్ మహమూద్ (అతనికి సొంత డెంటల్ హాస్పిటల్ ఉంది) కు ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో ఒక అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. యుద్ధం మొదలై చాలాకాలమే అయినప్పటికి అప్పటివరకు ఆ ప్రాంతంలో ఎలాంటి బాంబు దాడులు జరగలేదు. ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దూరంగా ఉన్న ఆ ప్రాంతంలోని మూడు టవర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పిన ఒక అపరిచిత కాల్.. తాము ప్రాణ నష్టాన్ని కోరుకోవటం లేదని.. రెండు గంటల గడువులో అక్కడి వారంతా దూరంగా వెళ్లాలని.. దాడులు పూర్తి అయిన తర్వాత మళ్లీ మీ ప్రాంతానికి వెళ్లొచ్చొన్నది సదరు డాక్టర్ కు వచ్చిన ఫోన్ కాల్ సారాంశం.

తాను ఇజ్రాయెలీ నిఘా విభాగం నుంచి మాట్లాడుతున్నట్లుగా తనను తాను పరిచయం చేసుకున్న వ్యక్తి.. దాదాపు గంట పాటు ఫోన్ మాట్లాడుతూ.. సదరు డాక్టర్ ను అందరికి అర్థమయ్యేలా చేసి.. ఆ ప్రాంతాన్నిఖాళీ చేయించారు. తన జీవితంలో తాను అందుకున్న అత్యంత భయంకరమైన కాల్ గా డాక్టర్ మహమూద్ పేర్కొన్నారు. అయితే.. సదరు డాక్టర్ నివసించే టవర్ కు ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ.. దగ్గర్లోని మూడు టవర్లను నేలమట్టం చేయటం లక్ష్యమైన వేళ.. దానికి సమీపంగా ఉండే వారికి ఏం జరగొద్దన్నది ఫోన్ కాల్ సారాంశంగా ఆయన వెల్లడించారు.

దీంతో.. రెండు గంటల వ్యవధిలో తాను నివసిస్తున్న టవర్ లోని వారికి.. విషయాన్ని చెప్పి.. అందరిని దూరంగా తీసుకెళ్లాల్సిన బాధ్యతను అప్పజెప్పారు. అయితే.. ఇందుకు తననే ఎందుకు ఎంపిక చేసుకున్నారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లభించలేదు. మీరుంటున్న టవర్ లోని ప్రజల ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయన్న ఫోన్ కాల్ ఆయన్ను తీవ్రమైన ఆందోళనకు గురి చేయటమే కాదు.. తన వారిని రక్షించుకునేందుకు ఎంతగానో కష్టపడాల్సి వచ్చినట్లుగా ఆయన ఎదుర్కొన్న అనుభవం అర్థమయ్యేలా చేస్తుంది.

తనకు వచ్చిన అపరిచిత కాల్ గురించి చుట్టుపక్కల వారిని అలెర్టు చేస్తూ.. వారంతా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేలా చేయగలిగారు. అదే సమయంలో తనకు వచ్చిందిన ఫేక్ కాల్ కాదన్న విషయాన్ని రుజువు చేసేందుకు.. అవతల ఉన్న వ్యక్తి తమకు కాస్త దూరంగా ఉండే టవర్ మీద ‘వార్నింగ్ షాట్’ పేరుతో బాంబులు వేయటం గమనార్హం. వార్నింగ్ షాట్ గురించి చెబుతూ.. బాంబులు వేసిన అనంతరం.. తాను ఉన్న ప్రాంతానికి దగ్గర్లోని టవర్ల మీద దాడులు చేసే ముందు.. మరోసారి వార్నింగ్ షాట్ వేయాలన్న అభ్యర్థనకు సానుకూల సంకేతం అందినట్లుగా చెబుతున్నారు.

ఫోన్ కాల్ మాట్లాడుతూనే.. బయటకు వెళ్లి.. అందరిని ఖాళీ చేయాలని అభ్యర్థించటమే కాదు.. వారందరికి అర్థమయ్యేలా చెప్పగలిగారు డాక్టర్ మహమూద్. తన మాటలతో ఒక్కసారిగా అక్కడి వారంతా ఆందోళనకు గురి కావటమే కాదు.. ప్రార్థనల మధ్య నుంచి తమను రక్షించుకునేందుకు బయటకు పరుగులు తీసిన వైనాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇంతకూ తామున్న సమీప ప్రాంతం ఎందుకు టార్గెట్ అయ్యింది? అక్కడ కొత్తవారు ఎవరు లేరు? అని ప్రశ్నిస్తే.. ‘అక్కడ మీకు కనిపించని విషయాలు చాలా ఉన్నాయి’ అన్న సమాధానం వచ్చిందని.. అయితే.. ఆ విషయాల గురించి మాత్రం వివరాలు వెల్లడించలేదని సదరు డాక్టర్ చెప్పారు.

అక్కడ బాంబులు వేయాలని పెద్దవాళ్ల నుంచి వచ్చిన ఆదేశాల్ని తాను అమలు చేస్తున్నట్లుగా చెప్పి.. ‘‘వాళ్లు నీ కంటే.. నా కంటే పెద్ద వాళ్లు. బాంబులు వేయాలని మాకు ఆదేశాలు వచ్చాయి’ అని చెప్పినట్లుగా డాక్టర్ మహమూద్ గుర్తు చేసుకున్నారు. అక్కడి వారంతా తమ ప్రాంతాన్ని ఖాళీ చేసిన తర్వాత బాంబులు వేయటం మొదలు పెట్టి.. అక్కడి తమ టార్గెట్ పూర్తి చేసిన తర్వాత.. ఖాళీ చేయించిన భవనంలోని వారిని తిరిగి వారి ఇళ్లకు వెళ్లాలని చెప్పటం గమనార్హం.

అదే సమయంలో తప్పుడు ప్రాంతంలో బాంబులు పడితే? అన్న సందేహానికి సమాధానంగా.. కాసేపటికి ఒక ఇజ్రాయెల్ ఎయిర్ క్రాఫ్ట్ ఆ ప్రాంతమంతా తిరిగి.. తమ టార్గెట్ గా ఉన్న అపార్టుమెంట్ మీద వార్నింగ్ షాట్ వేసి.. అదే తమ లక్ష్యమన్న విషయాన్ని డాక్టర్ మహమూద్ కు వివరించినట్లుగా ఆయన చెప్పారు. మొత్తంగా యుద్దం మొదలైనప్పటి నుంచి ప్రశాంతంగా ఉన్న అల్ జహ్రా పట్టణం ఆ రోజు మాత్రం హాహాకారాలతో నిండినట్లుగా పేర్కొన్నారు. బాంబు దాడులు పూర్తి అయిన తర్వాత తిరిగి మీ ఇళ్లకు వెళ్లొచ్చన్న సందేశం ఒకటి ఫేస్ బుక్ కమ్యూనిటీలో పోస్టు అయినట్లుగా సదరు డాక్టర్ పేర్కొన్నారు. ఇదంతా చదివినప్పుడు గాజా మీద ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్ని సమర్థించుకోవటమే కాదు.. తమను తాము అత్యంత జాగ్రత్తపరులమని.. సామాన్యుల విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపించక మానదు.