Begin typing your search above and press return to search.

పెట్టుబడులు పెట్టిన కంపెనీల షేర్లు భారీ లాభాల్లో.. కానీ ఎల్ఐసీ షేర్ మాత్రం?

క్యాలెండర్ లో నెలలు మారటమే కానీ.. ఎల్ఐసీ షేరు ధర మాత్రం నేల చూపులు తప్పించి.. పైకి చూసిందే లేదు.

By:  Tupaki Desk   |   1 Jan 2024 4:20 AM GMT
పెట్టుబడులు పెట్టిన కంపెనీల షేర్లు భారీ లాభాల్లో.. కానీ ఎల్ఐసీ షేర్ మాత్రం?
X

ప్రఖ్యాత ప్రభుత్వ రంగ బీమా కంపెనీ ఎల్ఐసీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. భారీగా నగదు నిల్వలు ఉండే ఎల్ఐసీ.. పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టటం తెలిసిందే. తొలిసారి ఐపీవోకు వచ్చిన ఎల్ ఐసీ మీద ఉన్న అంచనాలు అన్ని ఇన్ని కావు. అయితే.. అందుకు భిన్నంగా పరిస్థితులు చోటు చేసుకోవటం.. షేర్లు అలాట్ అయితే సుడి తిరిగినట్లే అనుకున్న వారంతా.. అలాట్ అయిన తర్వాత మాత్రం తల పట్టుకునే పరిస్థితి. క్యాలెండర్ లో నెలలు మారటమే కానీ.. ఎల్ఐసీ షేరు ధర మాత్రం నేల చూపులు తప్పించి.. పైకి చూసిందే లేదు. ఇప్పటికి అలాట్ మెంట్ అయిన ధర కంటే తక్కువగా ఉండటం కనిపిస్తుంది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఎల్ ఐసీ షేరు ధర తక్కువగా ఉన్నా.. ఈ సంస్థ పెట్టుబడులు పెట్టే కంపెనీల షేర్లు మాత్రం ఝూమ్మంటూ దూసుకెళ్లటం కనిపిస్తుంది. స్టాక్ మార్కెట్ ను దుమ్ము రేపే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఎల్ ఐసీని దేశంలోనే అతి పెద్ద బుల్ గా అభివర్ణిస్తారు. ఈ ఏడాదిలో స్టాక్ మార్కెట్ లో ఎల్ఐసీ పెట్టిన పెట్టుబడులకు వచ్చిన లాభం ఎంతో తెలుసా? అక్షరాల రూ.2.28లక్షల కోట్లు.

భారత స్టాక్ మార్కెట్లకు చెందిన 260 లిస్టెడ్ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టగా.. వాటి విలువ గత ఏడాది డిసెంబరుతో పోలిస్తే.. ఈ ఏడాది భారీగా పెరిగింది. గత డిసెంబరులో రూ.9.61 లక్షల కోట్లు ఉండగా.. తాజాగా వాటి విలువ రూ.11.89 లక్ష్ల కోట్లకు చేరుకోవటం గమనార్హం. సెప్టెంబరు నాటికి ఎల్ ఐసీ వద్ద ఉన్న షేర్లను.. వాటి ప్రస్తుత ధరలతో పోల్చి చూస్తే.. వావ్ అనుకోకుండా ఉండలేం.

ఈ ఏడాది కాలంలో ఎల్ టీపీసీ షేరు ఏకంగా 85 శాతం లాభపడింది. ఈ కంపెనీలు ఎల్ఐసీ వాటా మార్కెట్ విలువ రూ.2400 కోట్లకు పెరిగింది. ప్రభుత్వ రంగ కంపెనీల్లో బాగా లాభాలు పంచిన కంపెనీల్లో ఎన్ టీపీసీ ఒకటి. మరో ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా షేరు 67శాతం రాణించింది. అందులో ఎల్ ఐసీ వాటా విలువ 60 శాతం పెరిగి రూ.24,100 కోట్లకు పైనే చేరుకుంది. ఎల్ అండ్ టీ షేరు 68 శాతం లాభాలు అందించటంతో ఎల్ ఐసీ హోల్డింగ్ 46 శాతం పెరిగి రూ.52,800 కోట్లు నమోదైంది. టాటా మోటార్స్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 100 శాతం మేర పెరిగింది. ఎల్ ఐసీ వాటా విలు ఏకంగా రూ.14వేల కోట్లకు పైనే పెరిగింది ఈ షేరు మీద.

ఎల్ఐసీ వాటాలున్న కనీసం 21 కంపెనీలు ఈ ఏడాది 300 శాతం మేర లాభాలు అందించటం విశేషంగా చెప్పాలి. బీఎస్ఈ షేర్లు మూడింతలకు పెరగటంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 300 శాతం లాభాలు అందించాయి. సుజ్లాన్ ఎనరజీ 250 శాతం రాణించటం.. రైల్ వికాస్ నిగమ్ షేర్లు 160 శాతం.. ఇలా పలు కంపెనీల షేర్లు లాభాల బాట పట్టటంతో ఎల్ఐసీ స్టాకుల విలువ భారీగా పెరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సదరు ఎల్ఐసీ షేరు ధర మాత్రం ఇప్పటికి నీరసం కలిగించేలా ఉండటం అసలుసిసలైన ట్విస్టుగా చెప్పక తప్పదు.