గతం గతః... కేసీఆర్ ముందున్న టార్గెట్ ఇదే...
ఇక, తాజాగా సోమవారం నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలోనూ ఆయన అంత ఉత్సాహంగా కనిపించలేదు.
By: Tupaki Desk | 6 Dec 2023 10:18 PM ISTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరాజయాన్ని చవిచూసిన.. మాజీ సీఎం కేసీఆర్ నీరసించి పోయారనే వాదన వినిపిస్తోంది. ఎన్నికల ఫలితాల వెల్లడి ముగిసిన తర్వాత.. తన పరాజయం(అధికారం) తేలిపోయిన తర్వాత.. ఆయన మౌనంగా నిష్క్రమించి.. ఫామ్ హౌస్‌కు చేరుకున్నారు. ఎవరు ఏమైనా ఫర్లేదు .. అన్నట్టుగా వ్యవహరించారనే టాక్ వినిపించింది. ఇక, తాజాగా సోమవారం నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలోనూ ఆయన అంత ఉత్సాహంగా కనిపించలేదు.
అంటే.. ఆయన మనసు కకావికలం అయిపోయింది. తాను పెట్టుకున్న ఆశలు కరిగిపోయాయని ఆయన భావిస్తున్నారు. అంతేకాదు.. తీవ్ర మనోవేదనలో కూడా కూరుకుపోయారు. అధినేతేఇలా అయితే.. ఇక, క్షేత్రస్థాయిలో నాయకుల పరిస్థితి ఏంటి? అనేది చర్చకు వస్తోంది. చాలా వరకు జిల్లాల్లో నాయకులు కూడా కుంగిపోయారు. దీంతో వారంతా మౌనంగా ఇంటికే పరిమితమయ్యారు. అయితే.. ఇప్పుడు ఇలా అవమన భారంతో కుంగిపోవడం సహజమే అయినా... ఇది కీలకమైన సమయమని అంటున్నారు పరిశీలకులు.
ఒకటి... మరో మూడు మాసాల్లో పార్లమెంటు ఎన్నికలకు రంగం సిద్ధం కానుంది. అదేసమయంలో మోడీ ప్రభ దేశవ్యాప్తంగా వెలిగిపోతోంది. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుంటే.. తెలంగాణలోనూ మోడీ ప్రబావం కనిపించడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. ఏమీ లేని.. తెలంగాణలో తాజా ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలు దక్కించుకుంది. ఇదే ఊపు కొనసాగించాలని పార్టీ నిర్ణయించుకుంది. దరిమిలా.. వచ్చే పార్లమెంటు ఎన్నికలను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది.
అదేవిధంగా గెలిచిన కాంగ్రెస్ కూడా.. రేపోమాపో.. అధికారంలోకి రాగానే పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగనుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్.. మనోనిబ్బరంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఆయనే కుంగిపోతే.. క్షేత్రస్థాయిలో కేడర్ మరింత కుంగిపోతుందని చెబుతున్నారు. ఇప్పుడు కీలక సమయం ఆసన్నం కావడం.. అదేసమయంలో అతి పెద్ద లక్ష్యంగా ఏర్పాటు చేసిన బీఆర్ ఎస్‌ను పార్లమెంటు ఎన్నికల్లో పరుగులు పెట్టించడం.. ఇప్పుడు ఆయన ముందున్న కీలక బధ్యతలుగా గుర్తు చేస్తున్నారు. గతం గతః అనే సూత్రాన్ని పాటించి.. ఆయన పుంజుకోవాలని.. కోరుతున్నారు.
