Begin typing your search above and press return to search.

ఏపీ నుంచి కేంద్ర మంత్రుల జాబితా ఇదేనా ?

ఇక బీజేపీ నుంచి ఆరుగురు ఈసారి పొత్తులో భాగంగా పోటీ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   19 May 2024 2:30 AM GMT
ఏపీ నుంచి కేంద్ర మంత్రుల జాబితా ఇదేనా ?
X

ఏపీ నుంచి కేంద్ర మంత్రులు అయ్యేది ఎవరు అన్న చర్చ సాగుతోంది. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి మూడవసారి అధికారంలోకి వస్తుందని అంతా భావిస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ జనసేనలు కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో తాము భాగస్వామ్యం అవుతామని చెబుతున్నాయి. ఇక బీజేపీ నుంచి ఆరుగురు ఈసారి పొత్తులో భాగంగా పోటీ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ముందుగా సొంత పార్టీ బీజేపీ నుంచి కేంద్ర క్యాబినెట్ లోకి వెళ్ళేవారు ఎవరూ అన్నది చూస్తే మొదటి పేరు దగ్గుబాటి పురంధేశ్వరి అని వినిపిస్తోంది. ఆమె రాజమండ్రి నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నారు. గోదావరి జిల్లాల నుంచి ఆమె ప్రాతినిధ్యం ఉండడం ఒక బలమైన సామాజిక వర్గంతో పాటు మహిళా కోటా బీజేపీ ఏపీ ప్రెసిడెంట్. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో ఆమెకు తప్పకుండా తొలి విడతలోనే చాన్స్ అని అంటున్నారు.

ఇక బీజేపీలో రెండవ పేరు చూస్తే రాయలసీమ జిల్లాల నుంచి మాజీ సీఎం ఎన్ కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకుంటారు అని అంటున్నారు. ఆయనకు ఉన్న రాజకీయ అనుభవం సీఎంగా చేసిన వారు కావడం, సీమలో బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడం ఇత్యాది కారణాలతో ఆయనకు తొలి విడతలో తప్పకుండా చాన్స్ ఇస్తారని అంటున్నారు.

ఇక టీడీపీ నుంచి చూస్తే ఎవరికి చాన్స్ అంటే బీసీ కేటగిరి నుంచి ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు పరు వినిపిస్తోంది. ఇలా కోస్తా ఉత్తరాంధ్ర రాయలసీమలు మూడూ కూడా భర్తీ అయ్యేలా కేంద్ర మంత్రివర్గంలో కూర్పు ఉండొచ్చు అంటున్నారు. ఇక ఏపీకి ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు అంటే పాతిక ఎంపీలు ఉన్నారు కాబట్టి మూడు నుంచి నాలుగు ఉండొచ్చు అన్నది కూడా ఉంది.

అలా నాలువగ కేంద్ర మంత్రి ఎవరు అంటే జనసేన నుంచి ఇద్దరు ఎంపీలు పోటీ చేస్తున్నారు. వారిలో ఒకరికి ఇస్తారా అన్నది చర్చగా ఉంది. మచిలీపట్నం నుంచి బాలశౌరి గెలిస్తే మూడుసార్లు ఎంపీ అయినట్లు. ఆయన బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. కాబట్టి ఆయనకు కూడా చాన్స్ ఉండొచ్చు అని అంటున్నారు.

అయితే ఈ లెక్కలతో సంబంధం లేకుండా కేంద్ర మంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో అనకాపల్లి నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన సీఎం రమేష్, అలాగే అరకు నుంచి గెలిస్తే కనుక ఎస్టీ కోటాలో కొత్తపల్లి గీత కూడా ఉన్నారని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రిని చేస్తారు అన్న టాక్ కూడా నడుస్తోంది. మొత్తానికి చాలా మంది కేంద్ర మంత్రులుగా ఈసారి ఏపీ నుంచి క్యూ కడుతున్నారు. మరి వీరంతా గెలవాలి. బీజేపీ అధికారంలోకి రావాలి. వారి దయ ప్రాప్తం ఉండాలి అపుడు కదా అని అంటున్న వారూ ఉన్నారు.