Begin typing your search above and press return to search.

టార్గెట్ కొడాలి నాని... గుడివాడ టీడీపీలో ఆసక్తికర పరిణామం!

ఈ విషయంలో ఆ ఫైర్ అసెంబ్లీ లోపల, బయటా అనే తారతమ్యాలకు చోటివ్వదు! దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే కొడాలి నానిని గుడివాడలో ఓడించాలని టీడీపీ బలంగా ఫిక్సయ్యింది.

By:  Tupaki Desk   |   12 Dec 2023 4:07 AM GMT
టార్గెట్  కొడాలి నాని... గుడివాడ టీడీపీలో ఆసక్తికర పరిణామం!
X

ఏపీలోని కీలక నియోజకవర్గాల్లో టాప్ 10లో గుడివాడ ఉంటుందన్నా అతిశయోక్తి కాదేమో. ఈ నియోజకవర్గంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న కొడాలి నాని... మైకందుకుంటే టీడీపీ అధినేతపై నిప్పులు కక్కుతుంటారు. ఈ విషయంలో ఆ ఫైర్ అసెంబ్లీ లోపల, బయటా అనే తారతమ్యాలకు చోటివ్వదు! దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే కొడాలి నానిని గుడివాడలో ఓడించాలని టీడీపీ బలంగా ఫిక్సయ్యింది. ఈ సమయంలో గుడివాడ టీడీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

అవును... గుడివాడ టీడీపీలో నేతలు గతకొంతకాలంగా విడిపోయారని.. అందులో ఒకటి రావి వెంకటేశ్వర రావు వర్గం కాగా మరొకటి ఎన్నారై వెనిగండ్ల రాము వర్గమని అంటారు. వీరిలో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ తమ కంటే తమకంటూ గతకొంతకాలంగా చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో వెనిగండ్ల రాము అభ్యర్ధిత్వాన్ని ఆల్ మోస్ట్ కన్ ఫాం చేసేశారని తెలుస్తున్న నేపథ్యంలో... రావి వెంకటేశ్వర రావుని బుజ్జగించారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర!

ఈ క్రమంలో తాజాగా గుడ్లవల్లేరులో జరిగిన టీడీపీ ముఖ్య నేతల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర... రావి వెంకటేశ్వరరావుకు పార్టీ న్యాయం చేస్తుందని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యర్థిని బలంగా ఢీకొట్టగలిగే నేత కావాలని స్పష్టం చేశారు. దీంతో ప్రతిసారి రావిని పార్టీ ఇలానే మోసం చేస్తోందంటూ కార్యకర్తలు నిలదీశారు.

దీంతో పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రావికి ఎమ్మెల్సీ ఇస్తామనే హామీని చంద్రబాబు ఇచ్చారని కొల్లు తెలిపారు. దీనికి బాధ్యత తాను తీసుకుంటానని.. అవసరమైతే స్టాంప్ పేపరుపై రాసిస్తానని తెలిపారు. దీంతో రావి వర్గీయులు కాస్త కూల్ అయ్యారని తెలుస్తుంది! ఈ సందర్భంగా మైకందుకున్న వెనిగండ్ల రాము.. కొడాలి నానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో టీడీపీ జెండా ఎగరవేయడమే లక్ష్యమని తెలిపారు.

ఈ సందర్భంగా రావి వెంకటేశ్వర రావు త్యాగానికి రుణపడి ఉంటానని తెలిపిన రాము... గుడివాడలో కొడాలి నాని ఎత్తుగడలను తిప్పికొడదామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రావి వెంకటేశ్వర రావు, వెనిగండ్ల రాములు చేతులు కలిపారు! గుడివాడలో టీడీపీ జెండా ఎగరేయడమే తమ లక్ష్యం అని చెప్పుకొచ్చారు.

మొన్నటివరకు గుడివాడ నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా రావి వెంకటేశ్వరరావు ఉండగా... ఆయన స్థానంలో వెనిగండ్ల రాముకు అవకాశం దక్కిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇద్దరూ కలిసి పనిచేసే విషయంపై టీడీపీ శ్రేణుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో... పార్టీ గెలుపుకోసం పనిచేస్తామఅంటూ రావి వెంకటేశ్వర రావు.. రాముతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా... తనను ఓడించడానికి అమెరికా నుంచి కాదు, అంతరిక్షం నుంచి వచ్చినా అది జరిగే పని కాదని.. గెస్ట్ అప్పీరియన్స్ కి గుడివాడ ప్రజల నుంచి ఆదరణ దక్కదని.. గుడివాడలో తానే మరోసారి గెలిచి చూపిస్తానని.. తాను బ్రతికున్నంతకాలం గుడివాడ నియోజకవర్గం తనదే అని కొడాలి ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే!