Begin typing your search above and press return to search.

ముకేశ్ అంబానీ ఇంటి ఆడపిల్లకు ఇచ్చే ప్రయారిటీ ఎంత?

వయసుతో సంబంధం లేకుండా కుటుంబంలోని పిల్లలైనా.. పెద్దలైనా ఎవరి బలాబలాలు వాళ్లకు ఉంటాయని.. అందుకే ఇంట్లోని ఐదుగురం.. ఒకరి నుంచి మరొకరం బోలెడన్ని విషయాల్ని నేర్చుకున్నామని పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   28 Oct 2023 4:30 PM GMT
ముకేశ్ అంబానీ ఇంటి ఆడపిల్లకు ఇచ్చే ప్రయారిటీ ఎంత?
X

ఎవరెన్ని చెప్పినా అమ్మాయి అమ్మాయే.. అబ్బాయి అబ్బాయే అంటారు. ఒక ఇంట్లో అబ్బాయి.. అమ్మాయి ఉంటే.. వారిద్దరిని సమానంగా పెంచే విషయంలో తేడాలు ఉంటాయన్న మాట వినిపిస్తూనే ఉంటుంది. కొందరింట్లో మాత్రం రోటీన్ కు భిన్నంగా అబ్బాయి కంటే అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచే ధోరణి కనిపిస్తూ ఉంటుంది. అందరి ఇళ్ల సంగతిని కాసేపు పక్కన పెట్టి.. అపర కుబేరుడు.. విశాల భారత్ లో అత్యంత సంపన్నుడైన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట్లో అమ్మాయికి ఉండే ప్రాధాన్యత ఏమిటి? ఎంతటి ప్రయారిటీ ఇస్తారు? ఇద్దరు కొడుకులు.. ఒక్కగానొక్క కుమార్తె ఉన్న వేళ.. ఆమెకు ముకేశ్ అంబానీ దంపతులు ఇచ్చే విలువెంత? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికరంగా కనిపించక మానదు.

దేశంలో లక్షలాది కంపెనీలు ఉన్నప్పటికీ.. రిలయన్స్ సంస్థ తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. అన్నింటికి మించిన ఈ సంస్థ నిర్వహించే వార్షిక సమావేశానికి అంబానీ కుటుంబం యావత్ హాజరు కావటం.. ఈ సందర్భంగా తమ ఇంట వారన్నట్లుగా మదుపరుల విషయంలో వారు ప్రదర్శించే తీరు.. వార్షిక సమావేశ వేళ.. ఆర్థిక అంశాల చుట్టూనే విషయాలు పరిమితం కాకుండా.. ఒక కుటుంబ సమావేశాన్ని నిర్వహించే తీరు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా నిర్వహించిన వార్షిక సమావేశంలో తన భర్త.. తాను ఇంట్లో పిల్లల విషయంలో అనుసరించే విధానాల గురించి నీతా అంబానీ చెప్పుకొచ్చారు.

తమకున్న (ఈషా.. ఆకాశ్.. అనంత్) ముగ్గురు పిల్లలకు.. సంస్థకు చెందిన మూడు అనుబంధ వ్యాపార బాధ్యతల్ని అప్పగించటం తెలిసిందే. ఈషాకు రిలయన్స్ రిటైల్.. ఆకాశ్ కు రిలయన్స్ డిజిటల్.. అనంత్ కు న్యూ ఎనర్జీ వ్యాపారాన్ని అప్పగించటం తెలిసిందే. ఇంట్లో మాదిరే.. వ్యాపారంలోనూ ముగ్గురికి సమాన స్థాయి కల్పించినట్లుగా నీతా అంబానీ పేర్కొన్నారు. ప్రతి విషయంలోనూ చిన్నప్పటి నుంచి ముగ్గురిని సమానంగా తాము పెంచామన్నారు.

వయసుతో సంబంధం లేకుండా కుటుంబంలోని పిల్లలైనా.. పెద్దలైనా ఎవరి బలాబలాలు వాళ్లకు ఉంటాయని.. అందుకే ఇంట్లోని ఐదుగురం.. ఒకరి నుంచి మరొకరం బోలెడన్ని విషయాల్ని నేర్చుకున్నామని పేర్కొన్నారు. తన పిల్లలకు ఉన్న ఆలోచనల్ని చెప్పుకొచ్చిన నీతా అంబానీ మాటల్లో చూస్తే.. ‘‘ప్రపంచాన్ని సురక్షితమైన ప్రదేశంగా.. ఉత్తమంగా తీర్చిదిద్దే దిశగా అనంత్ ముందుకు సాగుతున్నాడు. ఆకాశ్ ‘జియో’తోడిజిటల్ విప్లవాన్ని క్రియేట్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఇక.. ఈషా ఇటు రిటైల్ తో పాటు అటు రిలయన్స్ ఫౌండేషన్ బాధ్యతల్లో చురుగ్గా ఉంది. వారి కంటూ ప్రత్యేకమైన బలాలు ఉన్నాయి. మా ఇంట్లో ఆడ పిల్లైనా.. మగ పిల్లాడైనా సమానమే. ఈ విషయాన్ని ఆడపిల్లలు గ్రహించి.. తాము తమ సోదరుల కంటే తక్కువ కాదని తెలుసుకోవాలి. నా ఇద్దరు కొడుకులు ఏదైతే చేయగలరో.. నా కూతురు అది చేయగలిగేలా పెంచాను. రిలయన్స్ వ్యాపారాల్లో తన ఇద్దరు సోదరుల మాదిరే.. తనకూ సమాన వాటా దక్కుతుంది’’ అని స్పష్టం చేశారు.

అంతేకాదు.. పుట్టుకతోనే ఎవరూ పరిపూర్ణులు కారని.. తప్పులు చేయటం.. పొరపాట్లు చేయటం తప్పు కాకున్నా.. వాటి నుంచి పాఠాలు నేర్చుకోకపోవటం తప్పే అవుతుందని.. కాబట్టి.. పొరపాట్లనే మన విజయానికి సోపానాలుగా మార్చుకోవాలన్నారు. ఇలాంటి విషయాలే చిన్నతనం నుంచి తన పిల్లలకు చెప్పి పెంచినట్లుగా చెప్పిన నీతా అంబానీ మాటలు అందరిని ఆకర్షించేలా మారాయి. అంతేకాదు.. నీతా ముకేశ్ అంబానీ ఇంట్లో పిల్లలు ఎలా పెరిగారన్న విషయాన్ని ఆమె తన తాజా ప్రసంగంతో అందరికి అర్థమయ్యేలా చెప్పారని చెప్పాలి.