Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురు ప్రముఖులు పోటీ చేసే రెండేసి స్థానాలు ఇవే

ఈ నెల 30 జరిగే పోలింగ్ తో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కీలక కార్యక్రమం ముగుస్తుంది.

By:  Tupaki Desk   |   10 Nov 2023 4:17 AM GMT
ఆ ముగ్గురు ప్రముఖులు పోటీ చేసే రెండేసి స్థానాలు ఇవే
X

తెలంగాణ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో కీలక ఘట్టం ఈ రోజు (శుక్రవారం)తో పూర్తి కానుంది. ఈ రోజు మధ్యాహ్నంతో నామినేషన్లు స్వీకరించే కార్యక్రమం ముగియనుంది. ప్రముఖులు పలువురు ఇప్పటికే తమ నామినేషన్లను దాఖలు చేశారు. దీంతో.. పోటీకి సంబంధించిన క్లారిటీ వచ్చేసిందనే చెప్పాలి. ఈ నెల 30 జరిగే పోలింగ్ తో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కీలక కార్యక్రమం ముగుస్తుంది. అనంతరం జరిగే ఓట్ల లెక్కింపుతో కొత్త ప్రభుత్వం ఎవరిదన్న దానిపై క్లారిటీతో పాటు.. ఎవరి చేతికి అధికారం దక్కనుందన్న విషయంపై క్లారిటీ రానుంది.

నామినేషన్ల విషయానికి వస్తే.. తాజా ఎన్నికల్లో ముగ్గురు కీలక నాయకులు (ఒకవిధంగా చెప్పాలంటే ఈ ముగ్గురు ముఖ్యమంత్రి రేసులో ఉన్న వారే) కేసీఆర్.. రేవంత్ రెడ్డి.. ఈటల రాజేందర్ ముగ్గురు కూడా రెండేసి స్థానాల్లో పోటీ చేయటం గమనార్హం.

బీఆర్ఎస్ అధ్యక్షుడు కమ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘‘గజ్వేల్ .. కామారెడ్డి’’ నుంచి పోటీ చేస్తుండగా.. టీపీసీసీ చీఫ్ గా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి ‘‘కొడంగల్.. కామారెడ్డి’’ స్థానాల్లో పోటీ చేయనున్నారు. ఇక.. బీజేపీ ఎమ్మెల్యే కం కమలం పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ఈటల రాజేందర్ ‘‘హుజూరాబాద్.. గజ్వేల్’’ నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో ఈ తరహా కాంబినేషన్ లో ఎన్నికలు జరిగింది లేదు. తాజా నామినేషన్లను చూస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు స్థానాల్లోనూ గట్టి పోటీ ఏర్పడటమే కాదు.. తుది ఫలితం మీద ఆసక్తి వ్యక్తమయ్యేలా ఉండటం గమనార్హం.

తాజా ఎన్నికల్లో ఏడుగురు ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల్లో తమ లక్ ను చెక్ చేసుకోనున్నారు. ప్రస్తుతం ఎంపీలుగా వ్యవహరిస్తున్న వారు తాజా అసెంబ్లీ బరిలో నిలిచారు. ఈ ఏడుగురు మూడు ప్రధాన పార్టీలకు చెందిన వారు ఉండటం విశేషం. అధికార బీఆర్ఎస్ నుంచి ఒకరు..కాంగ్రెస్ నుంచి ముగ్గురు.. బీజేపీ నుంచి ముగ్గురు ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవటం కనిపిస్తుంది.

నియోజకవర్గం బీఆర్ఎస్ ఎంపీ కాంగ్రెస్ ఎంపీ బీజేపీ ఎంపీ

మెదక్ కొత్త ప్రభాకర్ -- --

మల్కాజిగిరి -- రేవంత్ రెడ్డి --

నల్గొండ -- ఉత్తమ్ కుమార్ రెడ్డి --

భువనగిరి -- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి --

కరీంనగర్ -- -- బండి సంజయ్

నిజామాబాద్ -- -- ధర్మపురి అర్వింద్

అదిలాబాద్ -- -- సోయం బాపురావు

- మెదక్ ఎంపీగా వ్యవహరిస్తున్న కొత్త ప్రభాకర్ దుబ్బాక అసెంబ్లీ బరిలో నిలిచారు.

- మేడ్చల్ ఎంపీగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి.. కొడంగల్, కామారెడ్డి నుంచి బరిలో ఉన్నారు.

- నల్గొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. హుజూర్ నగర్ అసెంబ్లీ బరిలో ఉన్నారు

- భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

- కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్నారు.

- నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అర్వింద్.. కోరుట్ల నుంచి అసెంబ్లీ రేసులో ఉన్నారు.

- ఆదిలాబాద్ ఎంపీగా వ్యవహరిస్తున్న సోయం బాపురావు బోధ్ నుంచి బరిలో దిగారు.

ఈ ఎన్నికల్లో ఐదుగురు ఎమ్మెల్సీలు పోటీ చేస్తున్నారు. అధికార బీఆర్ఎస్ నుంచి ముగ్గురు ఉండగా.. కాంగ్రెస్ నుంచి ఒకరు.. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కసిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అసెంబ్లీ బరిలోకి దిగిన ఎమ్మెల్సీల్ని చూస్తే..

- కడియం శ్రీహరి బీఆర్ఎస్ అభ్యర్థిగా స్టేషన్ ఘన్ పూర్ నుంచి పోటీ చేస్తుంటే.. అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ నుంచి పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్సీ పాడి కౌషిక్ రెడ్డి హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి పోటీ చేస్తున్నారు. ఇక.. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నుంచి రేసులో నిలిచారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదుగురు డాక్టర్లు పోటీలో ఉన్నారు. జగిత్యాల బరిలో నుంచి ఎం సంజయ్.. కోరుట్ల నుంచి కె. సంజయ్.. వికారాబాద్ నుంచి మెతుకు ఆనంద్.. నారాయణపేట నుంచి పర్ణిక.. పరకాల నుంచి కాళీప్రసాద్ లు పోటీలో ఉన్నారు. ఇక.. డెంటల్ డాక్టర్ అయిన శ్రావణి జగిత్యాల అసెంబ్లీ నుంచి బరిలోకి దిగనున్నారు.

- ఈ ఎన్నికల్లో మరో స్థానం అందరిని ఆకర్షిస్తోంది. బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూరు బరిలో నిలిచారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి.. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మిర్యాల గూడ గురించి పోటీ చేస్తున్నారు. మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ చాంద్రాయణ గుట్ట నుంచి బరిలో నిలిచారు. ఇదే స్థానానికి ఆయన కుమారుడు కూడా నామినేషన్ దాఖలు చేశారు.