Begin typing your search above and press return to search.

జీవన్ రెడ్డి ఓటమికి కారణాలేంటో తెలుసా

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో సీనియర్లకు సముచిత స్థానం దక్కుతుందని అనుకున్నారు

By:  Tupaki Desk   |   9 Dec 2023 2:45 AM GMT
జీవన్ రెడ్డి ఓటమికి కారణాలేంటో తెలుసా
X

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ సీనియర్లు మాత్రం ఓటమి పాలవ్వడం గమనార్హం. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా పోటీలో ఉన్నా పరాజయం పాలయ్యారు. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డిని ఓటర్లు ఎందుకో పక్కన పెట్టారు. జగిత్యాలలో తనకంటూ ప్రత్యేకత సాధించుకున్న ఆయనకు ఓటమి భారం ఆలోచనలకు గురి చేసింది. ఆయన ఓటమికి స్పష్టమైన కారణాలు ఏంటనేది మాత్రం తెలియడం లేదు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో సీనియర్లకు సముచిత స్థానం దక్కుతుందని అనుకున్నారు. కానీ వారే ఓటమి పాలు కావడంతో చేసేది లేకపోవడంతో బాధల్లో మునిగిపోయారు. జిల్లా నుంచి ఎన్నికైన సీనియర్లు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లకు మంత్రి పదవులు దక్కాయి. జీవన్ రెడ్డి గెలిస్తే కూడా కీలక శాఖ అప్పగించే అవకాశం ఉండేది. కానీ బ్యాడ్ లక్ ఆయన పరాజయం చవిచూడటంతో ఆయన కల నెరవేలేదు. ఆయన ఓటమికి గల కారణాలు తెలుసుకునే పనిలో పడిపోయారు.

తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్లు ఆయన ఓడిపోతారని అనుకోలేదు. బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. జీవన్ రెడ్డి (జగిత్యాల), జగ్గారెడ్డి (సంగారెడ్డి), మధు యాష్కీ (ఎల్ బీ నగర్), షబ్బీర్ అలీ (నిజామాబాద్ అర్బన్) లు అనూహ్యంగా ఓటమి పాలయ్యారు.

1983లో టీడీపీ నుంచి జగిత్యాల ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నాదెండ్ల భాస్కర్ రావు మంత్రివర్గంలో పంచాయతీ శాఖ మంత్రిగా పనిచేశారు. 1985లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గొడిశెల రాజేశం గౌడ్ చేతిలో ఓడిపోయారు. 1989లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994లో మళ్లీ ఓటమి పాలయ్యారు. 1996 లో జరిగిన ఉప ఎన్నికలో గెలిచారు. తరువాత 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టారు.

2004 నుంచి 2009 వరకు రాజశేఖర్ రెడ్డి హయాంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రికార్డు సాధించారు. 2018లో మళ్లీ ఓటమి పాలయ్యారు. 2019లో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో సంజయ్ కుమార్ చేతిలో మళ్లీ పరాభవానికి గురయ్యారు.

ఇప్పుడు కూడా ఓటమి కావడంతో విచారం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో ఓటమి పాలు కావడం జీర్ణించుకోలేకపోతున్నారు. జగిత్యాల ఓటర్లు ఇస్తున్న తీర్పుకు శిరసావహిస్తానని చెబుతున్నా లోపల మాత్రం ఆయన బాధ తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు స్థానం లేకుండా పోవడంపై దిగులు చెందుతున్నారు.