Begin typing your search above and press return to search.

జగన్ ని ఆర్ ఆర్ ఇబ్బంది పెడుతుందా...!?

ట్రిపుల్ ఆర్ అంటే తెలుసు. ఈ డబుల్ ఆర్ ఏంటి అంటే అందరికీ ఆసక్తికరమే. రాజకీయాల్లో ఏఏ అంశాలు ప్రజలను ప్రభావితం చేస్తాయి అన్నది కూడా చూడాల్సి ఉంది.

By:  Tupaki Desk   |   10 March 2024 3:30 PM GMT
జగన్ ని ఆర్ ఆర్ ఇబ్బంది పెడుతుందా...!?
X

ట్రిపుల్ ఆర్ అంటే తెలుసు. ఈ డబుల్ ఆర్ ఏంటి అంటే అందరికీ ఆసక్తికరమే. రాజకీయాల్లో ఏఏ అంశాలు ప్రజలను ప్రభావితం చేస్తాయి అన్నది కూడా చూడాల్సి ఉంది. ఆ విధంగా ఆలోచించుకుంటే కనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని 2024 ఎన్నికల్లో డబుల్ ఆర్ ఇబ్బంది పెడుతుందని అంటున్నారు. ఇంతకీ ఈ డబుల్ ఆర్ ఏంటి అన్నదే ఇపుడు ఆసక్తికరమైన చర్చగా ఉంది.

ముఖ్యమంత్రి జగన్ 151 సీట్లతో బ్రహ్మాండమైన మెజారిటీతో 2019 ఎన్నికల్లో గెలిచారు. ఆయన గడచిన అయిదేళ్ల పాలనలో కేవలం సంక్షేమం మీదనే ఎక్కువగా దృష్టి నిలిపారు. మనది సంక్షేమ రాజ్యం. అది నిజమే కానీ ఫ్యూచర్ జనరేషన్స్ కోసం అభివృద్ధిని కూడా చేయాల్సి ఉంది. ఏపీ విభజన తరువాత ఎంతో నష్టపోయింది.

దాంతో ఏపీ పునర్ నిర్మాణం చాలా అవసరం జనాలు దాని మీదనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు టైం లో గ్రాఫిక్స్ కే అది పరిమితం అయితే జగం టైం లో కూడా అభివృద్ధి పట్టాలు ఎక్కలేదు. కేవలం సంక్షేమం మీదనే జగన్ ఫోకస్ పెట్టారు. అలా గడచిన అయిదేళ్ళ కాలంలో జగన్ రెండున్నర లక్షల కోట్ల రూపాయల నగదుని నేరుగా లబ్దిదారుల ఖాతాలో వేసారు.

అనేక పధకాలను ఆయన అమలు చేశారు ప్రజలకు సంక్షేమం ద్వారా మేలు జరుగుతుందని భావించి ఎక్కువ ఈ వైపుగానే శ్రద్ధ పెట్టారు. పధకాల వల్ల ఆర్ధిక అభివ్ర్ద్ధి జరిగి మార్కెట్ ఎకానమీ పెరిగింది అని వైసీపీ నేతలు చెబుతున్నారు అది కొంతవరకూ కరెక్ట్ అనుకున్నా అభివృద్ధి కూడా ఎంతో కొంత చూపించాలి కదా అన్నది కూడా ఇపుడు.

తీరా చూస్తే ఇపుడు ఎన్నికలకు గడువు దగ్గర పడిపోయింది. జగన్ కానీ వైసీపీ నేతలు కానీ కేవలం సంక్షేమాన్ని నమ్ముకునే ఎన్నికలకు వెళ్తున్నారు. దాంతో సంక్షేమం ఓకే కానీ అభివృద్ధి సంగతేంటి అన్న ప్రశ్నలు అయితే కచ్చితంగా వస్తాయి. మరి దీనికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యంగా డబుల్ ఆర్ అంటే రాజధాని రోడ్లు వీటికి జగన్ ప్రభుత్వం కచ్చితంగా జవాబు చెప్పుకోవాలని అంటున్నారు. ఇదే ఎన్నికల వేళ జగన్ ని ఇబ్బంది పెడుతుందని అంటున్నారు. పదేళ్ళు గడచినా ఏపీకి రాజధాని అన్నది లేకుండా పోయింది. అది ఒక రకంగా అయిదు కోట్ల ఆంధులకు తీరని బాధగా ఉంది. రాజధాని అంటేనే ఒక సెంటిమెంట్. హైదరాబాద్ తెలంగాణాకు పోవడం వల్ల ఆంధ్రులు తమ ఆత్మ గౌరవం దెబ్బ తిందని భావించారు.

దానిని తిరిగి నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉంది. ఆ విషయంలో చంద్రబాబు ఏమీ పెద్దగా చేయలేకపోయారు అనే 2019లో ఆయన్ని ఓడించి జగన్ ని అధికారంలోకి తెచ్చారు. కానీ జగన్ ఏమీ చేయలేకపోయారు అన్న బాధ అయితే ఉంది. మూడు రాజధానుల పేరుతో జగన్ చేసిన ప్రయోగం ప్రయోగశాల నుంచే బయటకు రాలేదు. నాలుగున్నరేళ్ళ క్రితం ఆయన నిండు అసెంబ్లీలో గొప్పగా ప్రకటించిన మూడు రాజధానులు ఆరంభంలో చాలా గొప్పగా అనిపించాయి.

ఏపీ దశ దిశను మారుస్తాయని అంతా అనుకున్నారు. చివరికి చూస్తే ఏమీ లేదని శూన్యంలో గాలిని పోగు చేయడం లాగానే ఉందని నిట్టూర్చారు. పోనీ అమరావతిని అయినా రాజధానిగా అభివృద్ధి చేసి ఉంటే ఎంతో కొంత మేలు అనుకుంటే అదే లేదు అన్నది కూడా ఏపీ జనం బాధ. మరి ఆ విధంగా చూస్తే కనుక రాజధాని అన్నది వైసీపీకి ఒక దెబ్బ గానే చూస్తున్నారు.

ఇక రోడ్లు. ఇవి మౌలిక సదుపాయాల కిందకూ వస్తాయి. దాంతో పాటు ఈ రోజున నిత్యావసరంగానూ రోడ్లు ఉన్నాయి. రోడ్డు లేకపోతే సగటు జీవి చికాకు ఇంతా అంతా కాదు. తన ఊరికి రోడ్డు పడితే బ్రహ్మాండంగా పాలన సాగుతోంది అని భావిస్తారు. ఈ చిన్న లాజిక్ ని వైసీపీ పెద్దలు మిస్ కావడం వల్ల రోడ్లు కూడా ఈసారి ఎన్నికల్లో వైసీపీని ఇబ్బంది పెట్టే మరో కీలక అంశంగా ఉండవచ్చు అని అంటున్నారు.

జగన్ ప్రభుత్వం అయితే వాలంటీర్ల వ్యవస్థను తెచ్చామని చెప్పుకుంటోంది. గ్రామ సచివాలయాలను చూపిస్తోంది. అలాగే నాడు నేడు కింద విద్యాలయాలు. వైద్యాలయాలు కూడా బాగుపడ్డాయి. అంతా బాగానే ఉంది అనుకున్నా కూడా రోడ్లు అత్యవసరం కదా మరి దాని మీద ఎందుకు శ్రద్ధ పెట్టలేదు అని అడుతున్నారు.

సంక్షేమం పేరుతో వయో వృద్ధులకు మూడు వేల రూపాయల సామాజిక పెన్షన్ ని ఇస్తున్నారు. అది కూడా వెల్ అండ్ గుడ్ గానే ఉంది. ఇంకా అనేక పధకాలు బాగానే ఉన్నాయి. కానీ అభివృద్ధి ఎక్కడ అంటే వైసీపీ నేతలు గుక్క తిప్పుకోకుండా జవాబు ఇవ్వాల్సిందే. ఈ విషయంలోనే అంతా ఆలోచిస్తున్నారు. ఈ డబుల్ ఆర్ డేంజర్ ఎంత చేస్తుంది. జన సామాన్యంలో దీనికి ఉన్న ప్రభావం ఎంత అన్నదే ఇపుడు వైసీపీ లోపలా బయటా హాట్ డిస్కషన్ గా ఉంది. చూడాలి మరి జనం తీర్పు ఎలా ఉండబోతోందో.