Begin typing your search above and press return to search.

50 రోజుల రాకెట్ల మోతకు 4 రోజుల విరామం... కండిషన్స్ ఇవే!

కాల్పుల విరమణ ఎప్పుడు మొదలవుతుందన్న దానిపై వచ్చే 24 గంటల్లో ప్రకటన వెలువడనుంది!

By:  Tupaki Desk   |   23 Nov 2023 4:15 AM GMT
50 రోజుల రాకెట్ల మోతకు 4 రోజుల విరామం... కండిషన్స్  ఇవే!
X

గతకొన్ని రోజులుగా వస్తున్న ఊహాగాణాలకు తెరపడింది. ఇందులో భాగంగా... హమాస్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధానికి ఒకింత తెరపి ఏర్పడింది. గాజాపై దాడులు నిలిపివేసి నాలుగు రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ పాటించేందుకు ఇజ్రాయేల్ సరేనంది. ఈజిప్టు, అమెరికా, ఖతార్‌ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. కాల్పుల విరమణ ఎప్పుడు మొదలవుతుందన్న దానిపై వచ్చే 24 గంటల్లో ప్రకటన వెలువడనుంది!

అవును... సుమారు 50 రోజులుగా ఇజ్రాయేల్ – హమాస్ మధ్య భీకర పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 7న మొదటిరోజు మాత్రమే హమాస్ తన ఆధిపత్యాన్ని చూపించి ఉండొచ్చు తప్ప... ఆ తర్వాత నుంచి ఇజ్రాయేల్ సైన్యం హమాస్ ను వేటాడంతోపాటు.. గాజాను గజగజలాడించేస్తుంది. దీంతో ఆస్పత్రుల్లో తలదాచుకోవడం, సొరంగాల్లో దాక్కోడం హమాస్ ఉగ్రవాదుల వంతైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

తమ పౌరులపై ఊచకోతకోసి సుమారు 1200 మంది పౌరుల దారుణ మరణాలకు కారణమైన హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా గాజాను గజగజ లాడించేస్తుంది ఇజ్రాయేల్ సైన్యం. దీంతో ఇజ్రాయెల్‌ దాడుల్లో ఏకంగా 14 వేల మందికి పైగా పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికా రంగంలోకి దిగింది. తాత్కాలిక కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌ ను ఒప్పించేందుకు తెర వెనుక ప్రయత్నాలు ప్రారంభించింది.

ఈ నేపథ్యంలో తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయేల్ తో పాటు విదేశాలకు చెందిన 50 మంది పౌరులను విడిచిపెట్టడానికి హమాస్‌ అంగీకరించింది. దీనికి ప్రతిగా తమ జైళ్లలో ఉన్న 150 మంది పాలస్తీనా ఖైదీలను విడుదలచేయడానికి ఇటువైపు ఇజ్రాయెల్‌ అంగీకారానికి వచ్చింది. ఇదే సమయంలో గాజాపై దాడులు నిలిపివేసి నాలుగు రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ పాటించేందుకు అంగీకరించింది.

ఈ విషయంపై స్పందించిన ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు... "కష్టమైనదే.. కానీ ఇది సరైన నిర్ణయమే" అని పేర్కొన్నారు. మరోపక్క హమాస్‌ కు సంఘీభావంగా ఇజ్రాయెల్‌ ఉత్తర సరిహద్దు ప్రాంతాలపై దాడులు చేస్తున్న లెబనాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ హెజ్‌ బొల్లా దీనిపై స్పందించింది. ఈ ఒప్పందాన్ని తాము కూడా గౌరవిస్తామని తెలిపింది.

ఇదే సమయంలో... ఈ 50 మందితోపాటు మరింత మందిని హమాస్‌ విడుదల చేస్తే స్వాగతిస్తామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. అలా విడుదలైన ప్రతి 10 మంది అదనపు బందీలకుగానూ ఒక్కో రోజు చొప్పున కాల్పుల విరమణ పొడిగిస్తామని పేర్కొంది. అంతేకాకుండా... ఈ విరమణ సమయంలోనే గాజాలోకి మరింత ఇంధనం, మానవతా సాయాన్ని ఇజ్రాయెల్‌ అనుమతించనుంది.

వాట్ నెక్స్ట్?:

బందీలు - ఖైదీలు విడుదల కండిషన్స్ మధ్య కాల్పులకు తాత్కాలికంగా విరామమిచ్చినప్పటికీ.. సరికొత్త వ్యూహాలు రచించుకునేందుకు ఇరు వర్గాలు ఈ సమయాన్ని వినియోగించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నాలుగు రోజులూ యుద్ధానికి గ్యాప్ ఇచ్చినప్పటికీ... ఉత్తర గాజా నుంచి ఇజ్రాయెల్‌ దళాలు వెనక్కి వచ్చే అవకాశం లేదని అంటున్నారు. మరోపక్క కాల్పుల విరమణ పూర్తయిన అనంతరం తమ పోరు కొనసాగుతుందని ఇజ్రాయెల్‌ ప్రధాని స్పష్టంచేయడం గమనార్హం.

కాగా... అక్టోబర్ 7న హమాస్‌ మిలిటెంట్లు.. ఇజ్రాయెల్‌ సరిహద్దు ప్రాంతాలపై దాడి చేసి మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సుమారు 1200 మందిని హత్య చేసి, 240 మందిని బందించి తీసుకువెళ్లారు. దీనికి ప్రతీకారంగా నాటినుంచి ఇజ్రాయెల్‌ గాజాపై భీకరస్థాయిలో విరుచుకుపడుతుంది. గాజాను వణికించింది. దీంతో.. సుమారు 14 వేల మందికి పైగా పాలస్తీనీయులను ప్రాణాలు కోల్పోయారు.